గాంధీజీ వారసులు.. కోటీశ్వరులయ్యారు!
వాళ్లిద్దరూ బాపూజీ వారసులు. బాపూజీ 'ఐదో కొడుకు' మునిమనవలు. ఇద్దరూ కవల పిల్లలు. వాళ్లిప్పుడు తమకు వారసత్వంగా వచ్చిన మోటార్ సైకిళ్ల వ్యాపారంలో కోటీశ్వరులయ్యారు. వాళ్లిద్దరిలో అనురాగ్ జైన్ సొంత సంపద దాదాపు 110 కోట్ల డాలర్లు. ఈ విషయాన్ని బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది. ఆయన సోదరుడు తరంగ్ జైన్ కూడా అంతే మొత్తంలో ఆస్తిని పొందారు. వీళ్లలో అనురాగ్ కంపెనీ ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ మోటారు సైకిళ్ల విడిభాగాలు తయారుచేస్తుంది. ఐపీఓ తర్వాత ఒకేసారి దాని విలువ 74 శాతం పెరిగింది. ఇక తరంగ్ కంపెనీ వారోక్ గ్రూప్ కూడా మోటార్ సైకిళ్లు, కార్ల విడిభాగాలు తయారుచేస్తుంది. ఈ రెండు కంపెనీలకు ఉన్న అతిపెద్ద కస్టమర్.. బజాజ్ ఆటో లిమిటెడ్!! ఎందుకంటే రాహుల్ బజాజ్ (78) వాళ్లకు సమీప బంధువు. వాళ్లు తయారుచేసిన విడిభాగాల్లో ఏదైనా సమస్య వస్తే వాళ్లను గట్టిగా అరిచేది తానేనని ఆయన చెప్పారు. బజాజ్ ఆటో ఎప్పుడూ తక్కువ ఖర్చుతో ఎక్కువ నాణ్యమైన ఉత్పత్తులు అందిస్తుందని, సరిగ్గా వీళ్లిద్దరూ కూడా అలాగే చేస్తున్నారని, అందుకే వాళ్లు ఎదిగారని తెలిపారు.
రాహుల్ బజాజ్ తన చిన్నతనంలో మహాత్మా గాంధీ ఒళ్లో కూర్చుని ఆడుకునేవారు. ఆశ్రమంలోనే ఆయన బాల్యం గడిచింది. చిన్నతనంలో ఎవరైనా పెద్దయ్యాక ఏం చేస్తావని అడిగితే పోలీసు అవుతాననో, పైలట్ అవుతాననో చెబుతారని, తాను మాత్రం పెద్ద వ్యాపారం చేస్తాననే చెప్పేవాడినని ఆయన అంటారు. ఆ తర్వాత భారతీయ స్కూటర్ పరిశ్రమ తీరుతెన్నులను ఆయన గణనీయంగా మార్చేశారు. తద్వారా 420 కోట్ల డాలర్ల సంపద వెనకేసి ప్రపంచంలోని 500 మంది ధనవంతుల్లో 433వ స్థానం పొందారు. బజాజ్ గ్రూపు వ్యవస్థాపకుడైన జమునాలాల్ బజాజ్ స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయనను గాంధీజీ తన ఐదో కొడుకని చెప్పేవారు. తన సొంత రాష్ట్రమైన మహారాష్ట్రలో ఆశ్రమం నెలకొల్పాలని గాంధీజీని ఆయనే అడిగారు. 1948లో హత్యకు గురయ్యేవరకు ఆయన అక్కడే ఉన్నారు. బజాజ్ కుటుంబం మాత్రం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ముంబై వెళ్లిపోయింది.