వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టుల భర్తీకి రేపే నోటిఫికేషన్
సాక్షి, నిజామాబాద్: నిరుద్యోగ యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టుల భర్తీకి ఈనెల 28న నోటిఫికేషన్ విడుదలవుతుందని జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న ప్రకటించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ పోస్టుల భర్తీ షెడ్యూల్‌ను ఆయన ప్రకటించారు. అభ్యర్థులు జనవరి 12లోగా పరీక్ష ఫీజును చెల్లించి, 13లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
రాత పరీక్షను ఫిబ్రవరి 2న నిర్వహిస్తామని, పది రోజుల్లో మెరిట్ జాబితా ప్రకటిస్తామని అన్నారు. ఫిబ్రవరి 25 వరకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని, ఫిబ్రవరి నెలాఖరులోగా వారికి పోస్టింగ్‌లు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో 65 వీఆర్ఓ, 94 వీఆర్ఏ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. రాత పరీక్షను ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించగా, దరఖాస్తుల ప్రక్రియను సెంటర్ ఫర్ గుడ్‌గవర్నెన్స్ ద్వారా కొనసాగుతుందని అన్నారు. గత ఏడాది నియామకాలను బట్టి పరిశీలిస్తే ఈసారి జిల్లాలో 40 వేల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకునే అవకాశాలున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.
పరీక్ష కేంద్రాలను జిల్లాలోని పట్టణ కేంద్రంలోనే ఏర్పాటు చేస్తామని, ఇందుకు అవసరమైన ఇన్విజిలెటర్లు, రూట్ ఆఫీసర్లు, ఎగ్జామినర్ల నియామకం చేపడతామన్నారు. అభ్యర్థులు రూ. 300 చెల్లించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.150, వికలాంగుల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ పోస్టులకు మీసేవా ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి ఠీఠీఠీ.ఛిఛ్చి.ఛిజజ.జౌఠి.జీ వెబ్సైట్లో పూర్తి సమాచారం ఉంటుందని, అభ్యర్థులు ఈ సైట్లో చూసి వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు. ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకునేందుకు మీసేవా కేంద్రాలు తీసుకోవాల్సిన రుసుమును త్వరలో ప్రకటిస్తామని ప్రద్యుమ్న పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె.హర్షవర్ధన్ పాల్గొన్నారు.