న్యూఢిల్లీ: విభిన్న రంగాల్లో ఉన్న వేదాంత గ్రూప్ రాజస్తాన్‌లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు ప్రకటించింది. యూకేలో జరిగిన రైజింగ్ రాజస్తాన్ రోడ్‌షోలో రాజస్తాన్ సీఎం భజన్ లాల్ శర్మతో వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ భేటీ అయి తాజాగా పెట్టుబడి ప్రతిపాదనలు చేశారు. వేదాంత కంపెనీ అయిన హిందుస్తాన్ జింక్ రూ.30,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది.
జింక్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 1.2 మిలియన్ టన్నుల నుంచి 2 మిలియన్ టన్నులకు, వెండి ఉత్పత్తిని 800 నుంచి 2,000 టన్నులకు చేరుస్తారు. ఒక మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం గల ఫెర్టిలైజర్ ప్లాంటు నెలకొల్పుతారు. రోజుకు 3 లక్షల బ్యారెల్స్‌కు సామర్థ్యం పెంచేందుకు కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ రూ.35,000 కోట్లు పెట్టుబడి చేయనుంది. 10,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన వనరులను అభివృద్ధి చేసేందుకు సెరెంటికా రెన్యూవబుల్స్ రూ.50,000 కోట్లు ఖర్చు చేయనుంది.
ఉదయ్‌పూర్ సమీపంలో లాభాపేక్ష లేకుండా ఇండస్ట్రియల్ పార్క్ నెలకొల్పనున్నట్టు వేదాంత గ్రూప్ ప్రకటించింది. తాజా పెట్టుబడులు కార్యరూపం దాలిస్తే కొత్తగా రెండు లక్షల మందికిపైగా ఉపాధి లభిస్తుందని సంస్థ వెల్లడించింది. ఇప్పటికే రాజస్తాన్‌లో వేదాంత గ్రూప్ కంపెనీలు రూ.1.5 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు చేయడం విశేషం. దేశంలో ఉత్పత్తి అవుతున్న ముడి చమురులో కెయిర్న్ వాటా 25% ఉంది. హిందుస్తాన్ జింక్, కెయిర్న్ ప్రధాన కార్యకలాపాలకు రాజస్తాన్ కేంద్రంగా ఉంది. కాగా ఒడిశాలో రూ. 1 లక్ష కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ శుక్రవారం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment