జోరుగా పొట్టేళ్ల విక్రయాలు
బక్రీద్‌కు ఏర్పాట్లు పూర్తి
పోచమ్మమైదాన్ : ఇస్లాం ధర్మశాస్త్రం ప్రకారం ముస్లింలకు ముఖ్యమైన పండుగల్లో రెండోది ఈద్ ఉల్ జుహా (బక్రీద్). దీనినే ఖుర్బానీ అనికూడా అంటారు. ఈ పండుగను మంగళవారం నిర్వహించేందుకు ముస్లింలు ఏర్పాట్లు సిద్ధం చేశారు. జంతువును బలి ఇచ్చే పండుగ కనుక ఈద్- ఉల్ -జుహా అంటారు. ఖుర్బానీ అంటే దేవుని పేరుతో పేదవారికి జంతుమాంసం దానం ఇవ్వడం. ఇస్లాం చరిత్రలో ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. నేడు బక్రీద్ కావడంతో వరంగల్‌లోని మండిబజార్, న్యూ రాయపుర, కాజీపేటలలో పొట్టేళ్లను జోరుగా విక్రయిస్తున్నారు. పండుగ రోజున ఖుర్బాని ఇచ్చేందుకు ముస్లింలు పొట్టేళ్లు కొనుగోలు చేస్తుండడంతో ఇదే అదనుగా అమ్మకందారులు ధరలు పెంచేశారు. దీంతో పేద ముస్లింలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.