స్మార్ట్ కింగ్ ఖాన్ | shah rukh khan smart in marketing techniques | Sakshi
Sakshi News home page

స్మార్ట్ కింగ్ ఖాన్

Published Sat, Aug 2 2014 12:03 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

స్మార్ట్ కింగ్ ఖాన్ - Sakshi

స్మార్ట్ కింగ్ ఖాన్

సెలబ్రిటీ స్టైల్..
 
బుల్లి తెరతో ప్రస్థానం మొదలుపెట్టి బాలీవుడ్‌లో కింగ్ ఖాన్‌గా ఎదిగిన షారుఖ్ ఖాన్ ప్రస్తుతం .. సంపదలో టామ్ క్రూయిజ్ వంటి హాలీవుడ్ స్టార్లను కూడా మించిపోయాడు. ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్న యాక్టర్‌గా నిల్చాడు. నటుడు, నిర్మాత, టీవీ వ్యాఖ్యాత, ఐపీఎల్ టీమ్ ఓనరు.. ఇలా ఒకటేమిటి అనేక పాత్రలు పోషిస్తున్నాడతను. సీరియస్‌గా సినిమాలు చేసుకున్నా.. సరదాగా పెళ్లిళ్లలో డ్యాన్సులు చేసినా.. కోట్లు వచ్చేలా చూసుకుంటాడు. ఏ ఆదాయ మార్గాన్నీ వదులుకోని షారుఖ్.. వచ్చిన డబ్బును తెలివిగా ఇన్వెస్ట్ చేయడంలోనూ మేటి. ఆ వివరాలే ఈసారి సెలబ్రిటీ స్టయిల్‌లో..
 
కొంగొత్త ఐడియాలు..
 
కింగ్ ఖాన్ ఎప్పటికప్పుడు కొంగొత్త ఆదాయ మార్గాలు అన్వేషిస్తుంటాడు. ఏ ఒక్క అవకాశాన్నీ వీలైనంత వరకూ వదులుకోడు. దీనికి లేటెస్ట్ నిదర్శనం కొత్తగా రిలీజ్ కాబోతున్న హ్యాపీ న్యూ ఇయర్ సినిమానే. దీని రిలీజ్‌కి ముందే షారుఖ్ భారీగానే వెనకేసుకోబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ కోసం అమెరికా, బ్రిటన్, కెనడా తదితర దేశాల్లో షోలు నిర్వహించబోతున్నాడు. ఒక్కో షోకి దాదాపు ఏడు కోట్ల రూపాయలు వస్తాయని అంచనా. మొత్తం మీద సినిమా రిలీజ్‌కి ముందే ఈ విధంగా సుమారు రూ. 200 కోట్లు రాబట్టే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.  సినిమా లాభాల్లో యాక్టర్లు కూడా వాటాలు తీసుకునే సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన నటుల్లో షారుఖ్ ఖాన్ కూడా ఒకరు. వెండి తెరే కాకుండా బుల్లితెరపై కూడా షారుఖ్ ఖాన్ కింగే. కౌన్ బనేగా కరోడ్‌పతి (సీజన్ 3), క్యా ఆప్ పాంచ్‌వీ పాస్ సే తేజ్ హై, జోర్ కా ఝట్కా వంటి రియాలిటీ షోలతో భారీ రెమ్యూనరేషన్ అందుకున్నాడు. జోర్ కా ఝట్కాకి దాదాపు రూ.2.5 కోట్లు పారితోషికం తీసుకున్నాడు. ఇటీవలి సూపర్ హిట్ సినిమా చెన్నై ఎక్స్‌ప్రెస్ శాటిలైట్ రైట్స్‌ను జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఏకంగా రూ. 48 కోట్లకు విక్రయించాడు.
 
మార్కెటింగ్ మెగాస్టార్..
 
పాపులారిటీని మార్కెటింగ్ చేసుకోవడంలో షారుఖ్ దిట్ట. ఢిల్లీలో రెండు టికెట్లు తీసుకుంటే ఒక టికెట్ ఫ్రీ లాంటి ఆఫర్లతో చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాకు భారీ హైప్ తీసుకొచ్చాడు. దాన్ని అడ్వాంటేజీగా తీసుకుని సరిగ్గా రిలీజ్‌కి ముందు టికెట్ రేట్లు పెంచేలా చూశాడట. షారుఖ్.. ఏమాత్రం ప్రెస్టీజ్‌కి పోకుండా బడా పారిశ్రామికవేత్తల పెళ్లిళ్లలో డ్యాన్సులు చేసి కూడా బ్యాంకు బ్యాలెన్సు పెంచుకుంటాడన్న సంగతి తెలిసిందే. ఇందుకోసం సుమారు రూ. 8 కోట్లు తీసుకుంటాడని టాక్. వివాహ వేడుకల్లో డ్యాన్సులు చేయడానికి ఆమిర్‌ఖాన్, సల్మాన్ ఖాన్, సైఫ్ ఖాన్‌లు ఇష్టపడని కారణంగా.. ఈ విషయంలోనూ షారుఖ్ కింగే. అందుకే అతనికి బాగా డిమాండ్. 2012లో ఏకంగా 250 ఆఫర్లు రాగా పది మాత్రమే అంగీకరించాడట. ఆ రకంగా చూసినా కేవలం డ్యాన్సులు చేయడం ద్వారా రూ. 80 కోట్లు అందుకున్నాడని అంచనా. వీటిని పక్కన పెడితే .. అడ్వర్టైజ్‌మెంట్ల ద్వారా కూడా భారీగానే సంపాదిస్తుంటాడు షారుఖ్. టాల్కమ్ పౌడర్ల నుంచి కూల్ డ్రింకుల దాకా రకరకాల ప్రకటనలతో అలరిస్తూ.. ఆర్జిస్తుంటాడు. ఇటీవలే ఒక పాన్ మసాలా ప్రకటనలకు సంబంధించి రూ. 20 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు.
 
తెలివైన మదుపరి
 
ఆదాయాన్ని ఆర్జించేందుకు అందుబాటులో అన్ని మార్గాలను వినియోగించుకునే షారుఖ్ ఖాన్ .. డబ్బును గౌరవిస్తాడు. దాన్ని స్మార్ట్‌గా ఇన్వెస్ట్ చేసేందుకు ప్రాధాన్యమిస్తాడు. అందుకే ముంబైలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల రియల్ ఎస్టేట్ ప్రాపర్టీల్లో ఇన్వెస్ట్ చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ క్రికెట్ టీమ్‌ను కొన్నాడు. రెడ్ చిల్లీ ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశాడు.
 
అలాగే ఇన్‌డోర్ థీమ్ పార్క్స్‌కి సంబంధించిన ఇమేజినేషన్ ఎడ్యుటెయిన్‌మెంట్ ఇండియాలోనూ పెట్టుబడులు పెట్టాడు. ఇలాంటి తెలివైన పెట్టుబడులతో సంపదను మరింత రెట్టింపు చేసుకోవడంలో చాలా స్మార్ట్‌గా వ్యవహరిస్తాడు షారుఖ్. మరో విషయం.. కేవలం సినిమాలే లోకంగా కాకుండా, ప్రతి విషయం గురించి అప్ టు డేట్ ఉంటాడు షారుఖ్.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement