బాలీవుడ్ బాద్షా షారుఖ్ఖాన్కు 48 ఏళ్లు!!
అది 1988 సంవత్సరం. అప్పటికి టీవీలు కొంతవరకు మన ఇళ్లలోకి బాగానే వచ్చేశాయి. కానీ అప్పట్లో ఉన్న ఏకైక ఛానల్.. దూరదర్శన్. కాబట్టి అందులో వచ్చే సీరియళ్లు, అవి తెలుగువైనా, హిందీవైనా కూడా తప్పనిసరిగా చూసేవాళ్లు. ఆరోజుల్లో 'ఫౌజీ' అనే సీరియల్ మొదలైంది. కమాండో ట్రైనింగ్ కోసం కొంతమంది కుర్రాళ్లు వస్తారు. వాళ్లలో అభిమన్యు రాయ్ ఒకడు. అతడికి ట్రైనింగ్ అంటే చాలా చులకన భావం. తనకు కరాటే వచ్చని చెప్పిన అతడిని శిక్షకుడు అరక్షణంలో బోల్తా కొట్టిస్తాడు. కమాండో ట్రైనింగ్ అంటే చిన్న విషయం కాదని చెబుతాడు. అప్పటినుంచి కఠోర శిక్షణ తీసుకుని, పాకిస్థాన్ మీద ఆపరేషన్లలో ఎలా పాల్గొంటాడన్న విషయాన్ని సినిమా కంటే ఎంతో ఆసక్తికరంగా మలిచారు. ఇంతకీ ఆ సీరియల్లో హీరో.. అదే అభిమన్యు రాయ్ ఎవరనుకుంటున్నారా? బాలీవుడ్ బాద్షా, కింగ్ ఆఫ్ కింగ్స్, కింగ్ ఖాన్.. ఇలా అనేక పేర్లతో ప్రసిద్ధి చెందిన షారుఖ్ ఖాన్.
పదిహేనేళ్ల వయసులో ఇంకా జీవితం అంటే ఏంటో తెలియకముందే తండ్రిని కోల్పోయాడు షారుఖ్. తర్వాత తనను ప్రాణప్రదంగా పెంచిన తల్లి కూడా కాలం చేసింది. 23 ఏళ్ల వయసులోనే ముఖానికి రంగు పూసుకుని టీవీ సీరియళ్లలో నటించడం మొదలుపెట్టాడు. రెండో సీరియల్ సర్కస్తో ప్రేక్షకుల మనసు దోచేసుకున్నాడు. ఇక బుల్లి తెర చాలు.. వెండితెర మీదకు రావాలని ప్రేక్షకులూ అనుకున్నారు, అతడూ అనుకున్నాడు. 1992లో దీవానా చిత్రంతో బాలీవుడ్ రంగప్రవేశం చేశాడు. ఆ సినిమాలో షారుఖ్ ఖాన్, దివ్యభారతిల ఆన్స్క్రీన్ రొమాన్స్ బాగా పండింది. అంతే.. బాలీవుడ్లో షారుఖ్ తిరుగులేని స్థానం సంపాదించుకున్నాడు. తర్వాత అతడు హీరోగా డర్, బాజీగర్ లాంటి చిత్రాలు వచ్చాయి. వాటిలో నెగెటివ్ షేడ్ ఉన్న హీరోగా, నటనలో తాను ఎంత అగ్రస్థానానికి వెళ్లగలనో అందరికీ చూపించాడు.
ఇక 1995లో వచ్చిన దిల్వాలే దుల్హనియా లేజాయేంగే చిత్రం షారుఖ్ కెరీర్లోనే ఓ మైలురాయిగా నిలిచిపోయింది. దేశంలోనే అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా ఇది రికార్డులు సృష్టించింది. ఆ తర్వాత పరిశ్రమలో ఉన్న మరో ఖాన్.. సల్మాన్తో కలిసి కరణ్ అర్జున్ సినిమాలో నటించాడు. అది కూడా సూపర్ హిట్ అయ్యింది. మధ్యమధ్యలో ఒకటి రెండు పరాజయాలు ఎదురైనా.. పడి లేచే కడలి తరంగంలా మళ్లీ మళ్లీ హిట్లు సాధించడం షారుఖ్కే చెల్లింది.
తాజాగా చెన్నై ఎక్స్ప్రెస్ చిత్రంలో దీపికా పదుకొనేతో ఒకవైపు భయం, మరోవైపు ధైర్యం.. ఇవన్నీ కలగలిసిన ఫీలింగులతో షారుఖ్ చేసిన నటనకు ఆలిండియా ప్రేక్షకులు హారతులు పట్టారు. ఈ చిత్రం విదేశాల్లో కూడా భారీ విజయాలు మూటగట్టుకుంది. మధ్యమధ్యలో క్రికెట్ అంటే తనకున్న ప్రేమను ఐపీఎల్ జట్టు కొనుగోలు ద్వారా చూపించుకున్నా, తనను మొదట్లో ఆదరించిన బుల్లితెరను వదిలిపెట్టకుండా కౌన్ బనేగా కరోడ్పతి లాంటి షోలు చేసినా.. అన్నీ షారుఖ్ ఖాన్కే చెల్లు. గౌరీ చిబ్బర్ అనే హిందువును పెళ్లి చేసుకున్న షారుఖ్.. ఇంట్లో పరమత సహనానికి పెద్దపీట వేస్తూ రెండు మతాలూ అవలంబిస్తుంటాడు. కేవలం సినిమాల్లో చెప్పడమే కాదు.. నిజజీవితంలో కూడా పాటిస్తానంటూ చేసి చూపిస్తున్నాడు.
48 ఏళ్లు నిండిన షారుఖ్ ఖాన్.. ఇప్పటికీ యువ హీరోలతో పోటీపడుతూ, తనలోని ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదంటూ కుర్రాడిలా పాటలు, ఫైట్లు చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్నాడు. బాలీవుడ్ బాద్షాకు సాక్షి చెబుతోంది.. పుట్టిన రోజు శుభాకాంక్షలు.. హేపీ బర్త్డే షారుఖ్!!