king khan
-
కి..కి..కిరణ్ అంటూ వచ్చి....
-
స్మార్ట్ కింగ్ ఖాన్
సెలబ్రిటీ స్టైల్.. బుల్లి తెరతో ప్రస్థానం మొదలుపెట్టి బాలీవుడ్లో కింగ్ ఖాన్‌గా ఎదిగిన షారుఖ్ ఖాన్ ప్రస్తుతం .. సంపదలో టామ్ క్రూయిజ్ వంటి హాలీవుడ్ స్టార్లను కూడా మించిపోయాడు. ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్న యాక్టర్‌గా నిల్చాడు. నటుడు, నిర్మాత, టీవీ వ్యాఖ్యాత, ఐపీఎల్ టీమ్ ఓనరు.. ఇలా ఒకటేమిటి అనేక పాత్రలు పోషిస్తున్నాడతను. సీరియస్‌గా సినిమాలు చేసుకున్నా.. సరదాగా పెళ్లిళ్లలో డ్యాన్సులు చేసినా.. కోట్లు వచ్చేలా చూసుకుంటాడు. ఏ ఆదాయ మార్గాన్నీ వదులుకోని షారుఖ్.. వచ్చిన డబ్బును తెలివిగా ఇన్వెస్ట్ చేయడంలోనూ మేటి. ఆ వివరాలే ఈసారి సెలబ్రిటీ స్టయిల్లో.. కొంగొత్త ఐడియాలు.. కింగ్ ఖాన్ ఎప్పటికప్పుడు కొంగొత్త ఆదాయ మార్గాలు అన్వేషిస్తుంటాడు. ఏ ఒక్క అవకాశాన్నీ వీలైనంత వరకూ వదులుకోడు. దీనికి లేటెస్ట్ నిదర్శనం కొత్తగా రిలీజ్ కాబోతున్న హ్యాపీ న్యూ ఇయర్ సినిమానే. దీని రిలీజ్‌కి ముందే షారుఖ్ భారీగానే వెనకేసుకోబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ కోసం అమెరికా, బ్రిటన్, కెనడా తదితర దేశాల్లో షోలు నిర్వహించబోతున్నాడు. ఒక్కో షోకి దాదాపు ఏడు కోట్ల రూపాయలు వస్తాయని అంచనా. మొత్తం మీద సినిమా రిలీజ్‌కి ముందే ఈ విధంగా సుమారు రూ. 200 కోట్లు రాబట్టే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. సినిమా లాభాల్లో యాక్టర్లు కూడా వాటాలు తీసుకునే సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన నటుల్లో షారుఖ్ ఖాన్ కూడా ఒకరు. వెండి తెరే కాకుండా బుల్లితెరపై కూడా షారుఖ్ ఖాన్ కింగే. కౌన్ బనేగా కరోడ్‌పతి (సీజన్ 3), క్యా ఆప్ పాంచ్వీ పాస్ సే తేజ్ హై, జోర్ కా ఝట్కా వంటి రియాలిటీ షోలతో భారీ రెమ్యూనరేషన్ అందుకున్నాడు. జోర్ కా ఝట్కాకి దాదాపు రూ.2.5 కోట్లు పారితోషికం తీసుకున్నాడు. ఇటీవలి సూపర్ హిట్ సినిమా చెన్నై ఎక్స్‌ప్రెస్ శాటిలైట్ రైట్స్‌ను జీ ఎంటర్టైన్మెంట్కి ఏకంగా రూ. 48 కోట్లకు విక్రయించాడు. మార్కెటింగ్ మెగాస్టార్.. పాపులారిటీని మార్కెటింగ్ చేసుకోవడంలో షారుఖ్ దిట్ట. ఢిల్లీలో రెండు టికెట్లు తీసుకుంటే ఒక టికెట్ ఫ్రీ లాంటి ఆఫర్లతో చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాకు భారీ హైప్ తీసుకొచ్చాడు. దాన్ని అడ్వాంటేజీగా తీసుకుని సరిగ్గా రిలీజ్‌కి ముందు టికెట్ రేట్లు పెంచేలా చూశాడట. షారుఖ్.. ఏమాత్రం ప్రెస్టీజ్‌కి పోకుండా బడా పారిశ్రామికవేత్తల పెళ్లిళ్లలో డ్యాన్సులు చేసి కూడా బ్యాంకు బ్యాలెన్సు పెంచుకుంటాడన్న సంగతి తెలిసిందే. ఇందుకోసం సుమారు రూ. 8 కోట్లు తీసుకుంటాడని టాక్. వివాహ వేడుకల్లో డ్యాన్సులు చేయడానికి ఆమిర్‌ఖాన్, సల్మాన్ ఖాన్, సైఫ్ ఖాన్లు ఇష్టపడని కారణంగా.. ఈ విషయంలోనూ షారుఖ్ కింగే. అందుకే అతనికి బాగా డిమాండ్. 2012లో ఏకంగా 250 ఆఫర్లు రాగా పది మాత్రమే అంగీకరించాడట. ఆ రకంగా చూసినా కేవలం డ్యాన్సులు చేయడం ద్వారా రూ. 80 కోట్లు అందుకున్నాడని అంచనా. వీటిని పక్కన పెడితే .. అడ్వర్టైజ్మెంట్ల ద్వారా కూడా భారీగానే సంపాదిస్తుంటాడు షారుఖ్. టాల్కమ్ పౌడర్ల నుంచి కూల్ డ్రింకుల దాకా రకరకాల ప్రకటనలతో అలరిస్తూ.. ఆర్జిస్తుంటాడు. ఇటీవలే ఒక పాన్ మసాలా ప్రకటనలకు సంబంధించి రూ. 20 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. తెలివైన మదుపరి ఆదాయాన్ని ఆర్జించేందుకు అందుబాటులో అన్ని మార్గాలను వినియోగించుకునే షారుఖ్ ఖాన్ .. డబ్బును గౌరవిస్తాడు. దాన్ని స్మార్ట్‌గా ఇన్వెస్ట్ చేసేందుకు ప్రాధాన్యమిస్తాడు. అందుకే ముంబైలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల రియల్ ఎస్టేట్ ప్రాపర్టీల్లో ఇన్వెస్ట్ చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ క్రికెట్ టీమ్‌ను కొన్నాడు. రెడ్ చిల్లీ ఎంటర్టైన్మెంట్ పేరుతో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశాడు. అలాగే ఇన్డోర్ థీమ్ పార్క్స్కి సంబంధించిన ఇమేజినేషన్ ఎడ్యుటెయిన్‌మెంట్ ఇండియాలోనూ పెట్టుబడులు పెట్టాడు. ఇలాంటి తెలివైన పెట్టుబడులతో సంపదను మరింత రెట్టింపు చేసుకోవడంలో చాలా స్మార్ట్‌గా వ్యవహరిస్తాడు షారుఖ్. మరో విషయం.. కేవలం సినిమాలే లోకంగా కాకుండా, ప్రతి విషయం గురించి అప్ టు డేట్ ఉంటాడు షారుఖ్. -
షారుక్‌తో నో ప్రాబ్లమ్
మూవీ.. బజ్: బాలీవుడ్ సింగమ్ అజయ్‌దేవగణ్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటున్నాడు. తనకు, కింగ్ ఖాన్ షారుక్‌తో ఎలాంటి విభేదాలు లేవని బల్ల గుద్ది మరీ చె బుతున్నాడు. ఆ ప్రచారమంతా ట్రాష్ అని కొట్టిపారేశాడు. అజయ్ ‘సన్నాఫ్ సర్దార్’, షారుక్ ‘జబ్ తక్ హై జాన్’ 2012లో ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఏదో జరిగిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కెరీర్‌కు కొత్త రూపు మోడలింగ్ నుంచి వెండితెరపైకి వచ్చిన దీపానితాశర్మ.. ఇకపై చాలెంజింగ్ రోల్స్ చేస్తానని చెబుతోంది. 13 ఏళ్ల కెరీర్లో ‘దిల్ విల్ ప్యార్ వ్యార్’, ‘మై బ్రదర్.. నిఖిల్’, ‘జోడీ బ్రేక ర్స్’ వంటి సినిమాల్లో అందచందాలతో అదరగొట్టిన ఈ అమ్మడు.. ఇప్పుడు వయసుకు తగ్గ పాత్రల్లో ఒదిగిపోతానంటోంది. సస్పెన్స్ థ్రిల్లర్ ‘పిజ్జా’లో మానసిక సంఘర్షణకు గురయ్యే పాత్రకు ఓకే చెప్పింది. ‘హంప్టీశర్మ...’ ఏక్దమ్ డైరెక్టర్ కునాల్ కోహ్లీకి సక్సెస్ టాక్ మూటగట్టుకున్న ‘హంప్టీ శర్మాకీ దుల్హనియా’ చిత్రం పిచ్చపిచ్చగా నచ్చిందట. హంప్టీ శర్మ.. అవుట్ స్టాండింగ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అంటూ ఆయన కితాబిచ్చేశాడు. స్పెషల్ ప్రీమియర్ షో చూసిన కునాల్.. శశాంక్ ఖైతాన్ డెరైక్షన్.. ఆలియా, వరుణ్ జోడీ... అన్నీ అదిరిపోయాయంటూ సినిమాకు ఫుల్ రేటి ంగ్స్ ఇచ్చేశాడు. -
బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్‌కు 48 ఏళ్లు!!
అది 1988 సంవత్సరం. అప్పటికి టీవీలు కొంతవరకు మన ఇళ్లలోకి బాగానే వచ్చేశాయి. కానీ అప్పట్లో ఉన్న ఏకైక ఛానల్.. దూరదర్శన్. కాబట్టి అందులో వచ్చే సీరియళ్లు, అవి తెలుగువైనా, హిందీవైనా కూడా తప్పనిసరిగా చూసేవాళ్లు. ఆరోజుల్లో 'ఫౌజీ' అనే సీరియల్ మొదలైంది. కమాండో ట్రైనింగ్ కోసం కొంతమంది కుర్రాళ్లు వస్తారు. వాళ్లలో అభిమన్యు రాయ్ ఒకడు. అతడికి ట్రైనింగ్ అంటే చాలా చులకన భావం. తనకు కరాటే వచ్చని చెప్పిన అతడిని శిక్షకుడు అరక్షణంలో బోల్తా కొట్టిస్తాడు. కమాండో ట్రైనింగ్ అంటే చిన్న విషయం కాదని చెబుతాడు. అప్పటినుంచి కఠోర శిక్షణ తీసుకుని, పాకిస్థాన్ మీద ఆపరేషన్లలో ఎలా పాల్గొంటాడన్న విషయాన్ని సినిమా కంటే ఎంతో ఆసక్తికరంగా మలిచారు. ఇంతకీ ఆ సీరియల్లో హీరో.. అదే అభిమన్యు రాయ్ ఎవరనుకుంటున్నారా? బాలీవుడ్ బాద్షా, కింగ్ ఆఫ్ కింగ్స్, కింగ్ ఖాన్.. ఇలా అనేక పేర్లతో ప్రసిద్ధి చెందిన షారుఖ్ ఖాన్. పదిహేనేళ్ల వయసులో ఇంకా జీవితం అంటే ఏంటో తెలియకముందే తండ్రిని కోల్పోయాడు షారుఖ్. తర్వాత తనను ప్రాణప్రదంగా పెంచిన తల్లి కూడా కాలం చేసింది. 23 ఏళ్ల వయసులోనే ముఖానికి రంగు పూసుకుని టీవీ సీరియళ్లలో నటించడం మొదలుపెట్టాడు. రెండో సీరియల్ సర్కస్‌తో ప్రేక్షకుల మనసు దోచేసుకున్నాడు. ఇక బుల్లి తెర చాలు.. వెండితెర మీదకు రావాలని ప్రేక్షకులూ అనుకున్నారు, అతడూ అనుకున్నాడు. 1992లో దీవానా చిత్రంతో బాలీవుడ్ రంగప్రవేశం చేశాడు. ఆ సినిమాలో షారుఖ్ ఖాన్, దివ్యభారతిల ఆన్‌స్క్రీన్ రొమాన్స్ బాగా పండింది. అంతే.. బాలీవుడ్లో షారుఖ్ తిరుగులేని స్థానం సంపాదించుకున్నాడు. తర్వాత అతడు హీరోగా డర్, బాజీగర్ లాంటి చిత్రాలు వచ్చాయి. వాటిలో నెగెటివ్ షేడ్ ఉన్న హీరోగా, నటనలో తాను ఎంత అగ్రస్థానానికి వెళ్లగలనో అందరికీ చూపించాడు. ఇక 1995లో వచ్చిన దిల్వాలే దుల్హనియా లేజాయేంగే చిత్రం షారుఖ్ కెరీర్లోనే ఓ మైలురాయిగా నిలిచిపోయింది. దేశంలోనే అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా ఇది రికార్డులు సృష్టించింది. ఆ తర్వాత పరిశ్రమలో ఉన్న మరో ఖాన్.. సల్మాన్‌తో కలిసి కరణ్ అర్జున్ సినిమాలో నటించాడు. అది కూడా సూపర్ హిట్ అయ్యింది. మధ్యమధ్యలో ఒకటి రెండు పరాజయాలు ఎదురైనా.. పడి లేచే కడలి తరంగంలా మళ్లీ మళ్లీ హిట్లు సాధించడం షారుఖ్కే చెల్లింది. తాజాగా చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో దీపికా పదుకొనేతో ఒకవైపు భయం, మరోవైపు ధైర్యం.. ఇవన్నీ కలగలిసిన ఫీలింగులతో షారుఖ్ చేసిన నటనకు ఆలిండియా ప్రేక్షకులు హారతులు పట్టారు. ఈ చిత్రం విదేశాల్లో కూడా భారీ విజయాలు మూటగట్టుకుంది. మధ్యమధ్యలో క్రికెట్ అంటే తనకున్న ప్రేమను ఐపీఎల్ జట్టు కొనుగోలు ద్వారా చూపించుకున్నా, తనను మొదట్లో ఆదరించిన బుల్లితెరను వదిలిపెట్టకుండా కౌన్ బనేగా కరోడ్‌పతి లాంటి షోలు చేసినా.. అన్నీ షారుఖ్ ఖాన్‌కే చెల్లు. గౌరీ చిబ్బర్ అనే హిందువును పెళ్లి చేసుకున్న షారుఖ్.. ఇంట్లో పరమత సహనానికి పెద్దపీట వేస్తూ రెండు మతాలూ అవలంబిస్తుంటాడు. కేవలం సినిమాల్లో చెప్పడమే కాదు.. నిజజీవితంలో కూడా పాటిస్తానంటూ చేసి చూపిస్తున్నాడు. 48 ఏళ్లు నిండిన షారుఖ్ ఖాన్.. ఇప్పటికీ యువ హీరోలతో పోటీపడుతూ, తనలోని ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదంటూ కుర్రాడిలా పాటలు, ఫైట్లు చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్నాడు. బాలీవుడ్ బాద్షాకు సాక్షి చెబుతోంది.. పుట్టిన రోజు శుభాకాంక్షలు.. హేపీ బర్త్‌డే షారుఖ్!!