రూ.1.71 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం
రాయవరం, న్యూస్‌లైన్ : రాయవరంలో నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అనపర్తి సీఐ కె.నాగమోహన్‌రెడ్డి రాయవరం పోలీసు స్టేషన్లో విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. డిసెంబర్ 31న రాయవరంలోని మోహన్‌కృష్ణా ఫ్యాన్సీ స్టోర్‌సలో ఇద్దరు బాలలు బెల్టు కొనుగోలు చే సి, షాపు యజమానికి రూ.100 నకిలీ నోటును ఇచ్చారు. నకిలీ నోటును గుర్తించిన షాపు యజమాని ఈ విషయాన్ని పోలీసులకు తెలిపాడు. ఇద్దరు బాలలను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిని విచారణ చేశారు.
వారు ఇచ్చిన సమాచారంతో మండలంలోని వి.సావరం పరిధిలోని ఇటుకల బట్టీలో ఉంటూ నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న పరదక్షిణ వెంకన్న, వీధిలక్ష్మిలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు విషయం తెలిసిందన్న సమాచారంతో ఈ ఇద్దరూ పరారయ్యారు. బట్టీ వద్ద ఈ నిందితులు ఉన్నట్టుగా విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడి చేసి, అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1,71,300లుగా ఉన్న రూ.100 నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అనపర్తి జేఎఫ్‌సీఎం ముందు హాజరు పర్చనున్నట్టు సీఐ తెలిపారు. రాయవరం ఎస్సై చల్లా గోపాలకృష్ణ పాల్గొన్నారు.