సాక్షి, న్యూఢిల్లీ : షారుక్ ఖాన్ హీరోగా ఆనంద్ ఎల్ రాయ్ నిర్మిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘జీరో’ తొలి టీజర్ విడుదలైన విషయం తెల్సిందే. వచ్చే డిసెంబర్ నెలలో విడుదల కానున్న ఈ చిత్రంలో షారుక్ ఖాన్ మరుగుజ్జు పాత్రలో ఎలా నటిస్తున్నారన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. సరిగ్గా 29 ఏళ్ల క్రితం కమలా హాసన్ నటించిన ‘అపూర్వ సహోదరులు’ చిత్రాన్ని తమిళ, తెలుగుభాషల్లో విడుదల చేయగా కలెక్షన్లు హోరెత్తాయి. తమిళనాట అప్పటి వరకు నెలకొన్న అన్ని రికార్డులను ఆ సినిమా బద్ధలు కొట్టింది. ఆ తర్వాత ఆ సినిమా రికార్డును అధిగమించినది రజనీకాంత్ నటించిన ‘బాషా’ చిత్రం మాత్రమే.
అపూర్వ సహోదరులు అంతటి ఆదరణ పొందడానికి కారణం ‘అప్పు’ పాత్రలో కమల్ హాసన్ మరుగుజ్జుగా కనిపించడమే. మోకాళ్ల వరకే పూర్తి కాలున్నట్లుగా కమల్ హాసన్ ఆ చిత్రంలో కనించడానికి కమలహాసన్‌తోపాటు దర్శకుడు ఎంతో కష్టపడ్డారు. అది ఎలా సాధ్యమైందన్న విషయాన్ని కమలా హాసన్‌గానీ, ఆ సినిమా దర్శకుడు సింగీతం శ్రీనివాస్ రావుగానీ వెల్లడించకుండా 2008 సంవత్సరం వరకు గోప్యంగా ఉంచారు.
ఈ రహస్యం ఇప్పటి కూడా అందరికి తెలియకపోవచ్చు. ఆ చిత్రంలో మరుగుజ్జు పాత్ర కోసం ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్నిగానీ, గ్రాఫిక్స్‌గానీ ఉపయోగించలేదు. సింగీతం శ్రీనివాస్ రావు కథనం ప్రకారం. కమల్ హాసన్ ఎక్కువ వరకు వెనక కాళ్లు కనిపించకుండా మోకాళ్లపై నడిచారు. అందుకనే ఎక్కువ షాట్లు క్లోజప్‌లోనే ఉంటాయి. ఇక కమల్ హాసన్ పక్కకు తిరిగి నడుస్తున్నట్లుగా చూపించాల్సి వచ్చినప్పుడు కందకం తవ్వి అందులో మోకాలి వరకు కమల్‌ను నిలబెట్టి ఇసుకతో పూడ్చి నడిపించారు.
మోకాళ్లపై నడుస్తున్నప్పుడు ఎక్కువ వరకు సహజంగా కనిపించేందుకు, మోకాలి చిప్ప నొప్పి పెట్టకుండా ఉండేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన బూట్లను వాడారు. ఇక తోటి నటుల మధ్య ఎదురుగా కాకుండా అటూ ఇటూగా ఉన్నప్పుడు కూడా కందకం టెక్నిక్‌నే వాడారు. పాటల సందర్భంలో, ముఖ్యంగా సర్కస్ మిత్రులతో కలిసి కాళ్లూపుతూ పాటలు పాడినప్పుడు కమల్ ప్రత్యేకంగా రూపొందించిన కత్రిమ కాళ్లను వాడారు. ఆ కాళ్లను వంచిన మోకాళ్లకు తగిలించి కదిలేలా చేశారు.
అప్పు పాత్రలో కమల్ హాసన్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మోకాళ్ల వరకు కాళ్లను కత్తిరించినట్లు కనిపిస్తుంది తప్పా, పూర్తి సహజత్వం కనిపించదు. అయినప్పటికీ ఆ ప్రయోగం నచ్చడంతో సినిమా సూపర్ డూపర్ హిట్టయింది. ఆ తర్వాత 2001లో విడుదలైన ఆషిక్ సినిమాలో జానీ లివర్ ఇలాంటి టెక్నిక్‌కే ఉపయోగించి మరుగుజ్జు పాత్రలో నటించారు. ఇక 2006లో విడుదలైన ‘జాన్ ఏ మన్’ చిత్రంలో అనుపమ్ ఖేర్ మరుగుజ్జు పాత్రలో నటించారు. ఆ సినిమాలో ఆయన మోకాళ్ల వరకు కాళ్లు మడిచే నడిచారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా 40 రోజుల పాటు ఏకధాటిగా షూటింగ్‌లో పాల్గొనడం వల్ల ఆయన మోకాలి చిప్పలు అప్పట్లో వాచి పోయాయి. ఇప్పుడు కూడా మెట్లు ఎక్కుతుంటే మోకాలి చిప్పలు కలుక్కుమంటున్నాయని అనుపమ్ ఖేర్ అప్పుడప్పుడు చెబుతుంటారు.
ఇప్పుడు ‘జీరో’ చిత్రంలో షారూక్ ఖాన్ మరుగుజ్జుగా ఎలా నటిస్తున్నారన్నది ఆసక్తికరమైన తాజా ప్రశ్న. కమల్ హాసన్, అనుపమ్ ఖేర్‌లలాగా మోకాలి చిప్పలను దెబ్బతీసుకోకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడి షారుక్ ఖాన్ నటించారు. ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్, ది హాబిట్’ లాంటి చిత్రాల్లో ఉపయోగించిన పీటర్ జాక్సన్ ‘పర్స్‌పెక్టివ్ టెక్నిక్’ను ఇందులో ఉపయోగించారు. దీనికి విస్తతమైన సెట్లు అవసరం అవుతాయి. తోటి పాత్రలకన్నా షారుక్ ఖాన్‌ను చాలా దూరంగా ఉంచి షూటింగ్ చేయడం వల్ల షారుక్ ఖాన్ పొట్టిగా కనిపిస్తారు. ఆ తర్వాత పాత్రల మధ్య ఆ దూరం కనిపించకుండా కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగిస్తారు. ఇందులో కూడా కెమేరా పనితనం బాగా లేకపోయినా, కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో మిక్సింగ్ బాగాలేకున్నా, సినిమా మొత్తం నిడివిలో ఒకేతీరు పర్స్‌పెక్టివ్ లేకున్నా సహజత్వం లోపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment