రెవెన్యూ రికార్డులు మాయం
అక్రమార్కుల పనేనంటూ అనుమానాలు
సిబ్బంది ఇష్టారాజ్యంపై గతంలో ఆరోపణలు
కొడకండ్ల : మండలంలోని భూముల సంబంధించిన కీలక రికార్డులు మాయమయ్యాయి. తహసీల్దార్ కార్యాలయంలో మండల రెవెన్యూ పరిధిలోని 16 గ్రామాలకు సంబంధించి 60 ఏళ్లకు పైబడి ఉండాల్సిన రికార్డులు కనిపించకపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. పదేళ్ల వరకు ఆయా రికార్డుల బాధ్యతలను కార్యాలయ సిబ్బందే బాధ్యత వహించగా, ఆతర్వాత వీఆర్ఏలు, కార్యాలయానికి సంబంధం లేని పలువురు అప్పగించారు. దీంతో భద్రత కరువై రికార్డులు లేకుండాపోయాయి. ఈ విషయమై డీటీ మాన్యానాయక్, రికార్డు అసిస్టెంట్ ప్రణీత్‌ను వివరణ కోరగా కొన్ని రికార్డులు కనిపించడం లేదన్నారు. 60 ఏళ్ల నుంచి భూములకు సంబంధించిన పట్టాదారు, సర్వే నంబర్ల వివరాలతో కూడిన పహాణీ, తదితర కార్యాలయంలో ఉండాల్సిన రికార్డులు లేవు. ఏడాదిన్నర క్రితం విధుల్లో చేరిన సమయంలో రికార్డుల వివరాలను చార్్జలో సమర్పించలేదని రికార్డు అసిస్టెంట్ తెలిపారు. ఖాస్రా, ఖల్ఖస్రా, సేత్వార్ వంటి కీలకమైన రికార్డులు చాలా గ్రామాలకు సంబంధించినవి అడ్రస్ లేకుండా పోయాయి. సేత్వార్ పహాణీలు రేగుల, నర్సింగాపురం, లక్ష్మక్కపెల్లి గ్రామాలకు సంబంధించినవి ఉండగా, మిగతా గ్రామాలవి లేవు. ఖాస్రా పహాణీలు పోచారం, పాకాల, వడ్డేకొత్తపెల్లి, రేగుల, కొడకండ్ల, రంగాపురం, రామవరం, పోచంపెల్లి, పెద్దవంగర, గంట్లకుంట, లక్ష్మక్కపెల్లి, మొండ్రాయి గ్రామాల్లో కొన్ని మాత్రమే ఉండగా, పూర్తి స్థాయిలో రికార్డులు లేవు. మిగతా ఐదు గ్రామాలకు సంబంధించినవి అసలు కనిపించడం లేదు. నాలుగైదేళ్లుగా తహసీల్దార్ కార్యాలయం అవినీతికి నిలయంగా మారి ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నకిలీ పాస్ పుస్తకాల తయారీ ముఠా>తో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డారని ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో అక్రమాలు కప్పిపుచ్చుకొనేందుకే కొందరు కార్యాలయానికి సంబంధించిన వారే భూములకు సంబంధించిన కీలక రికార్డులను మాయం చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కీలకమైన ఈ రికార్డు గదిని వీఆర్ఓ, వీఆర్ఏల కుటుంబసభ్యులకు కేటాయించడం వల్లే రికార్డులు మాయమయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.