రాజధర్మం
రాజధర్మం
జ్యోతిర్మయం
ప్రజలను యోగ్యులుగా తీర్చిదిద్దుతూ, ప్రజారంజక మైన పరిపాలనను అందించగలిగిన రాజునే లోకులు అందరూ ప్రశంసిస్తారు. రాజు ధర్మాత్ముడైతే ప్రజలు ధర్మాచరణపరులుగా జీవనాన్ని కొనసాగిస్తారు. రాజు వ్యసనాలకు లోనై పాపకార్యాలను నిర్వర్తిస్తుంటే ప్రజలు కూడా దుర్మార్గంలోనే పయనిస్తారు. రాజును అనుసరించే వారే ప్రజలు
‘‘ రాజ్ఞే ధర్మిని ధర్మిష్ఠాః పాపరతాస్సదా
రాజానమనువర్తంతే యథా రాజా తథా ప్రజాః॥
అని ఆర్యోక్తి.
కళ్లెం వేసి గుఱ్ఱాన్ని లాగి పట్టి రథాన్ని అదుపులో పెట్టే సారథిలాగా మదపుటే నుగు ను కూడా అంకుశంతో తన వశంలో ఉంచుకునే మావ టివానిలాగా శాస్త్రవిహిత మైన మార్గంలో తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిం చే రాజు ధర్మాచరణతో లోకులందరినీ మంచిమార్గం లో నడిపిస్తాడు అనే విషయాన్ని మహా భారతం శాంతిపర్వంలోని-
‘‘యథా హి రశ్మయోశ్వస్య ద్విరథస్యాంకుశో యథా / నరేంద్ర ధర్మోలోకస్య తథా ప్రగ్రహణం స్మృతమ్॥
అనే సూక్తి తెలుపుచున్నది.
ఆదర్శవంతమైన పరిపాలనతో సత్కర్మాచరణ పరుడైన రాజుకు జీవించి ఉన్నప్పుడు ఈ లోకంలో, శరీరాన్ని వదిలిన తరువాత పరలోకంలో ఆనందాన్ని సిద్ధింపజేయుటకు అవసరమైన హేతువులలో సత్యమును మించినది వేరొకటి లేనే లేదు అని శాంతిపర్వంలోని మరొక సూక్తి వెల్లడిస్తున్నది.
రాజు విధిగా సత్యనిష్ఠ కలవాడై, సత్యపాలకుడై లోకులను సత్యవంతులుగా తీర్చిదిద్దవలసిన బాధ్య తను కలిగి ఉంటాడని మహాభారత సూక్తి పేర్కొం టున్నది. లోకులందరినీ తన పరిపాలనతో రంజింప జేయుటయే రాజు ప్రధాన రాజధర్మం. ఇదే సనాతన ధర్మం. రంజింపజేయువాడే రాజు అని నిరుక్తి. సత్యాన్ని రక్షిస్తూ, ధర్మాన్ని ఆచరిస్తూ నిష్పక్షపాతంగా ప్రజాపాలనను కొనసాగించే రాజు రాజ్య పరిపాలనా వ్యవహారాలలో ముక్కుసూటిగా వ్యవహరించాల్సిందే. అంతే తప్ప వేరొక మార్గం లేదు-
‘‘లోకరంజన మేవాత్ర రాజ్ఞాం ధర్మః సనాతనః
సత్యస్య రక్షణం చైవ వ్యవహారస్య చార్జవమ్॥
అని మహాభారతం (శాంతిపర్వం)లోని సూక్తి పేర్కొన్నది.
సద్గునవంతుడు, ప్రతిభావంతుడు, పరాక్రమ శాలి అయిన రాజు ఎల్లవేళలా సత్యాన్నే పలుకుతూ అసాధారణ మైన రీతిలో సహనాన్ని కలిగివుంటూ తన ధర్మాలను ఉల్లంఘించకుండా ప్రజలను సక్రమంగా పరిపాలించాలి. రాజు, ఇతరుల ధనాన్ని నాశనం చేయకూడదు, ఇతరులకు అందవలసిన ధనాన్ని కూడా సకాలంలో వారికి చేరునట్లుగా తప్పక కృషి చేయాల్సి ఉంటుంది-
‘‘న హింస్యాత్ పరవిత్తాన్ని దేయం కాలేచ దాపయేత్
విక్రాంతః సత్యవాక్ క్షాంతో నృపో న చలతే పథః ॥
అని మహాభారత సూక్తి తెలుపుచున్నది.
లోకారాధనాతత్పరుడై ప్రజారంజకమైన పాలన తో చరిత్ర పుటల్లో సుస్థిరస్థానం సంపాదించుకొని రామరాజ్యం అనే విఖ్యాతిని గడించిన శ్రీరామచంద్ర స్వామి పరిపాలనా విధానాన్ని ఆదర్శంగా గ్రహించి రాజధర్మాలను సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రభువులు ప్రజారంజక పరిపాలనను కొనసాగించాలని ఆకాంక్షిద్దాం.
- సముద్రాల శఠగోపాచార్యులు