హవ్వ! దండేసి దండం పెట్టేశారు
రాంచి: సాధారణంగా మరణించిన వారి ఫొటోలకు దండ వేసి దండం పెట్టడం ఆనవాయితీ.. అంతేకాదు బతికున్న వారి ఫొటోలకు దండం పెట్టడం, బొట్టు పెట్టడం, దండ వేయడాన్ని అశుభంగా, అవమానంగా కూడా భావిస్తాం. కానీ జార్ఖండ్ రాష్ట్రంలో మాత్రం ఏకంగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఫొటోకు దండ వేసి, తిలకం దిద్దేశారు. సాక్షాత్తూ రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఇలా చేయడంతో అక్కడున్నవారంతా విస్తుపోయారు. ముక్కున వేలేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే జార్ఖండ్‌లోని కోదర్మ జిల్లా ఒక పాఠశాలలో స్మార్ట్ క్లాసులను విద్యాశాఖమంత్రి నీరా యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె అక్కడున్న అబ్దుల్ కలాం ఫొటోకు దండ వేసి, హారతి వెలిగించారు. దీంతో అక్కడున్నవారంతా షాకయ్యారు. మంత్రికి అంతమాత్రం తెలియదా అని విమర్శలు గుప్పించారు. స్కూల్ హెడ్, బీజేపీ ఎమ్మెల్యే మనీష్ జైశ్వాల్ , మరికొంతమంది పెద్దల సమక్షంలోనే ఈ తంతు జరిగింది.
ఈ వ్యవహారంలో విమర్శలు చెలరేగడంతో మంత్రి స్పందించారు. అబ్దుల్ కలాం గొప్ప సైంటిస్టు అనీ,. అలాంటి గొప్ప వ్యక్తికి ఫోటోకి దండ వేసి గౌరవిస్తే తప్పేంటని ప్రశ్నించారు. అందులో అంత అభ్యంతరంకరమైంది ఏముందంటూ తనను తాను సమర్ధించుకున్నారు మంత్రి నీరాయాదవ్. మరోవైపు పాఠశాలల్లో దేశనాయకులకు, రాజకీయ నాయకులకు దండ వేసి గౌరవించడం మామూలేనని మనీష్ , మంత్రిగారిని వెనకేసుకు రావడం కొసమెరుపు.