Kinley
-
100 శాతం ఆర్‌పీఈటీ బాటిళ్లు.. దేశంలో ఫస్ట్ టైమ్!
సాక్షి, న్యూఢిల్లీ: కోకా–కోలా సంస్థ 100 శాతం రీసైకిల్డ్ ప్లాస్టిక్ మెటిరీయల్ (ఆర్‌పీఈటీ) తో రూపొందించిన కిన్లే సీసాలను తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి విడుదల చేసింది. 100శాతం ఆర్పీఈటీతో రూపొందించిన సీసాను ఆహారం/పానీయాల కోసం ఉపయోగించడం దేశంలో ఇదే మొదటిసారి అని సంస్థ ప్రతినిధులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వ్యర్థాలు లేని ప్రపంచం సృష్టించే క్రమంలో 2030 నాటికి ప్యాకేజింగ్‌లో కనీసం 50శాతం రీసైకిల్డ్ బాటిళ్లను ఉపయోగించే లక్ష్యంతో సంస్థ ఉన్నట్లు టెక్నికల్ ఇన్నోవేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎన్రిక్ అకర్మాన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కోకా–కోలా ఫ్రాంచైజ్ భాగస్వామి సర్వారాయ సుగర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్బీపీపీ రామ్మోహన్ మాట్లాడుతూ... సంస్థ నిర్ణయం సుస్థిరమైన ప్లాస్టిక్ వాడకంపై ప్రభుత్వ దృక్పథానికి అనుగుణంగా ఉందని పేర్కొన్నారు. -
‘కిన్లే’ బాటిళ్ల అప్పగింతకు హైకోర్టు నిరాకరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర తూనికలు, కొలతల శాఖ సీజ్ చేసిన లక్ష మంచినీటి బాటిళ్లను కిన్లే కంపెనీకి అప్పగించేందుకు హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. గత ఏప్రిల్ 2న తూనికలు, కొలతల శాఖ అధికారులు మెదక్ జిల్లా, పాశమైలారంలోని హిమజల్ బేవరేజెస్లో తనిఖీలు నిర్వహించారు. కిన్లే బాటిళ్లపై వినియోగదారులు ఫిర్యాదులు చేయాల్సిన వ్యక్తి పేరు, చిరునామా, ఫోన్ నంబర్ లేవంటూ లక్ష బాటిళ్లను అధికారులు జప్తు చేశారు. వీటిని వెంటనే తమకు అప్పగించేందుకు ఆదేశించాలని కిన్లే కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యాజ్యం విచారణకు వచ్చిన సందర్భంగా సింగిల్ జడ్జి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు అధికారుల తీరును తప్పుబట్టారు. ఫిర్యాదు చేయాల్సిన టోల్ ఫ్రీ నంబర్, ఈ మెయిల్ అడ్రస్ ఉన్నాయని, వ్యక్తి పేరు లేదన్న కారణంతో జప్తు చేయడం సరికాదన్నారు. జప్తు చేసిన బాటిళ్లను కంపెనీకి అప్పగించాలని తూనికలుకొలతల శాఖ, అధికారులను ఆదేశించారు. దీన్ని సవాల్ చేస్తూ తూనికలుకొలతల శాఖ, హైకోర్టు ధర్మాసనం ఎదుట అప్పీల్ చేయగా సోమవారం విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరపాల్సివుందని, ఈ దశలో బాటిళ్లను అప్పగించేందుకు ఉత్తర్వులు ఇవ్వలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. జప్తును ఎత్తివేయాలన్న కంపెనీ తరఫు న్యాయవాది అభ్యర్థనపై స్పందిస్తూ.. వినియోగదారుడు డబ్బు పెట్టి కొనుగోలు చేసిన మంచినీటి బాటిల్లోని నీరు ఎక్కడి నుంచి సేకరించారో తెలుసుకునే హక్కు వారికి ఉందని, మూసీ నీటినే శుద్ధి చేసి ఇస్తున్నారో, వేరే ఎక్కడి నుంచి తెస్తున్నారో తెలియాలి కదా.. అని వ్యాఖ్యానించింది. వాదనల అనంతరం ధర్మాసనం విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేస్తూ సీజ్ చేసిన బాటిళ్లను విడుదల చేయరాదని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. -
ఆ డ్రింక్స్ రేట్లు పెరుగుతున్నాయ్!
జీఎస్టీ జూలై 1 నుంచి అమల్లోకి వస్తుండటంతో, ప్రముఖ శీతల పానియాల సంస్థ కోకా కోలా తన కార్బోనేటేడ్ పానీయాల పోర్ట్ ఫోలియోలో ధరలను పెంచనున్నట్టు ప్రకటించింది. అదేవిధంగా ప్యాకేజ్డ్ వాటర్ బ్రాండ్ కిన్లే రేట్లను తగ్గించనున్నట్టు పేర్కొంది. అయితే జ్యూస్ లు, జ్యూస్ ల ఆధారిత డ్రిక్ ల పోర్టు ఫోలియోలో ధరలు పెంచబోమని కంపెనీ స్పష్టంచేసింది. కొత్త పన్ను విధానం ప్రకారం ప్రస్తుతమున్న రేట్ల కంటే అత్యధిక మొత్తంలో శీతలపానీయాలపై పన్ను శ్లాబులను ప్రతిపాదించారు. శీతల పానీయాలపై పన్ను శ్లాబులు 40 శాతంగా ఉన్నాయి. దీంతో ఎలాంటి అవకాశం లేకుండా పోయిందని, తప్పనిసరి పరిస్థితుల్లో స్వల్పంగా ధరలు పెంచాల్సి వస్తుందని కోకా కోలా ఓ ప్రకటనలో పేర్కొంది. జీఎస్టీ విధానంలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ పన్ను రేట్లు తక్కువ ఉన్నందున వాటి ప్రయోజనాలను ప్రజలకు చేరవేస్తామని కంపెనీ చెప్పింది. ఈ మేరకు తన భాగస్వాములకు కిన్లే ధరలను తగ్గించాలని పేర్కొంది. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ను 18శాతం జీఎస్టీ పన్ను శ్లాబులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. జీఎస్టీ అమలైనప్పటి నుంచి భారత వృద్ధి పెరుగుతుందని అంచనావేస్తున్నామని, పన్ను ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తామని కోకా కోలా ఇండియా, సౌత్ వెస్ట్ ఆసియా బిజినెస్ యూనిట్ టీ.క్రిష్ణకుమార్ చెప్పారు. తమ బెవరేజ్ పోర్టుఫోలియోలో కొన్ని కేటగిరీలో పన్ను ప్రభావం పడుతుందన్నారు.