టీడీపీ పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా కేజే రెడ్డి?
– నేడు సీఎంతో భేటీ అయ్యే అవకాశం
– ఏకగ్రీవంగా సిఫారసు చేసిన పార్టీ నేతలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార తెలుగుదేశం పార్టీ నుంచి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానానికి రాగమయూరి బిల్డర్స్ అధినేత కె. జనార్దన్ రెడ్డి(కేజే రెడ్డి) రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. పార్టీకి చెందిన నేతలంతా ఏకగ్రీవంగా ఆయన పేరును సిఫారసు చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌తో కేజే రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గెలిచేందుకు మీరు వేసుకున్న ప్రణాళిక ఏమిటో వివరించాలని కోరినట్టు తెలిసింది. ఇందుకోసం తన యాక్షన్ ప్లాన్‌ను ఆయన వివరించినట్టు సమాచారం. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బుధవారం కేజే రెడ్డి సమావేశం కానున్నట్టు తెలిసింది. వాస్తవానికి ఈయన అభ్యర్థిత్వం మంగళవారమే ఖరారు కావాల్సి ఉన్నప్పటికీ.. కేబినెట్ సమావేశం ఉండటంతో సీఎంతో సమావేశం కాలేదని సమాచారం.
తెరపైకి తెచ్చిన శిల్పా
వాస్తవానికి అధికార పార్టీ నుంచి పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా మొదట్లో ఎంపీ టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ పేరు ప్రచారం జరిగింది. అయితే, అకస్మాత్తుగా కేజే రెడ్డి పేరును శిల్పా చక్రపాణి రెడ్డి తెరమీదకు తీసుకొచ్చారు. కొంతకాలం పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జిగా కేజే రెడ్డి పనిచేశారు. ఎన్నికల అనంతరం అధికార పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా లేరు. అయితే, పార్టీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డితో కేజే రెడ్డిఽకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన మిత్రుడు కేజే రెడ్డి పేరును శిల్పా తెరమీదకు తీసుకొచ్చి.. నేరుగా లోకేష్‌తో భేటీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. నేడు సీఎంతో సమావేశం అనంతరం అధికారికంగా కేజే రెడ్డి పేరును ప్రకటించినున్నట్టు అధికార పార్టీ వర్గాల సమాచారం. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఏపీఎన్జీవో నేత గోపాల్ రెడ్డి, పీడీఎఫ్ తరపున ఎమ్మెల్సీగా ఉన్న గేయానంద్ బరిలో ఉన్నారు.