ఇంతకీ ఏంటీ.. కాలకేయ 'కిలికి'
తెలుగు సినీ దర్శకుడు రాజమౌళి రూపొందించిన దృశ్యకావ్యం 'బాహుబలి'. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ బాషల్లో విడుదలై రికార్డుల మోత మోగిస్తోన్న ఈ చిత్రరాజం ఎన్నో విశేషాలకు వేదికగా నిలిచింది. ముఖ్యంగా నటీనటుల హావభావాలు, విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు ప్రేక్షకులను మరో విశేషం అమితంగా ఆకట్టుకుంటోంది. అదే 'కిలికి'! థియేటర్ నుంచి బయటకు వచ్చిన వాళ్లు ఒక్కసారైనా దీన్ని తలుచుకోకుండా ఉండలేకపోతున్నారంటే నమ్మాల్సిందే! ఇంతకీ ఏంటీ 'కిలికి'?
సీన్లోకి వెళ్తే.. మాహిష్మతి రాజ్యభారాన్ని తన కుమారులైన భల్లాల దేవ, బాహుబలిలకు అప్పగించాలని భావిస్తుంది శివగామి. ఇద్దరిలో ఎవరు సమర్థులో పరీక్షించి, వారికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయిస్తుంది. సకల విద్యల్లోనూ ఆరితేరిన ఆ అన్నదమ్ములిద్దరూ ప్రతి విషయంలోనూ ఒకరితో ఒకరు పోటీపడుతూ సమవుజ్జీలుగా నిలుస్తారు. దీంతో శివగామికి ఎటూ తేల్చుకోలేని స్థితి ఎదురవుతుంది. సరిగ్గా ఇదే సమయంలో మాహిష్మతి రాజ్య సైనిక రహస్యాలు తస్కరించి, దాడికి సిద్ధమవుతారు 'కాలకేయులు'. వీరు గిరిజన తెగకు చెందిన వారు. వారి ప్రభువు 'కాలకేయుడు'. మాహిష్మతి రాజ్యమ్మీదకు దండెత్తి వచ్చిన కాలకేయ మహారాజుతో శాంతి చర్చలు జరిపేందుకు వెళతారు శివగామి, యువరాజులు. ఈ సీన్లో కాలకేయ పాత్రధారి ప్రభాకర్ ఓ వింత భాషలో మాట్లాడతాడు. అయితే అదేదో నోటికొచ్చిన కారుకూతలు కావు. బాహుబలి సినిమా కోసమే సృష్టించిన ప్రత్యేక భాష అది. దాని పేరే కిలికి!
సృష్టికర్త ఎవరు?
ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకొన్న విషయం మనందరికీ తెలిసిందే.. ఇందులో తమిళ వెర్షన్‌కు పాటలు, మాటలు రాసింది 'మదన్ కార్కీ'. ప్రఖ్యాత తమిళ సినీ రచయిత వైరముత్తు కుమారుడే ఆయన. విడుదలైన భాషలన్నిటిలోనూ వినిపించిన 'కిలికి' భాష సృష్టికర్త కూడా ఆయనే. ఈ కొత్త భాష ఏదో నోటికొచ్చిన కూత కాదని, దాని వెనక ఎంతో వ్యాకరణం దాగుందని చెబుతారీయన.
ఆలోచనకు బీజం..
బాహుబలి సినిమా తమిళ వెర్షన్ మాటల రచయితగా కార్కీ తొలుత ఈ ప్రతిపాదన తీసుకొచ్చారట. రెండేళ్ల కిందట దర్శకుడు రాజమౌళి యుద్ధ సన్నివేశాన్ని వివరించినపుడు కాలకేయులు మాట్లాడే భాష కొత్తగా సృష్టిద్దామని కార్కీ ఆయనతో అన్నారు. దానికి రాజమౌళి అంగీకరించడంతో ఈ భాష పుట్టుకొచ్చింది. 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' లోని ఎల్విష్, స్టార్‌ట్రెక్ సిరీస్‌లోని క్లింగన్ వంటి భాషలను ఆయన స్ఫూర్తిగా తీసుకున్నారు.
క్లిక్ నుంచి కిలికి వరకూ..
కంప్యూటర్ సైన్స్ పట్టభద్రుడైన కార్కీ పరిశోధన కోసం ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ యూనివర్సిటీలో చేరారు. ఈ సమయంలోనే చిన్నారులకు పాఠాలు చెప్పడం లాంటి పార్ట్‌టైం జాబ్స్ చేసేవారు. వివిధ భాషల్లో ప్రవేశమున్న కార్కీ.. పిల్లలకు కూడా ఆ భాషలను నేర్పించడం మొదలు పెట్టారు. ఈ సమయంలోనే ఆయనకు ఓ చిలిపి ఆలోచన వచ్చింది. 'ఏదైనా సరికొత్త భాష కనిపెడితే ఎలా ఉంటుందీ..?' అన్నదే ఆ ఆలోచన. అంతే.. 100 ప్రాథమిక పదాలతో ఓ కొత్త భాషను కనిపెట్టేశారీయన. దీనికి 'క్లిక్' అని పేరు పెట్టారు. ఇందులో మిన్-నేను, నిమ్-మీరు.. లాంటి సింపుల్ పదజాలాన్ని నింపేశారు. ఈ 'క్లిక్'నే బాహుబలి కోసం మరింత విస్తరించి 'కిలికి' చేశారు.
క్లిక్‌లోని ప్రాథమిక పదాలకు మరికొన్ని పదాలు జతకూర్చి 750 పదాలతో సరికొత్త పదజాలాన్ని సృష్టించేశారు. దీనికి 40కి పైగా బలమైన వ్యాకరణ సూత్రాలనూ రచించారు. ప్రస్తుతం వాడుక భాషల్లోని మాటలన్నీ ఇందులోనూ ఉంటాయని, దీనితో పాటలు కూడా రాయొచ్చని కార్కీ చెబుతున్నారు.
కఠినత్వం కోసం..
'కాలకేయ' ప్రభాకర్ మాట్లాడే భాషను మొదట సబ్‌టైటిల్స్ ద్వారా తెర మీద కనిపించేలా చేద్దాం అనుకున్నారు. అయితే అలా చేయడం ద్వారా భావోద్వేగాలు ప్రేక్షకుడికి చేరవని గ్రహించారు. దీంతో యుద్ధక్షేత్రంలో శత్రువు పలుకులు కఠినంగా ఉండేలా.. గ్రామర్ విషయంలో జాగ్రత్త పడ్డారు. నెమ్మదైన మాటలు మృదువుగా, ఘాటైన మాటలు కటువుగా ఉండేట్టు పదాల రూపకల్పన చేశారు. ఉదాహరణకు 'రక్తం' అనే పదాన్ని కిలికిలో 'బ్రుర్ర్స్లా' అని పలుకుతారు. ఇలా కాలకేయ కాఠిన్యాన్ని ప్రేక్షకుడికి గుచ్చుకునేలా చేశారు. అన్నట్టు.. నాలుకతో ప్రభాకర్ చేసే 'టప్ టప్' శబ్దాలు కూడా వ్యాకరణంలో భాగమే!
మీకోసం కొన్ని వాక్యాలు
1. తెలుగు: అతడు బతికే ఉండాలి.
కిలికి: టా బీత్ క్రువూల్ డుంక్రా.
2. తె: అది నిజమా?
కి: లూర్షా క్వే?
3. తె: ఆయుధాలు కిందపడేసి పారిపోండి.
కి: నిమ్ క్ల్కే గదీత్వూ ట్టా కొరోటా-జ్రా రెయ్య్.. ఫుహూ క్ల్కే.
4. తె: ఒక గ్లాసు మంచినీరు ఇస్తారా?
కి: నిమ్ ష్వీక్క్ మిన్ సుర్ప్ ఉనో ఢాబ్ సాస్‌లా ఫిన్హీ క్వే?
5. తె: మూర్ఖంగా మాట్లాడకు.
కి: డంబాడంబా జివ్లా బాహా-నా.