the king
-
మంచి మాట: రాజుకంటే బలవంతులు..?
ఎంతటి పండితులు, జ్ఞానులు అయినా తమకు అంతా తెలుసని చెప్పరు. ఆ అహంకారం.. లేదా భ్రమ.. భ్రాంతి వారి మాటల్లో ధ్వనించదు. చేతల్లో కూడా స్ఫురించదు. తాము తెలుసుకున్నది స్వల్పమని.. తెలుసుకోవాల్సింది అనంతమని వారికి తెలుసు. కనుకే వారిలో ఒదుగుదల.. వినయం.. సంయమనం. ఇదే వారిని అనుక్షణం అప్రమత్తుల్ని చేసి వారు జ్ఞానాన్వేషణ మీదే దృష్టి పెట్టేలా చేస్తుంది. మూర్ఖుడు అందుకు భిన్నం. తన మూర్ఖత్వం వల్ల పరిహాసాల పాలవుతుంటాడు. తనకంతా తెలుసనుకోవటమే అజ్ఞానం. అంతే కాదు. తనకు తెలిసిందే జ్ఞానమనుకునే అవివేకమే మూర్ఖత్వం. మూర్ఖత్వమంటే వెర్రి పట్టుదల, దుస్సాహసం, అసంబద్ధత, అహేతుకత. బాధ్యాతారాహిత్యం, దురహంకారం, అజ్ఞానం, కుసంస్కారం. వీటి మూర్తీభవత్వమే .. మూర్ఖుడు. తనకు అంతా తెలుసని.. తనకు తెలిసిందే సరైనదన్న ఆలోచన చేస్తాడు. వాస్తవాన్ని చూసే శక్తి లేకపోవటం, ఒకవేళ చూడగలిగినా పాక్షికంగానే చూడటం, పెద్దలను గౌరవించకపోవటం, అవాకులు.. చవాకులు పేలటం, ఇతరులను అకారణంగా నిందించటం.. ఈ గుణాల కలబోతే మూర్ఖుడు. మూర్ఖుడు తానే సర్వజ్ఞుడనని అనుకుంటాడు. ప్రతిదీ తనకే తెలుసని ఇతరులకేమీ తెలియదన్నట్టుగా ప్రవర్తిస్తాడు. నిజానికి ఇదే అజ్ఞానం కదా! దీనివల్ల ఇతరులు చెప్పేదేది తను విననవసరం లేదని భావిస్తాడు. వారికి ఆ శక్తే లేదని అతడి ప్రగాఢ విశ్వాసం. జ్ఞానమనే అనంత ప్రవాహంలో కొత్త జ్ఞాన పాయలు వచ్చి చేరుతుంటాయి. దానిలో తను ఒడిసి పట్టుకున్నదెంత.. దాన్ని అర్థం చేసుకున్నదెంతన్న ఎరుక ఆవగింజంతైనా లేనివాడే మూర్ఖుడు. ఒకరకంగా కూపస్థ మండూకమే! ఈ అజ్ఞానంతో పెద్దల.. జ్ఞానుల మాటలను ఆలకించడు. ఆలోచించడు. ఈ అజ్ఞానం అతడి కళ్లను ఎప్పుడూ మూసే ఉంచుతుంది. మూర్ఖత్వం ఉన్నచోట విచక్షణ, వివేచన ఉండదని, వాగ్వివాదం, అర్థరహితమైన ఆవేశం ఉంటుందన్న విషయాన్ని కొన్ని పౌరాణిక ఉదంతాలు స్పష్ట చేస్తాయి. మూర్ఖుడికి రెండు అవలక్షణాలు. ఒకటి తనకు తెలియకపోవటం.. రెండోది ఇతరులు చెప్పే మంచిని చూడలేకపోవటం. పైగా, వారిని సంస్కరించే క్రమంలో వివేచనాపరులకు నిందలు.. అవమానం... చీదరింపు.. చీత్కారం.. ఎదురవుతాయి. మనసుకు బాధ కలుగుతుంది. అందుకే భర్తృహరి.. సృష్టిలో లేనివి... అసాధ్యమైనవి ప్రయత్నించి సాధించవచ్చేమో కాని, ఎటువంటి ప్రయత్నం చేసినా మూర్ఖుడి మనసు మెప్పించలేమని.. మార్చలేమని... ఏనాడో సిద్ధాంతీకరిస్తూ హెచ్చరించాడు. విలువైన సమయం వృథా అవుతుంది. ఈ శుష్కప్రయత్నం కన్నా అనేకమంది పామరులను పండితుల్ని చేయవచ్చు. అలాగే కొంచం తెలివితేటలు ఉన్నవాళ్ళకు .. ఎదుటివారు చెప్పేది వినే సంస్కారం ఉండి, ఆలోచించ గలిగే వారికి చెప్పినా ఉపయోగముంటుంది. మన మాటలోని అంతరార్థాన్ని గ్రహించి తమను సరిదిద్దుకోగలరు. మన పట్ల కృతజ్ఞతా భావం ఉంటుంది. మూర్ఖుడికి తన జ్ఞానం మీద అతివిశ్వాసం. దానివల్ల ఒక సమస్యను అన్ని కోణాలలో చూడలేడు. కొంతవరకే అర్థం చేసుకుని ప్రయత్నం చేసి అద్భుతమైన పరిష్కారం కనుగొన్నానని సంతోషంతో గెంతులేస్తాడు. తాను గొప్ప మేధావినని మురిసిపోతాడు. దాని పర్యవసనాలు ఎలా ఉంటాయో ఊహించలేడు. పిడివాదం మూర్ఖుడి జీవలక్షణం. తన ఆలోచన.. తెలివిడితనం/ తెలివి... మార్గం... అందరికన్నా మెరుగైనవన్న వైఖరి. దాన్నే తన మాటల్లో.. వాదనలో.. చేతల్లో చూపించే తత్వం. అందుకే వివేకవంతుడు అతడితో వాదనకే దిగడు. అసలు సాధ్యమైనంతవరకు మాట్లాడే యత్నమే చెయ్యడు. మూర్ఖుడికి మంచి భావనలే రావు. సమయోచిత బుద్ధి.. ప్రవర్తన ఉండదు. అతడి ప్రవర్తన వింతగా. హాస్యాస్పదంగా ఉంటూ కొన్ని సందర్భాలలో నిర్ఘాంతులను చేస్తుంది. మరికొన్ని సమయాలలో అది ఊహించని విధంగా పరిణమించి ఎంతో విపత్తును.. నాశనాన్ని కలిగిస్తుంది. ఇంగిత జ్ఞానం మూర్ఖుడి దరిదాపుల్లో నివాసమే చేయదు. అతనికి మాటలకు ఒక స్థిరత్వం.. పరిస్థితులను ఆకళింపు చేసుకునే శక్తి సామర్థ్యాలు ఉండనే ఉండవు. సహేతుక నిర్ణయాధికార శక్తి ఉండదు. కువిమర్శలు చేయటం అతని నైజం. స్వార్థం.. సంకుచిత బుద్ధి.. అధర్మ పద్ధతులలోనైనా తననుకున్నది సాధించాలనుకునే మొండి పట్టుదల అతడి కార్యసాధనకు సాధనాలు. మూర్ఖత్వం వ్యక్తి వికాసానికి పెద్ద అవరోధం. అది నాయకులకుంటే సమాజానికి చేటు. జాతినేతకు ఉంటే జాతికి ముప్పు. హిట్లర్.. ముస్సోలినీల మూర్ఖత్వానికి కొన్ని వర్గాలవారు ధన.. మాన.. ప్రాణాలు గడ్డిపరకల కన్నా ఎలా హీనమయ్యాయో చరిత్ర చెప్పనే చెప్పింది. మూర్ఖత్వాన్ని తప్పకుండా వీడాలి. అదెలా సాధ్యమవుతుందంటే..? తోటకూర నాడే అన్నట్టుగా పిల్లల్లో ఈ విపరీత లక్షణం గమనించిన పెద్దలు వెంటనే వారిని సంస్కరించే ప్రయత్నం చేయాలి. మంచి పుస్తకాలను చదివించాలి. మంచివారితో స్నేహం గరిపేటట్టు చూడాలి. అవసరమైతే గురువుల సహాయం తీసుకోవాలి. అప్పుడు అభిలషణీయమైన మార్పు చూస్తాం. అపుడే వ్యక్తికి.. కుటుంబానికి.. సమాజానికి.. జాతికి శ్రేయస్సు. మూర్ఖుడికి ఉచితానుచితాలు తెలియనే తెలియవు. సభామర్యాద తెలియదు. సంభాషణ తీరు ఉండదు. మాట్లాడే మాటలకు సందర్భశుద్ధి ఉండదు. తమ తప్పుల్ని.. పొరబాట్లను.. అనుచిత ప్రవర్తనను గుర్తెరగరు. ఒకవేళ తెలుసుకున్నా సరిదిద్దుకోరు. తమ పద్ధతిలోనే పయనిస్తారు. వివేకవంతులు తమ లోపాలను తెలుసుకున్న వెంటనే సరిదిద్దుంటారు. మార్పు వారి వ్యక్తిత్వంలో ఒక గొప్ప లక్షణం. ఇది వారిని మరింత వివేచనపరులుగా చేసే మార్గం. మూర్ఖత్వమంటే అసలు తెలియదని కాదు. తెలిసింది చాలా తక్కువ. అది కూడ అరకొరగానే. అదే గొప్పదన్న ఆలోచన. దానికే కన్ను, మిన్ను కానక ప్రవర్తిస్తుంటారు. వయోభేదం లేకుండా ఎవరినైనా ఏ మాటైనా అనగలరు. సంకోచం గాని.. వెరపు గాని ఉండదు. తన మాటల, వర్తన వల్ల ఎవరికైనా మనస్తాపం కలుగుతుందేమోనని యోచనే ఉండదు. తమకున్న మిడి మిడి జ్ఞానంతో, వివేచనపరులు ఈ పని చేయచ్చా... ఇలా మాట్లాడవచ్చో లేదో అని మీమాంసకు లోనైన సందర్భాలలో చొరవగా అన్నిచోట్లకు వెళ్ళగలరు .. ఏదైనా మాట్లాడగలరు. – బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
సేనకుడి జీవ కారుణ్యం
పూర్వం వారణాసిని జనకుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అతని మహామంత్రి సేనకుడు పరమ ధార్మికుడు. అంతకు మించి ప్రజ్ఞావంతుడు. ఆయన తెలివి తేటలు, సమయస్ఫూర్తి లోకంలో ప్రజలందరికీ తెలిసి వేనోళ్ల కీర్తించేవాళ్లు. వారణాసి నగర శివారులో ఒక పేద వృద్ధ బ్రాహ్మణ దంపతులుండేవారు. ఆ బ్రాహ్మణుడు యాయవారంతో జీవనం సాగిస్తుండేవాడు. ఒకరోజున భిక్షకోసం దగ్గరలో ఉన్న ఒక పట్టణానికి బయలు దేరాడు. భర్తకు అల్పాహారంగా ఒక సంచిలో సత్తుపిండి కలిపి ఇచ్చింది భార్య. బియ్యపు పిండిలో బెల్లం పలుకులు కలిపి ఇచ్చిన ఆ సత్తు పిండి సంచిని భుజానికి తగిలించుకుని బయలు దేరి వెళ్లాడు. భిక్షానంతరం మధ్యాహ్నానికి ఇంటికి తిరిగి వస్తూ దారిలో ఒక దిగుడు బావి కనిపిస్తే అక్కడ ఆగాడు. చెట్టుకింద కూర్చొని సంచి మూట విప్పి పిండి తిన్నాడు. నీటికోసం దిగుడు బావిలో దిగాడు. ఆ చెట్టు తొర్రలో ఒక నల్ల నాగు ఉంది. పిండి వాసన పసిగట్టి వచ్చి సంచిలో దూరింది. వృద్ధుడు నీరు తాగి వచ్చి, పాముని గమనించకుండా మూతి కట్టేశాడు. ముందుకు కదిలాడు. ఆ దగ్గరలో ఒక చెట్టు మీద ఒక యక్షుడు ఉన్నాడు. వాడు బ్రాహ్మణుడితో – ఓయీ సాయంత్రానికి ఇంటికి చేరుకోలేక పోయావంటే నీవు మరణిస్తావు. చేరుకున్నావంటే నీ భార్య మరణిస్తుంది’’ అని హెచ్చరించి అక్కడ నుండి వెళ్లిపోయాడు. అతని మాటలకు భయపడ్డ బ్రాహ్మణుడు దిగులుగా ఇంటిదారి పట్టాడు. తన సమస్యకు సేనకుడు మాత్రమే పరిష్కారం చెప్పగలడని అనుకొని సేనక మంత్రి దగ్గర కు వెళ్లాడు. సేనకుడు ధర్మసభలో ఉన్నాడు. వృద్ధబ్రాహ్మణుడు విషయం చెప్పగా, సేనకుడు ఆలోచించి... అతని భుజం మీది సత్తుపిండి సంచిని చూశాడు. ‘‘మధ్యాహ్నం ఎక్కడ భోం చేశావు’’ అని అడిగి, వివరాలు తెలుసుకుని –‘‘ఓయీ! భయపడకు. నీ సంచిలో పాముంది. నీవు సాయంత్రం లోపు ఇంటికి చేరలేకపోతే, ఆ సంచిని విప్పి పిండి తినాలి కదా! అప్పుడు అందులోని పాము కాటేసి మరణిస్తావు. ఒకవేళ ఇంటికి చేరితే, ఆ సంచి భార్యకు ఇస్తావు కాబట్టి, ఆమె ఆ సంచి విప్పగానే పాము కాటుతో మరణిస్తుంది. ఏదీ సంచి మూతి విప్పు’’ అన్నాడు. సేనకుడు చెప్పినట్లే బుసలు కొడుతూ, బైటకొచ్చి పడగ విప్పి లేచింది కాలనాగు. సభికులు సేనకుని తెలివికి చప్పట్లు కొట్టారు. కొందరు సభికులు కర్రలు తీసుకు వచ్చి పాముని చంపబోయారు. సేనకుడు వద్దని వారించి – పాముల వాణ్ణి పిలిపించి, ‘‘నాగును పట్టి అడవిలో వదిలిరా’’అని చెప్పి పంపాడు. అతని జీవ కారుణ్యానికి సభికులు హర్షధ్వానాలు చేశారు. తమ ప్రాణాలు కాపాడినందుకు బ్రాహ్మణుడు నిండు మనస్సుతో మంత్రిని ఆశీర్వదించాడు. జీవ కారుణ్యం గురించి, ప్రతిజీవికీ జీవించే హక్కు ఉంటుందనీ, దాన్ని కాలరాయకూడదనే ధర్మ ప్రబోధానికి బుద్ధుడు చెప్పిన ఈ కథ నేటికీ ఆవశ్యకమే. జీవ వైవిధ్యాన్ని ఆనాడే ప్రకటించిన బుద్ధ ప్రబోధం అజరామరం. డా. బొర్రా గోవర్ధన్ -
జ్ఞానమా? శీలమా? ఏది మిన్న?
కాశీరాజు ఆస్థానంలో అనేకమంది పండితులుండేవారు. వారిలో ధర్మధరుడు మహాపండితుడే కాదు, శీలవంతుడు కూడా. రాజు పండితుల్ని వారి వారి పాండిత్యానికి తగిన రీతిలో ఘనంగా సత్కరించేవాడు. వారిలో పాండిత్యంతోపాటు శీలసంపన్నులూ ఉండేవారు. శీలగుణం లేని పండితులూ ఉండేవారు. రాజు మాత్రం వారి బుద్ధుల్ని లెక్కించకుండా కేవలం పాండిత్యానికే గౌరవ సత్కారాలు అందించడం ధర్మధరునికి నచ్చలేదు. రాజు మాత్రం అందరికంటే ధర్మధరుణ్ణే మిన్నగా గౌరవించేవాడు. ధర్మధరుడు రాజుకి జ్ఞానోదయం కలిగించాలనుకున్నాడు. ఒకరోజున నగరంలోని ఒక వజ్రాల దుకాణానికి వెళ్లాడు. దుకాణం యజమాని లేచి ధర్మధరునికి నమస్కరించాడు. యజమానితో మాట్లాడుతూ ఒక వజ్రాన్ని చేతిలో పట్టుకుని వెళ్లిపోయాడు ధర్మధరుడు. ‘మాటల మధ్య మరపుగా తీసుకుని ఉంటారు’ అనుకుని ఊరుకున్నాడు వ్యాపారి. రెండోరోజు అలానే చేశాడు ధర్మధరుడు. రెండోసారీ ఏమీ అనలేదు వ్యాపారి. మూడోరోజూ అలానే చేశాడు. వ్యాపారికి కోపం వచ్చి– ‘‘ఓరీ! దొంగవెధవా! నీ పాండిత్యం తగలబడ. నిన్ను గౌరవించడం నా తప్పు’’ అని గట్టిగా అరచి ధర్మధరుణ్ణి నాలుగు తన్ని, రాజు దగ్గరకు ఈడ్చుకుపోయాడు వ్యాపారి. దొంగగా తన ఎదుట నిలిచిన ధర్మధరుని చూసి ఆశ్చర్యపోయాడు రాజు. ‘‘రాజా! ఇప్పుడు నన్ను సత్కరించగలరా?’’అని అడిగాడు ధర్మధరుడు. ‘‘సత్కరించడం కాదు. శిక్షిస్తాను. అదే నీకు సత్కారం’’ అన్నాడు రాజు.‘‘ఔను కదా! మహారాజా! నేను మీకు చెప్పదలచుకుంది ఇదే! పాండిత్యమే కాదు, శీలం కూడా ఉండాలి. అలాంటివారినే గౌరవించాలి. కానీ, మీరు శీలం లేని పండితుల్ని కూడా అందరితోపాటే ఘనంగా సత్కరిస్తున్నారు’’ అన్నాడు ధర్మధరుడు. తను చేస్తున్న తప్పు తెలియజెప్పడానికే ధర్మధరుడు ఇలా చేశాడని రాజుకు అర్థమైంది.జ్ఞానం కంటే పాండిత్యం కంటే శీలమే గొప్పది అని బుద్ధుడు చెప్పిన కథ ఇది. – డా. బొర్రా గోవర్ధన్ -
ఎనిమిదిరెట్ల విచారం
ప్రజల కష్టసుఖాలు స్వయంగా తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ఓ రాజు, మంత్రి మారువేషాలలో విపణి వీధిలోంచి వెళ్తున్నారు. అది శీతాకాలం. పూలు, పళ్లు, మిఠాయిలు, అరుదైన వస్తువులు, వస్త్రాలు తదితరాలు అమ్మేవారితో వీధి అంతా కోలాహలంగా ఉంది. ఒక ఉన్ని వస్త్రాల దుకాణం ముందు ఆ దుకాణదారుడు దిగులుగా కూర్చుని ఉన్నాడు. అది చూసి రాజూ మంత్రీ అతని వద్దకెళ్లి ఎందుకంత విచారంగా ఉన్నావని అడిగారు. అందుకు అతడు ‘ఏమి చెప్పమంటారు స్వామీ, శీతాకాలం వస్తోందని నాణ్యమైన శాలువాలు కశ్మీరు నుంచి తెప్పించాను. ఈ ఏడాది చలి లేకపోవడంతో ఒక్కటీ అమ్ముడు పోలేదు. అవి అమ్మగా వచ్చిన లాభాలతో ఇల్లు గడుపుకోవాలి, వచ్చే సంవత్సరానికి కావలసిన పెట్టుబడి కూడా సమకూర్చుకోవాలి. ఇలా అయితే ఎలా?’’ అని వాపోయాడు. రాజు మరునాడు ఒక చాటింపు వేయించాడు. ఇకనుంచి రాజసభకు వచ్చేవాళ్లందరూ శాలువాలు కప్పుకుని రావాలి, లేకుంటే జరిమానా ఉంటుంది అని. అందరూ విధిగా రాజాజ్ఞను పాటించసాగారు. కొంతకాలం గడిచాక రాజూ, మంత్రీ తిరిగి మారువేషాలలో ఆ దుకాణదారు వద్దకు వెళ్లారు. అయితే వారు ఊహించినట్లుగా దుకాణదారు సంతోషంగా లేకపోగా మరింత విచారంగా కనిపించాడు. వారతన్ని కుశల ప్రశ్నలు వేశారు.‘‘ఏం చెప్పమంటారు స్వామీ, ఏదో అద్భుతం జరిగినట్లుగా నా శాలువాలన్నీ ఒక్కటీ లేకుండా అమ్ముడుపోయాయి’’ అని చెప్పాడు.‘‘మరి నువ్వు సంతోషంగా ఉండాలి కదా, అలా విచారంగా ఎందుకున్నావు’’అనడిగారు. ‘‘మొదట నేను సామాన్య లాభానికి అమ్మేవాణ్ణి. కానీ గిరాకీ పెరగడంతో రెట్టింపు లాభానికి కొన్నింటినీ, ఇంకా గిరాకీ ఉండటంతో నాలుగురెట్ల ధరకి అమ్మాను. ఇప్పుడు ఒకే ఒక్క శాలువా మిగిలింది. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఎలాగైనా తనకి ఆ శాలువా అమ్మమనీ, ఎంత ధర అయినా ఇస్తాననీ బతిమాలేడు. అప్పుడతనికి ఎనిమిదిరెట్లు లాభానికి అమ్మాను’’ అన్నాడు. ‘‘అంత లాభం వచ్చింది కదా, ఇంకెందుకు విచారం?’’ అన్నాడు రాజు ఆశ్చర్యంగా. ‘నేను మొదట్లోనే ఆ ధర చెప్పి ఉంటే నాకెంత లాభం వచ్చేది? మామూలుగా అమ్మడం వల్ల ఎంత నష్టం వచ్చింది?’’ అని వాపోయాడా వర్తకుడు. జీవించేందుకు ఆశ కావాలి. దుఃఖపడటానికి నిరాశ, దురాశలే కారణం. – డి.వి.ఆర్. -
రాజధర్మం
రాజధర్మం జ్యోతిర్మయం ప్రజలను యోగ్యులుగా తీర్చిదిద్దుతూ, ప్రజారంజక మైన పరిపాలనను అందించగలిగిన రాజునే లోకులు అందరూ ప్రశంసిస్తారు. రాజు ధర్మాత్ముడైతే ప్రజలు ధర్మాచరణపరులుగా జీవనాన్ని కొనసాగిస్తారు. రాజు వ్యసనాలకు లోనై పాపకార్యాలను నిర్వర్తిస్తుంటే ప్రజలు కూడా దుర్మార్గంలోనే పయనిస్తారు. రాజును అనుసరించే వారే ప్రజలు ‘‘ రాజ్ఞే ధర్మిని ధర్మిష్ఠాః పాపరతాస్సదా రాజానమనువర్తంతే యథా రాజా తథా ప్రజాః॥ అని ఆర్యోక్తి. కళ్లెం వేసి గుఱ్ఱాన్ని లాగి పట్టి రథాన్ని అదుపులో పెట్టే సారథిలాగా మదపుటే నుగు ను కూడా అంకుశంతో తన వశంలో ఉంచుకునే మావ టివానిలాగా శాస్త్రవిహిత మైన మార్గంలో తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిం చే రాజు ధర్మాచరణతో లోకులందరినీ మంచిమార్గం లో నడిపిస్తాడు అనే విషయాన్ని మహా భారతం శాంతిపర్వంలోని- ‘‘యథా హి రశ్మయోశ్వస్య ద్విరథస్యాంకుశో యథా / నరేంద్ర ధర్మోలోకస్య తథా ప్రగ్రహణం స్మృతమ్॥ అనే సూక్తి తెలుపుచున్నది. ఆదర్శవంతమైన పరిపాలనతో సత్కర్మాచరణ పరుడైన రాజుకు జీవించి ఉన్నప్పుడు ఈ లోకంలో, శరీరాన్ని వదిలిన తరువాత పరలోకంలో ఆనందాన్ని సిద్ధింపజేయుటకు అవసరమైన హేతువులలో సత్యమును మించినది వేరొకటి లేనే లేదు అని శాంతిపర్వంలోని మరొక సూక్తి వెల్లడిస్తున్నది. రాజు విధిగా సత్యనిష్ఠ కలవాడై, సత్యపాలకుడై లోకులను సత్యవంతులుగా తీర్చిదిద్దవలసిన బాధ్య తను కలిగి ఉంటాడని మహాభారత సూక్తి పేర్కొం టున్నది. లోకులందరినీ తన పరిపాలనతో రంజింప జేయుటయే రాజు ప్రధాన రాజధర్మం. ఇదే సనాతన ధర్మం. రంజింపజేయువాడే రాజు అని నిరుక్తి. సత్యాన్ని రక్షిస్తూ, ధర్మాన్ని ఆచరిస్తూ నిష్పక్షపాతంగా ప్రజాపాలనను కొనసాగించే రాజు రాజ్య పరిపాలనా వ్యవహారాలలో ముక్కుసూటిగా వ్యవహరించాల్సిందే. అంతే తప్ప వేరొక మార్గం లేదు- ‘‘లోకరంజన మేవాత్ర రాజ్ఞాం ధర్మః సనాతనః సత్యస్య రక్షణం చైవ వ్యవహారస్య చార్జవమ్॥ అని మహాభారతం (శాంతిపర్వం)లోని సూక్తి పేర్కొన్నది. సద్గునవంతుడు, ప్రతిభావంతుడు, పరాక్రమ శాలి అయిన రాజు ఎల్లవేళలా సత్యాన్నే పలుకుతూ అసాధారణ మైన రీతిలో సహనాన్ని కలిగివుంటూ తన ధర్మాలను ఉల్లంఘించకుండా ప్రజలను సక్రమంగా పరిపాలించాలి. రాజు, ఇతరుల ధనాన్ని నాశనం చేయకూడదు, ఇతరులకు అందవలసిన ధనాన్ని కూడా సకాలంలో వారికి చేరునట్లుగా తప్పక కృషి చేయాల్సి ఉంటుంది- ‘‘న హింస్యాత్ పరవిత్తాన్ని దేయం కాలేచ దాపయేత్ విక్రాంతః సత్యవాక్ క్షాంతో నృపో న చలతే పథః ॥ అని మహాభారత సూక్తి తెలుపుచున్నది. లోకారాధనాతత్పరుడై ప్రజారంజకమైన పాలన తో చరిత్ర పుటల్లో సుస్థిరస్థానం సంపాదించుకొని రామరాజ్యం అనే విఖ్యాతిని గడించిన శ్రీరామచంద్ర స్వామి పరిపాలనా విధానాన్ని ఆదర్శంగా గ్రహించి రాజధర్మాలను సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రభువులు ప్రజారంజక పరిపాలనను కొనసాగించాలని ఆకాంక్షిద్దాం. - సముద్రాల శఠగోపాచార్యులు -
అంతర్జాతీయ తైక్వాండో పోటీలకు రాజు
ఉస్మానియా యూనివర్సిటీ: యునెటైడ్ కింగ్డమ్లో నవంబరు 8, 9వ తేదీలలో జరిగే అంతర్జాతీయ ఓపెన్ తైక్వాండో పోటీలకు ఓయూలో పీహెచ్డీ చేస్తున్న గిరి పుత్రుడు కరాటే రాజు నాయక్ ఎంపికయ్యాడు. మంగళవారం ఓయూలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అతను మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో తనకే ఇంతటి గొప్ప అవకాశం లభించడం ఆనందాయకమన్నాడు. గతంలో పలు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని బంగారు పతకాలు సాధించానని వివరించాడు. ఈసారి కూడా బంగారు పతకం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. మహబూబ్నగర్ జిల్లా మారుమూల గిరిజన తండాకు చెందిన తాను కృషి, పట్టుదలతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగినట్లు వివరించాడు. చదువుతూ, విద్యార్థి జేఏసీ నేతగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని పోరాడిన తనకు యూకేకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని అభ్యర్థించాడు.