లింగయ్యా.. గిదేందయ్యా..!
కానిస్టేబుల్ తల్లిదండ్రుల ఆమరణ దీక్ష
డబ్బులు ఇప్పించి.. న్యాయం చేయాలని వేడుకోలు
ఖమ్మం అర్బన్ : ఉండేందుకు ఇల్లు లేదు.. కొడుకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదు.. ఆ డబ్బులు ఇప్పించి.. ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరుతూ ఓ కానిస్టేబుల్ తల్లిదండ్రులు నగరంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నాచౌక్‌లో గురువారం ఆమరణ దీక్ష చేపట్టారు. తల్లిదండ్రులు కోడి మల్లయ్య, పుల్లమ్మ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మాది వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలం రేపోణి గ్రామం. మాకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు లింగయ్య ఖమ్మం అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. మిగతా ఇద్దరు కొడుకులు ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. ఖమ్మంలోని మేకల నారాయణ నగర్లో ఉన్న రూ.కోటి విలువ చేస్తే ఆస్తిని తన పేర రాయించుకుని.. తమ్ముళ్లకు అన్యాయం చేస్తున్నాడు. స్వగ్రామంలో ఉన్న ఎకరం పొలం కూడా బయటి మార్కెట్లో రూ.10లక్షలకు అడుగుతుంటే.. బెదిరించి దానిని కూడా రూ.5.75లక్షలకు తీసుకున్నాడు. దీనిపై అనేక చోట్ల ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని, తాను కానిస్టేబుల్‌ను అంటూ బెదిరిస్తున్నాడని ఆరోపించారు.
ఇద్దరు తమ్ముళ్లు మాట్లాడుతుంటే చంపుతానని బెదిరిస్తున్నాడని తెలిపారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వృద్ధ దంపతులను అర్బన్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీనిపై ఎస్సై మొగిలిని వివరణ కోరగా.. తల్లిదండ్రులు, కొడుకు నుంచి వివరాలు సేకరిస్తున్నామని, దీనిపై ఉన్నతాధికారుల సూచనల ప్రకారం నడుచుకుంటామని తెలిపారు. అలాగే కానిస్టేబుల్ లింగయ్య వివరణ కోరగా.. కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నారని, గతంలోనే తమ గ్రామంలో సమస్యను పెద్దమనుషులు పరిష్కరించి.. అగ్రిమెంట్ రాసుకున్నట్లు తెలిపారు. ఉద్యోగం ఉందనే తనపై కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నాడు.