కేంద్ర మంత్రి ఏరీ.. ఎక్కడ?
అరకు రూరల్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ప్రకటనను వెనక్కు తీసుకోవాలని కోరుతూ అరకులోయలో ఎన్జీవో, సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు చేపడుతున్న ఉద్యమం దినదినం హోరెత్తుతోంది. అరకులోయలోని వైఎస్సార్ జంక్షన్ వద్ద రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఏపీఎన్జీవో, ఉపాధ్యాయులు, సమైకాంధ్ర జేఏసీ నాయకులు, వర్తకులు ఆదివారం అరకులోయలో రాజకీయ పార్టీల నాయకులతో కలసి నిరసన వ్యక్తం చేశారు. అరకు నుంచి భారీ మెజార్టీతో గెలుపొంది మంత్రి పదవి స్వీకరించి, ఈ ప్రాంతాన్నే మరిచిపోయిన కిషోర్ చంద్రదేవ్ కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిరసన బ్యానర్లో మంత్రి ఫొటోలు పెట్టి ర్యాలీ నిర్వహించి అరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా దీక్షా శిబిరంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సెల్ కన్వీనర్ టి. నర్శింగరావు మాట్లాడారు. ఉద్యోగుల ఆధ్వర్యంలో చేపడుతున్న పోరాటంలో అన్ని పార్టీలు కలసికట్టుగా పొల్గొనా లని సూచించారు. దేశంలోని మన్యసీమ ప్రాంతాలను కలుపుకొని దండకారణ్య రాష్ట్రాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. మరోవైపున అరకులోయలో తెలుగుదేశం చేపట్టిన నిరాహారదీక్ష రెండో రోజుకు చేరింది.