పూర్వం వారణాసిని జనకుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అతని మహామంత్రి సేనకుడు పరమ ధార్మికుడు. అంతకు మించి ప్రజ్ఞావంతుడు. ఆయన తెలివి తేటలు, సమయస్ఫూర్తి లోకంలో ప్రజలందరికీ తెలిసి వేనోళ్ల కీర్తించేవాళ్లు. వారణాసి నగర శివారులో ఒక పేద వృద్ధ బ్రాహ్మణ దంపతులుండేవారు. ఆ బ్రాహ్మణుడు యాయవారంతో జీవనం సాగిస్తుండేవాడు. ఒకరోజున భిక్షకోసం దగ్గరలో ఉన్న ఒక పట్టణానికి బయలు దేరాడు. భర్తకు అల్పాహారంగా ఒక సంచిలో సత్తుపిండి కలిపి ఇచ్చింది భార్య. బియ్యపు పిండిలో బెల్లం పలుకులు కలిపి ఇచ్చిన ఆ సత్తు పిండి సంచిని భుజానికి తగిలించుకుని బయలు దేరి వెళ్లాడు. భిక్షానంతరం మధ్యాహ్నానికి ఇంటికి తిరిగి వస్తూ దారిలో ఒక దిగుడు బావి కనిపిస్తే అక్కడ ఆగాడు. చెట్టుకింద కూర్చొని సంచి మూట విప్పి పిండి తిన్నాడు. నీటికోసం దిగుడు బావిలో దిగాడు. ఆ చెట్టు తొర్రలో ఒక నల్ల నాగు ఉంది.
పిండి వాసన పసిగట్టి వచ్చి సంచిలో దూరింది. వృద్ధుడు నీరు తాగి వచ్చి, పాముని గమనించకుండా మూతి కట్టేశాడు. ముందుకు కదిలాడు. ఆ దగ్గరలో ఒక చెట్టు మీద ఒక యక్షుడు ఉన్నాడు. వాడు బ్రాహ్మణుడితో – ఓయీ సాయంత్రానికి ఇంటికి చేరుకోలేక పోయావంటే నీవు మరణిస్తావు. చేరుకున్నావంటే నీ భార్య మరణిస్తుంది’’ అని హెచ్చరించి అక్కడ నుండి వెళ్లిపోయాడు. అతని మాటలకు భయపడ్డ బ్రాహ్మణుడు దిగులుగా ఇంటిదారి పట్టాడు. తన సమస్యకు సేనకుడు మాత్రమే పరిష్కారం చెప్పగలడని అనుకొని సేనక మంత్రి దగ్గర కు వెళ్లాడు. సేనకుడు ధర్మసభలో ఉన్నాడు. వృద్ధబ్రాహ్మణుడు విషయం చెప్పగా, సేనకుడు ఆలోచించి... అతని భుజం మీది సత్తుపిండి సంచిని చూశాడు. ‘‘మధ్యాహ్నం ఎక్కడ భోం చేశావు’’ అని అడిగి, వివరాలు తెలుసుకుని –‘‘ఓయీ! భయపడకు. నీ సంచిలో పాముంది.
నీవు సాయంత్రం లోపు ఇంటికి చేరలేకపోతే, ఆ సంచిని విప్పి పిండి తినాలి కదా! అప్పుడు అందులోని పాము కాటేసి మరణిస్తావు. ఒకవేళ ఇంటికి చేరితే, ఆ సంచి భార్యకు ఇస్తావు కాబట్టి, ఆమె ఆ సంచి విప్పగానే పాము కాటుతో మరణిస్తుంది. ఏదీ సంచి మూతి విప్పు’’ అన్నాడు. సేనకుడు చెప్పినట్లే బుసలు కొడుతూ, బైటకొచ్చి పడగ విప్పి లేచింది కాలనాగు. సభికులు సేనకుని తెలివికి చప్పట్లు కొట్టారు. కొందరు సభికులు కర్రలు తీసుకు వచ్చి పాముని చంపబోయారు. సేనకుడు వద్దని వారించి – పాముల వాణ్ణి పిలిపించి, ‘‘నాగును పట్టి అడవిలో వదిలిరా’’అని చెప్పి పంపాడు. అతని జీవ కారుణ్యానికి సభికులు హర్షధ్వానాలు చేశారు. తమ ప్రాణాలు కాపాడినందుకు బ్రాహ్మణుడు నిండు మనస్సుతో మంత్రిని ఆశీర్వదించాడు. జీవ కారుణ్యం గురించి, ప్రతిజీవికీ జీవించే హక్కు ఉంటుందనీ, దాన్ని కాలరాయకూడదనే ధర్మ ప్రబోధానికి బుద్ధుడు చెప్పిన ఈ కథ నేటికీ ఆవశ్యకమే. జీవ వైవిధ్యాన్ని ఆనాడే ప్రకటించిన బుద్ధ ప్రబోధం అజరామరం.
డా. బొర్రా గోవర్ధన్
Comments
Please login to add a commentAdd a comment