అంతర్జాతీయ తైక్వాండో పోటీలకు రాజు
ఉస్మానియా యూనివర్సిటీ: యునెటైడ్ కింగ్‌డమ్‌లో నవంబరు 8, 9వ తేదీలలో జరిగే అంతర్జాతీయ ఓపెన్ తైక్వాండో పోటీలకు ఓయూలో పీహెచ్‌డీ చేస్తున్న గిరి పుత్రుడు కరాటే రాజు నాయక్ ఎంపికయ్యాడు. మంగళవారం ఓయూలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అతను మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో తనకే ఇంతటి గొప్ప అవకాశం లభించడం ఆనందాయకమన్నాడు.
గతంలో పలు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని బంగారు పతకాలు సాధించానని వివరించాడు. ఈసారి కూడా బంగారు పతకం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. మహబూబ్‌నగర్ జిల్లా మారుమూల గిరిజన తండాకు చెందిన తాను కృషి, పట్టుదలతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగినట్లు వివరించాడు. చదువుతూ, విద్యార్థి జేఏసీ నేతగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని పోరాడిన తనకు యూకేకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని అభ్యర్థించాడు.