భారతదేశ ఆక్రమణకు ఐఎస్ కుట్ర!
ఇస్లామిక్ స్టేట్... ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థ. ఇప్పటివరకు కొన్ని దేశాల మీద మాత్రమే దృష్టిపెట్టి అక్కడ రక్తపుటేర్లు ప్రవహింపజేస్తున్న ఐఎస్.. తాజాగా భారతదేశం మీద కూడా దృష్టి పెట్టిందట. భారతదేశాన్ని ఆక్రమించాలని చాలా ఆసక్తిగా ఉందట. ఈ విషయాన్ని నిన్న మొన్నటి వరకు ఆ సంస్థ వద్ద బందీగా ఉండి, క్షేమంగా బయటపడిన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వాసి డాక్టర్ కొసనం రామ్మూర్తి చెప్పారు. శనివారం ఉదయం భారతదేశానికి చేరుకున్న డాక్టర్ రామ్మూర్తి జాతీయ మీడియాతో మాట్లాడారు. భారతదేశ విద్యావ్యవస్థ, ఇక్కడి ఆర్థికవృద్ధి చూసి ఇస్లామిక్ స్టేట్ బాగా ఇంప్రెస్ అయ్యిందని, అందుకే ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నట్లు వాళ్ల సంభాషణల ద్వారా తనకు తెలిసిందని ఆయన అన్నారు.
తనను వాళ్లు శారీరకంగా, మానసికంగా తీవ్రంగా చిత్రహింసలు పెట్టారని, దారుణమైన వీడియోలు బలవంతంగా చూపించి వాళ్ల కార్యకలాపాలను తనకు అర్థం అయ్యేలా చేశారని డాక్టర్ రామ్మూర్తి తెలిపారు. తమ ముందే కొంతమంది బందీలను కొట్టేవారని కూడా అన్నారు. వాళ్లది చాలా దారుణమైన ఉగ్రవాద సంస్థ అని, తమ ఆధిపత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేయాలని చూస్తున్నారని చెప్పారు. తమ నియమ నిబంధనలను ప్రతి ఒక్కళ్లూ పాటించాలన్నదే వాళ్ల ఆశయమన్నారు.
ఐఎస్ వద్ద బందీగా ఉన్న తనను.. వాళ్లకోసం పనిచేయాల్సిందిగా ఒత్తిడి చేశారని, తనకు అంత అనుభవం లేదని చెప్పినా వినిపించుకోలేదని అన్నారు. సుమారు ఏడాదిన్నర పాటు అక్కడే ఉండి వాళ్ల దుశ్చర్యలను ప్రత్యక్షంగా చూసిన రామ్మూర్తి.. తనను విడిపించి సురక్షితంగా ఇక్కడకు తెప్పించడంలో భారత ప్రభుత్వం చేసిన కృషికి కృతజ్ఞతలు తెలిపారు. ఐఎస్ ఉగ్రవాదుల చేతికి చిక్కేముందు ఆయన లిబియాలోని సిర్టె నగరంలో గల ఎల్బిఎన్-ఎ సినా ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేశారు. ఉగ్రవాదులు సుమారు ఏడాదిన్నర క్రితం ఆస్పత్రిలోకి చొరబడి ఆయనను, ఒడిషాకు చెందిన ఇంజనీర్ సామల్ ప్రవాష్ రంజన్‌ను, ఏడుగురు ఫిలిప్పీన్స్ నర్సులను ఎత్తుకెళ్లారు.