కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ సీఎఫ్‌వోకు 18 నెలల జైలు
జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ చెక్ బౌన్స్ కేసులో..
సాక్షి, హైదరాబాద్: జీఎంఆర్ ఎయిర్‌పోర్టుకు చెల్లించాల్సిన చార్జీలకు సంబంధించి ఇచ్చిన రెండు చెక్కులు బౌన్స్ అయిన కేసులో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ సీఎఫ్‌వో రఘునాథన్‌కు హైదరాబాద్‌లోని ప్రత్యేక కోర్టు 18 నెలల జైలు శిక్ష విధించింది. అలాగే రూ.40 వేలు జరిమానా చెల్లించాలని న్యాయమూర్తి ఎం.క్రిష్ణారావు గురువారం తీర్పునిచ్చారు. గతంలోనే కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్‌మాల్యా, రఘునాథన్‌లపై చెక్‌బౌన్స్‌కు సంబంధించిన నేరం రుజువైంది. అయితే శిక్ష కాలాన్ని ఖరారు చేసేందుకు వీరిద్దరినీ వ్యక్తిగతంగా హాజరుపర్చాలని పోలీసులను ఆదేశిస్తూ న్యాయమూర్తి అరెస్టు వారెంట్లు జారీచేశారు.
ఈ వారంట్లు గత ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి. విజయ్‌మాల్యా దేశం బయట ఉన్నాడని పోలీసులకు కోర్టుకు నివేదించారు. అయితే పలు కోర్టుల్లో వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉన్నందున ఇక్కడి కోర్టుకు రఘునాథన్ హాజరు కాలేకపోయారని, విజయ్‌మాల్యా దేశం బయట ఉన్నందున ఈ కేసును విడదీసి (స్ల్పిట్) తీర్పు ఇవ్వాలని రఘునాథన్ తరఫు న్యాయవాది నివేదించారు. ఈ నేపథ్యంలో రఘునాథన్ గురువారం హాజరుకావడంతో న్యాయమూర్తి ఆయనకు శిక్షను ఖరారు చేశారు.
కింగ్‌ఫిషన్ ఎయిర్‌లైన్స్ రూ.22.5 కోట్లకు ఇచ్చిన 17 చెక్కులు బౌన్స్ అయ్యాయని, ఈ కేసులు విచారణలో ఉన్నాయని జీఎంఆర్ తరఫు న్యాయవాది జి.అశోక్‌రెడ్డి తెలిపారు. ఈ కేసులో మరో నిందితునిగా ఉన్న విజయ్‌మాల్యా ఎక్కడున్నారో అందరికీ తెలుసని, ఆయన భారత్‌కు తిరిగి వచ్చే అవకాశం లేదని, ఆయన్ను భారత్‌కు తీసుకురావడానికి అనేక సంవత్సరాలు పట్టవచ్చని తెలిపారు. ఈ కేసులో ఒక నిందితుడు హాజరైన నేపథ్యంలో విజయ్‌మాల్యాకు కూడా శిక్ష ఖరారు చేయాలని నివేదించారు. అలాగే కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు జరిమానా విధించాలని కోరారు.