పాక్: సింధ్ ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం
కరాచీ: పాకిస్తాన్ సింధ్ ఫ్రావిన్స్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, మొహజిర్ క్వామీ మూవ్మెంట్(ఎంక్యూఎం) నాయకుడు ఖవాజా హస్సన్‌పై శనివారం హత్యాయత్నం జరిగింది. బక్రీద్ పండుగ సందర్భంగా కరాచీ నగరంలోని ఓ మసీదుకు వచ్చిన ఖవాజా.. ప్రార్థన అనంతరం తిరిగి బయలుదేరిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. వెంటనే తేరుకున్న ఖవాజా బాడీగార్డులు సైతం ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక చిన్నారి సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
పోలీసు దుస్తుల్లో మూడు బైక్‌లపై వచ్చిన అగంతకులు ఖవాజా వాహనాన్ని అడ్డుకుని కాల్పులు జరిపారని, అయితే ఆయన సురక్షితంగా బయటపడ్డారని, అంగరక్షకులకు, అగంతకుల మధ్య కాల్పులు జరిగాయని కరాచీ పోలీసులు తెలిపారు. కాల్పుల్లో ఒక అగంతకుడు చనిపోగా మరొకరు గాయపడ్డారు. అటుగా వెళ్తున్న ఒక చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోగా ముగ్గురు బాడీగార్డులు గాయపడ్డారని, మిగిలిన అగంతకులు పారిపోయారని వివరించారు. ఘటన స్థలి నుంచి ఒక బైక్‌తోపాటు 9ఎంఎం పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. దాడికి కారకులెవరనేది తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. ఉర్దూ మాట్లాడే వారికి ప్రాతినిధ్యం వహించే ఎంక్యూఎం పాకిస్తాన్‌లోని నాలుగో అతిపెద్ద రాజకీయ పార్టీ.