'11 యుద్ధ విమానాలతో బాంబుల వర్షం'
ఇస్తాంబుల్: ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒకేసారి 11 టర్కీకి చెందిన యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించడంతో 45 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మరికొందరు తీవ్ర గాయాలతో తప్పించుకున్నారు. ఈ విషయాన్ని టర్కీ సైనికాధికారులు చెప్పారు.
పదకొండు ఎఫ్-16, ఎఫ్-4 జెట్ యుద్ధ విమానాలతో ఉత్తర ఇరాక్ సరిహద్దులోని కాందిల్ పర్వత ప్రాంతంలో ఉన్న కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ(పీకేకే) ఉగ్రవాద స్థావరాలపై మూకుమ్మడిగా దాడి చేశామని టర్కీ సైన్యం తెలిపింది. దీంతోపాటు రెండు భారీ ఆయుధాల నిల్వ స్థావరాలపై కూడా దాడి చేసినట్లు చెప్పారు. ఈదాడిలో పలు బాంబులు, రెండు రాకెట్ లాంచింగ్ స్టేషన్లు ధ్వంసం అయ్యాయని తెలిపారు.