ఇంటి సరిహద్దు సమస్య ..చంపేసింది
(దేవరపల్లి)తూర్పుగోదావరి: ఇంటి సరిహద్దు సమస్య నిండు ప్రాణాన్ని బలిగొంది. మండలంలోని కురుకూరు దళితవాడలో రెండు కుటుంబాల మధ్య ఇంటి సరిహద్దు సమస్య గత కొంత కాలంగా జరుగుతోంది. పత్తిపాటి శ్రీను(53), యంగల సత్యనారాయణ పక్కపక్క ఇళ్లు కలిగి ఉన్నారు. రెండు ఇళ్లు మధ్య సరిహద్దు వివాదం జరుగుతోంది.
వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. కొవ్వూరు సీఐ ఎం. సుబ్బారావు వివరాల ప్రకారం పత్తిపాటి శ్రీను, యంగల సత్యనారాయణ గత రెండు సంవత్సరాలుగా ఇంటి సరిహద్దు విషయంలో గొడవలు పడుతున్నారు. శనివారం రాత్రి పొద్దుపోయాక ఇద్దరి మధ్య వివాదం జరిగింది. దీనితో సత్యనారాయణ కత్తితో శ్రీనుపై దాడిచేసి మెడపై బలంగా నరికాడు. మెడ భాగంపై బలమైన గాయం కావడంతో శ్రీను అక్కడక్కడే మృతిచెందాడు. శ్రీనుకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సీఐ ఎం. సుబ్బారావు, ఎస్సై పి. వాసు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.