విజేందర్ సిక్సర్
► వరుసగా ఆరో బౌట్లోనూ గెలుపు
► ఈసారీ ప్రత్యర్థి నాకౌట్
లండన్: భారత ప్రొఫెషనల్ స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నాడు. వేదిక ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా పదునైన పంచ్‌లతో హడలెత్తిస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. ఆంద్రెజ్ సోల్డ్రా (పోలండ్)తో శుక్రవారం జరిగిన బౌట్లో విజేందర్ సింగ్ టెక్నికల్ నాకౌట్ పద్ధతిలో విజయాన్ని దక్కించుకున్నాడు. నిర్ణీత ఎనిమిది రౌండ్లపాటు జరగాల్సిన బౌట్ విజేందర్ ధాటికి ముచ్చటగా మూడో రౌండ్లోనే ముగిసింది.
విజేందర్ సింగ్ సంధించిన పంచ్‌లకు సోల్డ్రా ఎదురు నిలువలేకపోవడంతో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి భారత బాక్సర్‌ను విజేతగా ప్రకటించారు. దాంతో విజేందర్ తన ప్రొఫెషనల్ కెరీర్లో వరుసగా ఆరో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ ఆరు బౌట్లలో విజేందర్ తన ప్రత్యర్థులను నాకౌట్ చేయడం విశేషం. విజేందర్కు షాక్ ఇస్తానని బౌట్‌కు ముందు ప్రగల్భాలు పలికినా సోల్డ్రా రింగ్‌లోకి దిగాక చేతులెత్తేశాడు. ఆరంభం నుంచే విజేందర్ పంచ్‌లు విసరడంతో తొలి రౌండ్లోనే ఒకసారి సోల్డ్రా కుప్పకూలిపోయాడు. రెండో రౌండ్లోనూ విజేందర్ తన దూకుడు కనబరిచాడు. ఇక మూడో రౌండ్లో విజేందర్ పంచ్‌ల వర్షం కురిపించడంతో సోల్డ్రా ఓటమిని అంగీకరించాడు.