ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు
ఖానాపూర్, న్యూస్‌లైన్ : మండల కేంద్రమైన ఖానాపూర్లోని ఐబీ చౌరస్తాలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ సంఘటనను నిరసిస్తూ టీడీపీ నాయకులు శనివారం ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఎన్టీఆర్ చౌరస్తాలోని నిర్మల్-ఖానాపూర్ రహదారిపై రాస్తారోకో చేశారు. టీడీపీ మండల అధ్యక్ష, కార్యదర్శులు ఆకుల శ్రీనివాస్, రాజగంగన్న, మాజీ ఎంపీపీ రామేశ్వరరెడ్డి, మాజీ జెడ్పీటీసీ రాథోడ్ రాము, పీఏసీఎస్ చైర్మన్ ఆకుల వెంకాగౌడ్, వైస్ చైర్మన్ ముజీబ్ మాట్లాడుతూ మండలంలో విగ్రహాలకు రక్షణ కరువైందని అన్నారు. సుర్జాపూర్‌లో చోటు చేసుకున్న ఘటన మరువకముందే మరొకటి చోటు చేసుకోవడం సిగ్గుచేటని అన్నారు. సంఘటనలకు బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. సీఐ జీవన్‌రెడ్డి, ఎస్సై రాము, పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళన విరమింపజేశారు.
ఉద్రిక్తంగా మారిన బంద్
ఎన్టీఆర్ విగ్రహాన్ని దగ్ధం చేయడాన్ని నిరసిస్తూ టీడీపీ విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య సముదాలు బంద్ చేయాలని కోరింది. దుకాణాలు బంద్ చేయించడాన్ని పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ నాయకులు అక్కడే బైఠాయించారు. తాము శాంతియుతంగానే బంద్ చేయిస్తున్నామని, విగ్రహాన్ని దగ్ధం చేసిన వారిని పట్టుకోవాల్సింది పోయి తమను అడ్డుకోవడమేమిటని పోలీసులను ప్రశ్నించారు. దీంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్యక్రమంలో నాయకులు అంకం రాజెందర్, కొక్కుల ప్రదీప్, సాడిగె రాజు, షబ్బీర్‌పాషా, గోడాపురం సందీప్, బండారి రవిందర్, బానావత్ రాంచంద్, కనకయ్య, చిన్న రాజన్న, కొండ నారాయణ, కరిపె శ్రీనివాస్, నయిం, నయింఖాన్, నారపాక నర్సయ్య, గాజుల గంగన్న, జీవన్, మొగిలి, గుగ్లావత్ లక్ష్మణ్, లోకిని రాము, గౌరికార్ రాజు, నిట్ట రవి, రాంచందర్ పాల్గొన్నారు.