తెర పై తడాఖా దేఖో | special story on bollywod movies - 2017 | Sakshi
Sakshi News home page

తెర పై తడాఖా దేఖో

Published Fri, Aug 4 2017 12:07 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

తెర పై తడాఖా దేఖో - Sakshi

తెర పై తడాఖా దేఖో

రాబోయే ఆరు నెలల్లో బాలీవుడ్‌లో రిలీజ్‌ కానున్న సినిమాలపై ఏక్‌ నజర్‌

2017 తొలి సగం బాలీవుడ్‌కు మంచి ఠస్సా ఇచ్చింది. బాహుబలి 2 హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌ రికార్డ్‌ కలెక్షన్లు సాధించి దానికి దక్షిణాది సత్తా చూపించింది. 2017 జూన్‌ వరకు జరిగిన బాలీవుడ్‌ రిలీజుల్లో షారూక్‌ ఖాన్‌ ‘రయీస్‌’, సల్మాన్‌ ఖాన్‌ ‘ట్యూబ్‌లైట్‌’ సినిమాలు ఉన్నా ‘బాహుబలి’ హిందీ డబ్బింగే తన వసూళ్లతో మొదటి వరుసలో నిలిచింది.

ఈ సీజన్‌లో విజయం సాధించిన సినిమాల్లో హృతిక్‌ రోషన్‌ ‘కాబిల్‌’, అక్షయ్‌ కుమార్‌ ‘జాలీ ఎల్‌ఎల్‌బి–2’ ఉండగా చిన్న బడ్జెట్‌తో రిలీజయ్యి మంచి  కలెక్షన్లు సాధించిన సినిమాగా ఇర్ఫాన్‌ ఖాన్‌ ‘హిందీ మీడియం’ నిలిచింది.  అయితే 2017 మొదటి ఆరు నెలల్లో విడుదలైన సినిమాల కంటే నేటి నుంచి రాబోయే రోజుల్లో విడుదల కానున్న సినిమాలే ఎక్కువ ఆసక్తికరంగా ఉన్నాయి. సినిమా ప్రేక్షకులను ఊరిస్తూ ఉన్నాయి. వాటి వివరాలు చూద్దాం.


జబ్‌ హ్యారీ మెట్‌ సెజల్‌
దర్శకుడు ఇంతియాజ్‌ అలీ తన మొదటి సినిమా ‘జబ్‌ వియ్‌ మెట్‌’తోనే ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. షాహిద్‌ కపూర్, కరీనా కపూర్‌ నటించిన ఆ సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది. దాని తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ ‘జబ్‌ హ్యారీ మెట్‌ సెజల్‌’ సినిమాతో అదే మేజిక్‌ను ఇంతియాజ్‌ చేయాలనుకుంటున్నాడు. ‘రబ్‌ నే బనాదీ జోడీ’లో జంటగా నటించిన షారూక్, అనుష్క శర్మలు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సెజల్‌ అనేది సినిమాలో అనుష్క పేరు. ఆ మాటకు ‘కెరటం’ అని అర్థం అట. ‘హ్యారీ’ అనేది హరిందర్‌ సింగ్‌కు హ్రస్వనామం. ఇది షారుక్‌ ఖాన్‌ పేరు. సినిమాలో షారుక్‌ టూరిస్ట్‌ గైడ్‌గా నటిస్తున్నాడు. యూరప్‌ చూడటానికి వచ్చిన హీరోయిన్‌ తన ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ను పోగొట్టుకుంటుంది. దాని కోసం తన ట్రిప్‌ను కేన్సిల్‌ చేసుకుని వెతికే క్రమంలో షారుక్‌తో ఎలా ప్రేమలో పడిందనేది కథ. ఆగస్టు 4న విడుదల.

టాయిలెట్‌ ఏక్‌ ప్రేమ్‌ కథ
నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక ‘స్వచ్ఛభారత్‌’ క్యాంపెయిన్‌ని స్వీకరించారు. సినిమా వాళ్లు ఈ క్యాంపెయిన్‌ను అందిపుచ్చుకుని తయారు చేసిన సినిమాయే ‘టాయిలెట్‌ ఏక్‌ ప్రేమ్‌ కథ’. అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించిన ఈ సినిమాలో భూమి పెడ్నేకర్‌ అనే కొత్తమ్మాయి హీరోయిన్‌గా నటించింది. ఒక పల్లెటూరికి కొత్త కోడలిగా వచ్చిన హీరోయిన్‌ తన అత్తగారింట్లో టాయిలెట్‌ లేదని, మల విసర్జనకు ఆరుబయటకు వెళ్లాల్సి వస్తోందని కాపురం నిరాకరిస్తుంది. భర్త మీద ప్రేమ ఉన్నా ఆమె అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. భర్త ఇంట్లో టాయిలెట్‌ కట్టించాలనుకుంటే నువ్వొక్కడివే కట్టిస్తే మిగిలిన ఊళ్లో అందరూ కట్టించాల్సి వస్తుంది అని ఊరు ఎదురు తిరుగుతుంది. ఈ పంతాలు పౌరుషాలలో వారి మధ్య ఏం జరిగిందనేది కథ. ఆగస్టు 11 విడుదల.

బరేలీ కి బర్ఫీ
‘దంగల్‌’ సినిమాకు దర్శకత్వం వహించిన నితిష్‌ తివారీ కథ అందించిగా అతని భార్య అశ్విని అయ్యర్‌ తివారి దర్శకత్వం వహించిన సినిమా. ఉత్తర ప్రదేశ్‌ బరేలీకి చెందిన ఒక అమ్మాయి వెంట ఇద్దరు కుర్రవాళ్లు పడగా వారిలో ఎవరో ఆ అమ్మాయిని గెలుచుకున్నారనేది కథ. ఇది పైకి కనిపించే కథే అయినా ఉత్తర ప్రదేశ్‌ టౌన్‌ కల్చర్‌ చూపించడం అసలు ఉద్దేశ్యం. రాజ్‌ కుమార్‌ రావు, ఆయుష్మాన్‌ ఖురానా, క్రితి సనన్‌ ముఖ్య పాత్రలు పోషించారు.
ఆగస్టు 18 విడుదల.

హసీనా పార్కర్‌
హసీనా పార్కర్‌: దావుద్‌ ఇబ్రహీం అందరికీ తెలుసు. కాని అతడి చెల్లెలు హసీనా ముంబైలో దాదాపు అంతే హవా చలాయించింది. ఆమె మీద తీసిన సినిమాయే ‘హసీనా పార్కర్‌’. ముంబై పేలుళ్ల వరకూ నేర ప్రపంచంతో సంబంధం లేని హసీనా ముంబై పేలుళ్ల ప్రధాన నిందితుడు దావుద్‌ కావడంతో అతడి చెల్లెలైన కారణాన విచారణను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముంబైలోని ముఠాల మధ్య కొట్లాటలు కూడా అనివార్యంగా ఆమెను లేడీ డాన్‌గా మారుస్తాయి. దావుద్‌ ‘భాయ్‌’ అయితే హసీనా ‘ఆపా’. శ్రద్ధా కపూర్‌ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాకు అపూర్వ లాఖియా దర్శకత్వం వహించాడు. ఆగస్టు 18 విడుదల.

పార్టిషన్‌ 1947
లార్డ్‌ మౌంట్‌ బాటెన్‌ చివరి వైస్రాయ్‌గా భారత విభజనలో కీలకపాత్ర పోషించాడనేది చరిత్ర. దీనిపై భారతీయులు, పాకిస్తానీయులు తమదైన దృష్టికోణం కలిగి ఉన్నా అసలు లార్డ్‌ మౌంట్‌ బాటన్‌ దృష్టికోణం నుంచి ఈ విభజనను ఎలా అర్థం చేసుకోవాలనేది ఈ సినిమా చెబుతుంది. బ్రిటిష్‌–ఇండియన్‌ చిత్రంగా దర్శకురాలు గురిందర్‌ చద్దా దర్శకత్వంలో రూపొందించబడిన ఈ సినిమా దేశ విభజన లోతు పాతులపై కొత్త వెలుతురు వేసే అవకాశం ఉంది. గాంధీ, జిన్నా, నెహ్రూ, మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ వంటి చారిత్రక పాత్రలతో నిండిన ఈ సినిమా దేశ చరిత్రపై కుతూహలం ఉన్న ప్రతి ఒక్కరు తప్పక చూడవలసిన సినిమా. ఇంగ్లిష్‌లో తీసిన ఈ సినిమా భారతీయుల కోసం హిందీలో డబ్‌ చేశారు. ఆగస్టు 18 విడుదల.

బాబూమోషాయ్‌ బందూక్‌బాజ్‌
ఉత్తర ప్రదేశ్‌లో డబ్బులకు హత్యలకు చేసే ఒక షార్ప్‌ షూటర్‌గా నవాజుద్దీన్‌ సిద్దిఖీ నటించిన సినిమా ఇది. ఉత్తర ప్రదేశ్‌ యాసను, కొందరి మోటు జీవనాన్ని ఈ సినిమాలో చూడవచ్చు. ఈ సినిమాలో శృతి మించిన శృంగార సన్నివేశాలు ఉన్నాయంటూ షూటింగ్‌ మధ్యలోనే నటి చిత్రాంగదా సింగ్‌ తప్పుకోవడం వివాదాస్పదం అయ్యింది. అయితే ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డు దాదాపు 38 కట్స్‌ చెప్పడంతో ఇందులో నటించిన హీరోయిన్‌ బిదిత ‘ఏం... భారతీయులు ముద్దు పెట్టుకోరా?’ అని మండి పడింది.
ఆగస్టు 18 విడుదల.

డాడీ
ముంబై అండర్‌వరల్డ్‌ డాన్‌ అరుణ్‌ గావ్లీని అందరూ ముద్దుగా ‘డాడీ’ అని పిలుస్తారు. అతడి జీవిత చరిత్ర ఆధారంగా నటుడు అర్జున్‌ రాంపాల్‌ నటించి, నిర్మించిన సినిమా ‘డాడీ’. శివసేన అధినేత బాల్‌ థాకరే ఆశీస్సులతో డాన్‌గా ఎదిగి ఆ తర్వాత రాజకీయాలలో వచ్చి బాల్‌థాకరేతోనే విభేదించి సొంత పార్టీ పెట్టి ఎం.ఎల్‌.ఏ అయిన అరుణ్‌ గావ్లీ ఒక దశలో ముంబై పోలీసులను గడగడలాడించాడని చెప్పాలి. బట్టల మిల్లులో కూలివాడిగా పని చేసే స్థాయి నుంచి నేర సామ్రాజ్య అధిపతిగా ఎదిగే గావ్లీ ప్రయాణాన్ని ఈ సినిమాలో చూడవచ్చు. సెప్టెంబర్‌ 8 విడుదల.

ఇవి కాకుండా జైలు నేపధ్యంలో రెండు సినిమాలు వస్తున్నాయి. ఒకటి ‘ఖైదీ బ్యాండ్‌’, రెండు ‘లక్నో సెంట్రల్‌’. రెంటిలోనూ ఖైదీలు మ్యూజిక్‌ బ్యాండ్‌ను ఏర్పాటు చేసుకోవడం ముఖ్యాంశం.కెరీర్‌లో కొంత వెనుక బడి ఉన్న సైఫ్‌ అలీ ఖాన్‌ సినిమాలు కూడా రెండు విడుదల అవుతున్నాయి. ‘కాలాకాండీ’, ‘షెఫ్‌’ ఆ సినిమాల పేర్లు. ‘క్వీన్‌’తో సంచలనం సృష్టించిన కంగనా మళ్లీ ‘సిమ్రన్‌’ పేరుతో హీరోయిన్‌ ఓరియంటెడ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమిర్‌ ఖాన్‌ ముఖ్యపాత్ర పోషించిన ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’ అక్టోబర్‌ 13న విడుదల కానుంది. పోఖ్రాన్‌ అణుపరీక్షల ఆధారంగా తీసిన  చిత్రం ‘పరమాణు’ డిసెంబర్‌లో వస్తుండగా అదే నెలలో సల్మాన్‌ ఖాన్‌ ‘టైగర్‌ జిందా హై’ కూడా విడుదల కానుంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement