పాతవన్నీ వదిలేద్దాం..
కృష్ణా వివాదంపై ఇరు రాష్ట్రాల నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో ఇరు రాష్ట్రాలకు ఉన్న వాటా, ఇప్పటివరకు జరిగిన వినియోగం వంటి అంశాలన్నింటినీ పూర్తిగా పక్కన పెట్టాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు అంగీకారానికి వచ్చాయి. ప్రస్తుతం సాగర్‌లో అందుబాటులో ఉన్న నీటిని అవసరాల మేరకు ఇరు రాష్ట్రాలు ఎలా వినియోగించుకోవాలన్న దానిపైనే దృష్టి సారించాలని నిర్ణయించాయి. అయితే వచ్చే ఖరీఫ్ నుంచి నిర్ణీత వాటాల మేరకే నీటి వినియోగం జరగాలని.. ఎక్కడా ఉల్లంఘనకు పాల్పడకుండా, ముందుగానే వాటర్ ప్రోటోకాల్‌లను ఇచ్చిపుచ్చుకోవాలనే అవగాహనకు వచ్చాయి.
ఈ అంశంలో ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన అవగాహన మేరకు ఆయా రాష్ట్రాల నీటి పారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు మురళీధర్, వెంకటేశ్వర్రావు శనివారం చర్చలు ప్రారంభించారు. ఇరు రాష్ట్రాల పరిధిలో కుడి, ఎడమ కాలువల కింద ఉన్న ఖరీఫ్, రబీ పంటల వివరాలు, వాటికి అవసరమయ్యే నీటి వివరాలపై చర్చించారు.
తాగునీటికి 25 టీఎంసీలు..
ప్రస్తుతం సాగర్‌లో మొత్తం లభ్యతగా ఉన్న 63 టీఎంసీల్లో 25 టీఎంసీల మేర తాగునీటి అవసరాలకు పక్కనపెట్టి... మిగతా నీటిని మాత్రమే వ్యవసాయం, ఇతర అవసరాలకు వినియోగించుకోవాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏపీకి కుడి కాలువ కింద మిగిలిన ఖరీఫ్ పంటల సాగు 2 లక్షల ఎకరాల వరకు ఉందని, అలాగే గుంటూరు, ప్రకాశంలలో 1.52 లక్షల ఎకరాల వరి, మరో 5 లక్షల ఎకరాల ఆరుతడి పంటల రబీ అవసరాలకు నీరు అవసరమయ్యే అవకాశం ఉందని ఏపీ తెలియజేసింది. వీటికి 8 నుంచి 12 టీఎంసీల నీరు అవసరం ఉంటుందని స్పష్టం చేసింది.
ఇక తెలంగాణ అధికారులు ఎడమ కాలువ కింద ఖమ్మంలో మిగిలిన 1.5 లక్షల ఎకరాల ఖరీఫ్ అవసరాలకు, నల్లగొండలో 2 లక్షల ఎకరాల రబీ అవసరాలకు నీరు అవసరమని చెప్పినట్లుగా తెలిసింది. వీటికి 12 టీఎంసీల నీరు అవసరమని తేల్చినట్లు సమాచారం. వీలునుబట్టి ఆదివారం లేదా సోమవారం మరోమారు చర్చలు జరిపి తుది నిర్ణయానికి రావాలని ఈఎన్సీలు నిర్ణయించినట్లుగా తెలిసింది.
కేంద్రానికి గవర్నర్ నివేదిక..
సాగర్ జలాల వివాదం శాంతిభద్రతల సమస్యగా మారడంపై కేంద్ర హోం శాఖ వివరణ కోరిన నేపథ్యంలో.. మొత్తం అంశాలను పేర్కొంటూ గవర్నర్ కేంద్రానికి నివేదిక పంపినట్లుగా తెలుస్తోంది. ఘర్షణ మొదలైన వెంటనే ఇరు రాష్ట్రాల సీఎంలు స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారని... ఆ వెంటనే ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించి సమస్యకు పరిష్కారం తేగలిగామని గవర్నర్ అందులో పేర్కొన్నట్లు సమాచారం.
సీఎంల స్థాయిలో మరిన్ని చర్చలు..
నదీ జలాల విషయంలో అధికారులు, మంత్రుల స్థాయిలో సమస్యకు పరిష్కారం దొరకని పక్షంలో ముఖ్యమంత్రుల స్థాయి భేటీలను నిర్వహించాలని ఇరు రాష్ట్రాల సీఎంలు నిర్ణయించినట్లు తెలిసింది. జల వివాదాలతో పాటు ఎలాంటి వివాదాన్నైనా రాష్ట్రాల పరిధిలోనే పరిష్కరించుకోవాలన్న గవర్నర్ సూచనపై వారు అంగీకారం తెలిపినట్లు సమాచారం. శనివారం సీఎంల భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఇరు రాష్ట్రాల మంత్రులు హరీశ్‌రావు, దేవినేని ఉమా కూడా అవసరాన్ని బట్టి మరిన్ని సీఎంల భేటీలు ఉంటాయని చెప్పారు.