వైఎస్ఆర్సీపీలో చేరిన వనమా
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాను 40 ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పనిచేస్తే, ఆ పార్టీ తనకు నమ్మక ద్రోహం చేసిందని వనమా మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను సాధించడం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే సాధ్యమని, రాష్ట్రానికి వైఎస్ జగన్ లాంటి యువ నాయకత్వం అవసరమని ఆయన అన్నారు.
హైదరాబాద్లో వైఎస్ జగన్ సమక్షంలో ఆయన మంగళవారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాను కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులను వదులుకుని వైఎస్ఆర్సీపీలో చేరినట్లు చెప్పారు. ఖమ్మంలో బీసీలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని వనమా మండిపడ్డారు.