ఊరూరా బీరు-బారు అన్నట్లుగా ఉంది
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఊరూరా బీరు-బారు అన్నట్లుగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయని, రాష్ట్ర ప్రభుత్వం కళ్లున్నా కబోదిలా వ్యవహరిస్తోందని విమర్శించారు. సంపూర్ణ అక్షరాస్యత, ఆరోగ్యం, విద్య వంటి అంశాల్లో నంబర్‌వన్‌గా ఉండాలని కోరుకుంటే మద్యం అమ్మకాల్లో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌గా మారుతోందన్నారు. ఈ ఏడాది మద్యానికి సంబంధించి వివిధ రూపాల్లో రూ.35వేల కోట్ల వరకు ఆదాయం రానున్నదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చునన్నారు.
గోల్డెన్ అవర్స్ అని, హ్యాపీ అవర్స్ అనీ బార్లు ప్రోత్సాహకాలు ప్రకటించి యథే చ్చగా మద్యం అమ్మకాలు సాగిస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. మద్యం మహమ్మారి కారణంగా పేద, బడుగు వర్గాల ప్రజల జీవితాలు ఛిద్రం అవుతున్నాయన్నారు. ఈ భయానక పరిస్థితులపై ప్రభుత్వానికి కనువిప్పు కలిగి, మద్యం అమ్మకాల నియంత్రణకు చర్యలు తీసుకునేలా బీజేపీ సీనియర్ నేత ప్రొఫెసర్ శేషగిరిరావు ఈనెల 11న ఒకరోజు నిరాహార దీక్ష చేస్తున్నారన్నారు. ఈ దీక్ష కరపత్రాన్ని సోమవారం లక్ష్మణ్ విడుదల చేశారు.
బీజేపీలోకి టీఆర్ఎస్ నాయకులు
సోమవారం మంచిర్యాల జిల్లా టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు, హెచ్ఎంఎస్ యూనియన్ నాయకుడు పేరం రమేశ్ నేతృత్వంలో దాదాపు 200 మంది తమ పార్టీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సమక్షంలో చేరినట్లు బీజేపీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, ప్రధాని మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై రాష్ట్రంలో అనేక మంది బీజేపీలో చేరుతున్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు.