Kodela Sivarama Krishna
-
మంగళగిరి కోర్టుకు హజరైన కోడెల శివరాం
-
మంగళగిరి కోర్టుకు కోడెల శివరాం
సాక్షి, గుంటూరు : టీడీపీ దివంగత నేత, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం బుధవారం మంగళగిరి కోర్టు ఎదుట లొంగిపోయారు. అసెంబ్లీ ఫర్నీచర్‌ను దాచిపెట్టిన కేసులో హైకోర్టు ఆదేశాలతో ఆయన నేడు మంగళగిరి కోర్టు ముందు హాజరయ్యారు. దీనిపై శివరాం లాయర్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ.. ‘శివరాంకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో.. అందుకు సంబంధించిన షూరిటీలను ఆయన మంగళగిరి కోర్టుకు అందజేశారు. ప్రతి శుక్రవారం ఆయన తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు హాజరై సంతకం పెట్టాల్సి ఉంద’ని తెలిపారు. తన తండ్రి కోడెల శివప్రసాదరావు స్పీకర్‌గా వ్యవహరించిన కాలంలో కొనుగోలు చేసిన ఫర్నీచర్.. శివరాంకు చెందిన షోరూమ్‌లో లభించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి శివరాంపై సెక్షన్ 409, 411 ల కింద కేసు నమోదైంది. -
లొంగిపోయిన కోడెల శివరాం
సాక్షి, గుంటూరు : టీడీపీ దివంగత నేత, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం మంగళవారం కోర్టు ఎదుట లొంగిపోయారు. కోడెల పదవిలో ఉండగా కే ట్యాక్స్ పేరిట శివరాం కబ్జాలు, బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనపై వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఐదు కేసుల విషయమై తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోడెల శివరాం హైకోర్టును ఆశ్రయించారు. ఆయన అభ్యర్థనపై స్పందించిన హైకోర్టు.. శివరాంను కింది కోర్టులో లొంగిపోవాల్సింగా సూచించింది. ఈ క్రమంలో కోడెల శివరాం ఈరోజు నరసరావుపేట ఫస్ట్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోయారు. కాగా కే ట్యాక్స్ పేరిట భారీ ఎత్తున ప్రజలు కోడెల కుటుంబంపై ఫిర్యాదు చేయడం, సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత, పార్టీ అధిష్టానం సైతం తనను పట్టించుకోకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. -
‘కోడెలను కొడుకే హత్య చేశాడు’
సాక్షి, హైదరాబాద్: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అనుమానాస్పద మరణం వెనుక పెద్ద కుట్ర ఉందని, దీంతో చంద్రబాబుకు సంబంధం ఉందని గుంటూరు జిల్లాకు చెందిన బొర్రుగడ్డ అనిల్‌కుమార్ అనే వ్యక్తి ఆరోపించారు. కోడెల మృతిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ఆయన శుక్రవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. సీబీఐ, తెలంగాణ ప్రభుత్వం, బంజారాహిల్స్ సీఐని ప్రతివాదులుగా చేర్చారు. కోడెల మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని, కుట్ర కోణం దాగుందని పిటిషనర్ ఆరోపించారు. కోడెల శివప్రసాదరావు అభిమానిగా ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక పిల్ వేసినట్టు అనిల్‌కుమార్ మీడియాకు తెలిపారు. కోడెల ఆత్మహత్య చేసుకునేంత పిరికివారు కాదని అన్నారు. రాజకీయ నాయకులపై కేసులు సహజమని, దానికే భయపడిపోయి ఆయన ఆత్మహత్య చేసుకుంటారని తాము భావించడం లేదన్నారు. కోడెలది కచ్చితంగా రాజకీయ హత్యేనని, దీన్ని క్యాష్ చేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు. కోడెల మృతి వెనుక ఆయన కుమారుడు శివరామ్ హస్తం ఉందని వంద శాతం నమ్ముతున్నట్టు తెలిపారు. అనేక నేరారోపణలు ఎదుర్కొంటున్న చేసిన శివరామ్ కేసుల నుంచి తప్పించడం కోసం తండ్రిని హత్య చేయించివుంటాడన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. కోడెల మరణం వెనుకున్న మిస్టరీని ఛేదించేందుకు సీబీఐతో దర్యాప్తు చేయించాలని హైకోర్టును అభ్యర్థించినట్టు చెప్పారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపితే నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. (చదవండి: శివరామ్ విచారణకు రంగం సిద్ధం) -
ఒక మరణం.. అనేక అనుమానాలు
సాక్షి, అమరావతి/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితి ఎందుకొచ్చింది? ఆయన మరణాన్ని సైతం మభ్యపెట్టేందుకు సొంత మనుషులే ఎందుకు తాపత్రయపడుతున్నారు? ఆయన ఉరి వేసుకుని చనిపోతే గుండెపోటు అని.. ప్రమాదకర ఇంజక్షన్లు చేసుకున్నారంటూ మీడియాకు పరస్పర విరుద్ధమైన లీకులు ఎందుకిచ్చారు? కొనఊపిరితో ఉన్న ఆయన్ను సమీపంలోని ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లలేదు? పైగా దూరంగా ఉన్న బవసతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లినట్లు?.. నేర స్థలంలో ఆధారాలు ఎందుకు చెరిగిపోయాయి?.. కోడెల వాడుతున్న సెల్‌ఫోన్ ఏమైపోయింది?.. ఆత్మహత్యకు ముందు 24 నిమిషాలపాటు ఆయన ఎవరితో ఫోన్లో మాట్లాడారు?.. ఇవీ కోడెల ఆత్మహత్యపై ఇప్పుడు అందరి మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్నలు. కానీ, ఆయన ఆత్మహత్యను ఏ కోణంలో చూసినా.. కోడెల కుమారుడు, కుమార్తె చర్యలు, వాడుకుని కష్టకాలంలో వదిలేసిన సొంత పార్టీ వ్యవహారశైలి వైపే అందరి వేళ్లూ చూపిస్తున్నాయి. కోడెల మృతిచెందిన రోజున అసలేం జరిగింది అనే కోణంలో తెలంగాణ పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ముందుగా కుటుంబ సభ్యుల తీరుపైనే అనుమానం వ్యక్తమవుతున్నట్లు సమాచారం. గుంటూరు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లిలో గడిచిన ఐదేళ్లలో కొడుకు శివరామకృష్ణ, కుమార్తె విజయలక్ష్మి చేసిన వ్యవహారాలు తన పరువు తీశాయని ఆయన తీవ్ర ఆవేదనకు గురైనట్టు ప్రచారం జరుగుతోంది. పలు అంశాలపై కుమారుడు, కుమార్తెతో ఆయనకు తరచూ వాగ్వాదం జరిగేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో.. తీవ్ర మానసిక ఒత్తిడితో సతమతమవుతున్న తనను పార్టీకి చెందిన కీలక నేతలు ఎవరూ పట్టించుకోకపోగా, పలకరింపే కరువైనట్లు ఆయన తన ఆంతరంగికుల వద్ద వాపోయినట్లు సమాచారం. ఆత్మహత్యకు ముందు ఏం జరిగింది? కోడెల ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు ఏం జరిగిందనే దానిపై పోలీసులు ప్రధానంగా దృష్టిసారించారు. ఇప్పటికే అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసిన పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి అన్ని కోణాల్లోను దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం ఉ.9.30 గంటల వరకూ కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారం తీసుకున్న తర్వాత ఏం జరిగింది? కుటుంబ సభ్యులతో ఏదైనా వాగ్వాదం జరిగిందా? అనేది కీలకంగా మారింది. అలాగే, కొద్దిరోజుల క్రితం గుండెపోటు వచ్చిందని కోడెలను నరసరావుపేటలోని తన అల్లుడు ఆసుపత్రికి తరలించారు. నిజానికి ఆయన నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు చెప్పినట్లు ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు ఉరి వేసుకుని చనిపోతే మళ్లీ అదే గుండెపోటు కథను ఎందుకు నడిపించారు.. దీని వెనుక ఎవరి ప్రమేయం ఉందో అన్న దానిపై వారు దృష్టిపెట్టారు. క్లూస్ టీం కోణమేంటి? కోడెల ఆత్మహత్య అనంతరం ఆయనను తొలుత బసవతారకం ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాతే క్లూస్ టీం ఘటన స్థలాన్ని సందర్శించింది. కానీ, అప్పటికే నేరస్థలంలో కీలక ఆధారాలు లభించలేదని క్లూస్ బృందం చెబుతున్నట్లు తెలిసింది. ఆత్మహత్యకు ఉపయోగించిన తాడు (గుడ్డతో చేసింది) ఘటన స్థలంలో కాకుండా వేరేచోట సేకరించినట్లు సమాచారం. ఉరి వేసుకున్నట్లుగా చెబుతున్న ఫ్యాన్ భాగం వంగి ఉంది. అయితే.. నేలభాగం, ఫ్యాను ఎత్తుని పోల్చిన క్లూస్ బృందం ఈ విషయంలో అనుమానం వ్యక్తంచేస్తోంది. కోడెల మంచం మీద నుంచి ఫ్యానుకు తాడు బిగించుకున్నారా? అదే నిజమైతే ఫ్యాన్ ఇంకా ఎక్కువగా వంగి ఉండాలని అంటున్నారు. అలాకాకుండా ఏదైనా స్టూల్ లేదా కుర్చి వేసుకున్నారా? అని సందేహిస్తున్నారు. కానీ, దీనికి బలం చేకూర్చే ఆనవాళ్లేమీ అక్కడ కన్పించలేదని క్లూస్ అధికారులు అంటున్నారు. ఇక కోడెల గదిలో ఎలాంటి లేఖ కన్పించలేదు. ఏదేమైనా ఫోరెన్సిక్ లేబొరేటరీ పరీక్షల ఆధారంగానే కోడెల మృతిపై నెలకొన్న సందేహాలు నివృత్తి అయ్యే వీలుందని దర్యాప్తు వర్గాలు అంటున్నాయి. కోడెల మృతదేహాన్ని ఆయన కుటుంబీకులు మంగళవారం ఉదయం స్వస్థలానికి తరలించారు. అలాగే, హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ మంగళవారం ఈ కేసు దర్యాప్తు తీరుతెన్నుల్ని ఆరా తీశారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ పరిశీలించాలని దర్యాప్తు అధికారులను ఆదేశించారు. ఆధారాలేమయ్యాయి? కోడెలది ఆత్మహత్యేనని శవపరీక్షలో ప్రాథమికంగా నిర్థారించినా, భిన్న కోణాల్లో వస్తున్న అనుమానాలపైనే దర్యాప్తు బృందాలు ప్రధానంగా దృష్టి పెట్టాయి. ఫోరెన్సిక్ పరీక్షల అనంతరమే వాస్తవ పరిస్థితిపై పూర్తి అవగాహనకు రావడం సాధ్యమని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. క్లూస్ టీం వెళ్లే సమయానికే నేరస్థలం పూర్తిగా చెరిగిపోవడాన్ని గమనించిన అధికారులు కొన్ని కీలకమైన ఆధారాలు సేకరించలేకపోయారు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు, క్లూస్ టీం.. శవ కాఠిన్యత విషయంలోనూ వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది. దీన్నిబట్టి ఆయన మృతిపై కచ్చితమైన సమయాన్ని రికార్డు చేయడానికి మరికొన్ని ఆధారాలు అవసరమని అధికారులు అంటున్నారు. ఆ ద్రవాలు ఏమిటి? భౌతిక ఆధారాలను బట్టి పోస్టుమార్టం వైద్యుడు ఆత్మహత్య అనే నిర్థారణకు వస్తారు. కానీ, విస్రా (కాలేయం, పేగులు, గుండె, మూత్ర పిండాలు)ను పూర్తిగా పరిశీలించిన తర్వాతే కచ్చితమైన ఆధారాలు లభిస్తాయి. విస్రాను ఫోరెన్సిక్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) టాక్సికాలజీ (విష పదార్థాల పరీక్ష) విభాగం పరిశీలించాల్సి ఉంటుంది. పోస్టుమార్టం చేసి, విస్రాను సేకరించిన వైద్యులు అల్పహారంతో పాటు, కొన్ని ద్రవాలు ఉన్నట్లు గుర్తించారని సమాచారం. దీన్నిబట్టి కోడెల అంతకుముందు ఏదైనా ద్రవ పదార్థం తీసుకున్నారా? తీసుకుంటే అదేంటి? అదేమైనా విషపూరితమైనదా? ఉదయం నుంచి ఆయన కుటుంబ సభ్యుల మధ్యే ఉన్నందున దాన్నెలా తీసుకున్నారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కోడెల ఫోన్ ఎక్కడ? కోడెల ఆత్మహత్యకు దారితీసిన కీలక ఆధారాలు తెలుసుకోవడంలో పోలీసులకు అవరోధాలు ఎదురవుతున్నాయి. ప్రధానంగా సెల్‌ఫోన్ మిస్సింగ్ వ్యవహారం జఠిలంగా మారింది. చనిపోవడానికి ముందు ఎవరితో మాట్లాడారు? ఏం మాట్లాడారు? అన్నది తేలడానికి కోడెల సెల్‌ఫోన్ ఒక్కటే ఆధారం. కానీ, అదిప్పుడు కనిపించడంలేదు. కుటుంబ సభ్యుల వద్ద ఉండి ఉంటుందని.. అంత్యక్రియల కార్యక్రమం పూర్తయ్యాక స్వాధీనం చేసుకుంటామని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు.. కోడెల కాల్‌డేటాను దర్యాప్తు అధికారులు వెలికితీస్తున్నారు. చనిపోవడానికి ముందు ఆయన 24 నిమిషాలపాటు ఫోన్లో మాట్లాడినట్లు నిర్ధారణ అయ్యింది. అది ఎవరితో అనేది తెలియాల్సి ఉందన్నారు. వాట్సాప్ అకౌంట్ విశ్లేషణకూ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కోడెల చివరిసారిగా సోమవారం ఉ.6.51 గంటలకు వాట్సాప్‌ను చూసినట్లు.. అలాగే, ట్రూకాలర్‌ను ఆదివారం చూసినట్లు అధికారులు గుర్తించారు. ఆవేశంలోనే ఆత్మహత్య? సాధారణంగా ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడితే కారణాలను వివరిస్తూ సూసైడ్ నోట్ రాస్తారని.. కానీ, కోడెల ఆత్మహత్యకు పాల్పడిన గదిలో ఎటువంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు చెబుతున్నారు. అంటే అప్పటికప్పుడు మాట్లాడిన ఫోన్‌కాల్ కారణంగానో, కుటుంబ సభ్యుల వివాదంతోనో ఆవేశంగా ఆయన ఆత్మహత్య నిర్ణయం తీసుకుని ఉండొచ్చని ఆ అధికారి విశ్లేషించారు. -
గౌతమ్ షోరూమ్ వద్ద హైడ్రామా, సీన్లోకి కోడెల లాయర్!
సాక్షి, గుంటూరు : కోడెల శివరాం బైక్ షోరూమ్ వద్ద శుక్రవారం హైడ్రామా నెలకొంది. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తన లాయర్‌తో కలిసి కొత్త డ్రామాలకు తెరతీశారు. బైక్ షోరూమ్ నుంచి అసెంబ్లీ అధికారులు ఫర్నీచర్‌ను రికవరీ చేసుకుంటున్న క్రమంలో వారిని అడ్డుకునే యత్నం జరిగింది. ఏ హోదాతో తనిఖీలు చేస్తారంటూ కోడెల లాయర్ అసెంబ్లీ అధికారులను ప్రశ్నించారు. షోరూమ్ ప్రైవేటు ప్రాపర్టీ అంటూ వితండవాదం చేశారు. అసెంబ్లీ సెక్రటరీ ఆదేశాలున్నాయని అసిస్టెంట్ సెక్రటరీ రాజ్‌స్పష్టం చేయడంతో రికవరీ కొనసాగింది. దాదాపు మూడు గంటలపాటు సాగిన ఈ సోదాల్లో అసెంబ్లీకి చెందిన పలు విలువైన వస్తువులను అధికారులు గుర్తించారు. అదంతా యూరప్ నుంచి దిగుమతి చేసుకున్న అత్యంత విలువైన విదేశీ ఫర్నీచర్‌గా తెలిసింది. వాటి విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందని అంచనా. 32 కుర్చీలు, 4 సోఫాలు, 3 టేబుళ్లు, ఒక టీపాయ్, ఒక దర్బార్ ఛైర్, డైనింగ్ టేబుల్, గుర్తించి.. తహసీల్దార్ మోహనరావు ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించారు. డైనింగ్ టేబుల్, 22 కుర్చీలు విలువే రూ.65 లక్షలు ఉంటుందని సమాచారం. ఇక తాళాలు లేవనే కారణంతో రెండో ఫ్లోర్, నాలుగో ఫ్లోర్లలో అధికారులు తనిఖీలు నిర్వహించలేదు. వారెంట్ లేకుండా తనిఖీలు చేస్తే కోర్టుకు వెళ్తామంటూ బెదిరింపులకు దిగారు. అసెంబ్లీ ఫర్నిచర్‌ను దొంగచాటుగా తన ఇంటికి తరలించుకున్న కోడెల శివప్రసాదరావు తన తప్పును అంగీకరించిన సంగతి తెలిసిందే. భద్రత లేదనే అసెంబ్లీ వస్తువుల్ని తన ఇంటికి తెచ్చుకున్నానని వివరణనిచ్చారు. వాటన్నింటినీ తిరిగి ఇచ్చేస్తాననీ.. లేదంటే విలువెంతో చెబితే చెల్లిస్తానని చెప్పుకొచ్చారు. ఇక కోడెల క్యాంప్ ఆఫీస్‌లో తనిఖీలు చేయాల్సి ఉంది. ఫర్నీచర్ రికవరీ నిమిత్తం తన నివాసం, వ్యాపార స్థలాల్లో అసెంబ్లీ అధికారులు ఎప్పుడైనా తనిఖీలు చేసుకోవచ్చని నిన్న వెల్లడించిన కొడెల శుక్రవారం మాటమార్చడం గమనార్హం. -
కోడెల ఇంటి ముందు కేబుల్ ఆపరేటర్ ధర్నా
సాక్షి, గుంటూరు : టీడీపీ నేత, శాసన సభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం అక్రమాలకు బలైన ఓ కేబుల్ ఆపరేటర్ వారి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. కబ్జాలు, అవినీతి, అక్రమాలతో తమ కులానికే చెడ్డపేరు తెచ్చారంటూ కోటేశ్వరరావు అనే వ్యక్తి కోడెల కుటుంబ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు.. ఎన్సీవీ పేరుతో నరసరావుపేటలో కోటేశ్వరరావు కేబుల్ నిర్వహిస్తుండేవాడు. కోడెల తనయుడు శివరామకృష్ణ కేబుల్ వైర్లు కత్తిరించి ఎన్‌సీవీని కబ్జా చేశాడు. దీంతో ఎన్సీవీ కేబుల్ వైర్లు కోడెల ఇంటి ముందు పడేసి సోమవారం ఆందోళనకు దిగారు. ఊరు వదిలి పారిపోయే పరిస్థితికి వచ్చారంటూ శివరామకృష్ణపై విమర్శలు చేశారు. కమ్మ హాస్టల్ నిర్మాణంలోనూ భారీగా అక్రమాలు చేశారని ధ్వజమెత్తారు. ఇదిలాఉండగా.. టీఆర్ లేకుండా సుమారు 800 బైక్‌లు విక్రయించిన వ్యవహారంలో కోడెల శివరామకృష్ణపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. (చదవండి : కోడెల కుమారుడిపై కేసు) -
కోడెల కుమారుడిపై కేసు
సాక్షి, గుంటూరు: బైక్‌ల విక్రయాల్లో భారీ కుంభకోణానికి పాల్పడిన శాసన సభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామకృష్ణపై పోలీసు కేసు నమోదు అయింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.80 లక్షలు స్వాహా చేసినట్లు గుర్తించిన రవాణా శాఖ అధికారులు ఫిర్యాదు చేయడంతో గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు చుట్టుగుంట సెంటర్లో కోడెల శివరామ్‌కు గౌతమ్ హీరో బైక్ షోరూమ్ ఉంది. దీనికి అనుబంధంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా అనధికారికంగా 50కుపైగా సబ్ డీలర్లు ఉన్నారు. గత కొన్ని రోజులుగా శివరామ్ షోరూమ్‌లో టీఆర్ (తాత్కాలిక రిజిస్ట్రేషన్) లేకుండా బైక్‌లు డెలివరీ చేస్తున్నారు. దీనిపై గత ఏడాదే రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదులు అందాయి. అయితే కోడెల తనయుడి షోరూమ్ కావడంతో గత ప్రభుత్వ హయాంలోను అధికారులు గౌతమ్ షోరూమ్ జోలికి వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల మళ్లీ ఫిర్యాదులు రావడంతో రవాణా శాఖ కమిషనర్ విచారణ చేయించారు. గత ఏడాది కాలంలో టీఆర్ లేకుండా 1,025 బైక్‌లు విక్రయించినట్లు విచారణలో గుర్తించారు. టీఆర్, లైఫ్ ట్యాక్స్, శాశ్వత రిజిస్ట్రేషన్ తదితర ఫీజుల కింద ఒక్కో బైక్‌కు సగటున రూ.8వేల చొప్పున వినియోగదారుల నుంచి వసూలు చేసిన శివరామ్ ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించకుండా నొక్కేశారు. కేసు నమోదు.. విచారణ అనంతరం గుంటూరు జిల్లా ఉపరవాణా కమిషనర్ మీరాప్రసాద్ గౌతమ్ హీరో షోరూమ్ యజమాని శివరామ్‌పై నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 1,025 బైక్‌లు టీఆర్ లేకుండా విక్రయించి 1989 కేంద్ర మోటర్ వాహన చట్టం నిబంధన 42ను కోడెల శివరామ్ అతిక్రమించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కోడెల శివరామ్‌పై ఐపీసీ 406, 409, 420, 468, 471 సెక్షన్ల కింద శనివారం కేసు నమోదు చేశారు. -
ఎల్లో ట్యాక్స్ కట్టలేం
- స్పష్టంచేసిన ఓబులవారిపల్లి - కృష్ణపట్నం రైల్వే కాంట్రాక్టు కంపెనీ - రూ. ఐదు కోట్లు ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ డిమాండ్ సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణం పనుల్లో తనకు 25 శాతం కమిషన్ ఇవ్వాలని స్పీకర్ శివప్రసాద్ కుమారుడు కోడెల శివరామకృష్ణ రైల్వే కాంట్రాక్టర్లు మీద దౌర్జన్యం చేసిన సంఘటన మరువక ముందే నెల్లూరు జిల్లాలో ఇలాంటి సంఘటన మరొకటి బయట పడింది. ఓబులవారిపల్లి- కృష్ణపట్నం రైల్వే లైన్ నిర్మాణం పనులు చేస్తున్న గుజరాత్‌కు చెందిన మాంటెకార్లో కంపెనీ ప్రతినిధులను నెల్లూరు జిల్లా వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్మే కరుగొండ్ల రామకృష్ణ రూ.5 కోట్లు ఇవ్వాలని బెదిరించారు. ఆ కంపెనీ సెక్రటరీ కల్పేష్ దేశాయ్ ఇతర అధికారులు నెల్లూరులో సోమవారం విలేకరుల వద్ద ఎమ్మెల్యే బెదిరింపులు, దౌర్జన్యాలను బట్టబయలు చేశారు. తమ సైట్ మేనేజర్ రామును ఎమ్మెల్యే ఫోన్లో బెదిరించిన ఆడియో సీడీలను మీడియాకు అందించారు. రూ.183 కోట్ల పనిలో 5 శాతం కానీ, లేదా రూ.5 కోట్లు కానీ పర్సెంటేజీ కింద ఇవ్వాలని ఎమ్మెల్యే రామకృష్ణ తమ మీద ఒత్తిడి చేస్తున్నారని కల్పేష్ దేశాయ్ వెల్లడించారు. తాము తక్కువ మొత్తంతో ఈ కాంట్రాక్టు దక్కించుకున్నందువల్ల అంత మొత్తం ఇవ్వడం సాధ్యం కాదని చెప్పినా వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తమ సంస్థ అధికారులను బూతులు తిడుతున్నారనీ, పనులు చేస్తున్న సిబ్బంది మీద తన అనుచరులతో దాడులు చేయించడంతో వారు బెదిరిపోయి పనులకు రావడం లేదని తెలిపారు. ఎమ్మెల్యే నుంచి తమకు రక్షణ కల్పించి పనులు జరిపించకపోతే రైల్వే శాఖకు చెప్పి పనులు పూర్తిగా నిలిపివేయడం తప్ప మరో మార్గం లేదని ఆయన స్పష్టంచేశారు. ఈ విషయం గురించి రైల్వే మంత్రి సురేష్‌ప్రభు, రైల్వే ఉన్నతాధికారులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశామన్నారు. కంపెనీ మేనేజర్ రాము, ఎమ్మెల్యే రామకృష్ణ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ మేనేజర్: నమస్తే సర్ నేను రాము. నేను మా కంపెనీ జీఎంకు ఫోన్ చేసి మీ నాలుగు డిమాండ్లు చెప్పినా ను. శుక్రవారం సాయంత్రం లేదా శనివారానికి వస్తామని చెప్పినారు. అంతవర కు పనిచేయించడానికి అడ్డు చెప్పొద్దు సార్. ఎమ్మెల్యే: ఇలాంటివన్నీ వద్దు.. మీకు ఎన్నిసార్లు చెప్పినాను. మేనేజర్: కాదు సార్ ఎమ్మెల్యే రామకృష్ణ మాకు అన్నలాంటోడు, మేం మాట్లాడుకుంటామని అంటున్నారు. ఎమ్మెల్యే: అవన్నీ ఏం కుదరదు.. వాళ్లకు... పగలగొడతా (బూతులు తిట్టారు). మేనేజర్: సార్ అలా అనద్దండి. శుక్రవారం నాటికి నేను వాళ్లను పిలిపిస్తా. అంతవరకు పనులు ఆగకుండా చేయిస్తే నేను కూడా చెప్పుకునే దానికి ఉంటుంది. ఎమ్మెల్యే జెంటిల్మెన్ నా మాటకు విలువ ఇచ్చారని చెప్పుకోవచ్చు. శుక్రవారం నాటికి మా వాళ్లు వచ్చి సెటిల్ చేసుకోకపోతే శనివారం నేనే పనులు నిలిపివేయిస్తా. ఎమ్మెల్యే: సరేలే మా వాళ్లతో చెబుతా. -
కోడెల, సీబీఐ, గుంటూరు ఎస్పీలకు హైకోర్టు నోటీసులు
కోడెల శివరామకృష్ణ, స్థానిక పోలీసులకు కూడా.. సాక్షి, హైదరాబాద్: గుంటూరు జిల్లా, నరసరావుపేటలో వైఎస్సార్సీపీ యువనేత నల్లపాటి రామచంద్రప్రసాద్ నిర్వహిస్తున్న నల్లపాటి కేబుల్ విజన్(ఎన్సీవీ) కార్యాలయంపై టీడీపీ వర్గీయులు దాడి చేసి ధ్వంసం చేసిన ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలన్న పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది.దీనిపై వివరణ ఇవ్వాలంటూ సత్తెనపల్లి ఎమ్మెల్యే, స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు, ఏకే కమ్యూనికేషన్స్ ఎండీ కోడెల శివరామకృష్ణ, గుంటూరు ఎస్పీ నారాయణనాయక్, పోలీసులు నాగేశ్వరరావు, వీరయ్య చౌదరి, సాంబశివరావు, బి.ప్రభాకర్, టి.వి.శ్రీనివాసరావు, సురేంద్రబాబు, లోకనాథం తదితరులకు నోటీసులిచ్చింది. అలాగే సీబీఐ డెరైక్టర్ జనరల్‌తో పాటు బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, ఐడియా, యునినార్, వొడాఫోన్ సంస్థల ప్రతినిధులకూ నోటీసులిచ్చింది. కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు కలసి పోలీసులకు ఫోన్లు చేసి మొత్తం కథ నడిపారంటూ పిటిషనర్ ఆరోపిస్తున్న నేపథ్యంలో గత నెల 10, 11 తేదీల్లో స్థానిక పోలీసుల కాల్ డేటా మొత్తాన్ని భద్రపరచాలని బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, ఐడియా తదితర సర్వీస్ ప్రొవైడర్లను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు సోమవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.