ఐపీఎల్ కు క్రిస్ లిన్ దూరం?
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 నుంచి కోల్ కతా నైట్ రైడర్స్ స్టార్ ఆటగాడు క్రిస్ లిన్ గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో క్రిస్ లిన్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు.మ్యాచ్ చివర్లో గాల్లో డైవ్ కొట్టడంతో అతని భుజానికి తీవ్ర గాయమైంది. ఆ సమయంలో ఫీల్డ్ లో విలవిల్లాడిపోయిన లిన్.. ఫిజియో సాయంతో మైదానం వీడాడు.
అతని గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఐపీఎల్ టోర్నీ నుంచి వైదొలిగే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో లిన్ కీలక ఆటగాడిగా ఉన్నాడు. మొన్న గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో లిన్ చెలరేగి ఆడి 41 బంతుల్లో 6 ఫోర్లు,8 సిక్సర్లతో 93 పరుగులు చేశాడు. ఆ తరువాత నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్ లో 32 పరుగులు చేశాడు. అయితే ఫీల్డింగ్ చేసే సమయంలో బౌండరీ లైన్ వద్ద లిన్ గాయపడ్డాడు. దీనిపై మ్యాచ్ అనంతరం లిన్ ట్వీట్ చేశాడు. 'ప్రియమైన క్రికెట్ దేవుళ్లారా..నేనేమైనా తప్పు చేశానా 'అంటూ తాను డైవ్ కొట్టడాన్ని ట్వీట్ లో ప్రస్తావించాడు. ప్రస్తుతం తనకైన గాయంతో టోర్నీకి దూరమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదన్నాడు.