‘నిఠారి’ కోలికి దక్కని క్షమాభిక్ష
ఆరుగురి క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: నిఠారి వరుస అత్యాచారాలు, హత్యల కేసుల్లో దోషి సురేంద్రకోలి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించారు. కోలి సహా వేర్వేరు కేసుల్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న రేణుకాబాయ్, సీమ, రాజేంద్రప్రతాద్రావ్ వాన్సిక్(మహారాష్ట్ర), జగదీష్ (మధ్యప్రదేశ్), హోలీరామ్ బర్దోలాయి (అస్సాం) క్షమాభిక్ష పిటిషన్లను కేంద్ర హోంశాఖ సిఫారసుల మేరకు రాష్ట్రపతి తిరస్కరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఉత్తరప్రదేశ్, నోయిడా సమీపంలోని నిఠారిలో 2005, 2006 సంవత్సరాలలో చిన్నారులపై సురేంద్రకోలి(42)అత్యాచారం చేసి ఆ తర్వాత వారిని క్రూరంగా హత్య చేసినట్లు తేలడంతో అతడికి దిగువ కోర్టు మరణశిక్ష ఖరారు చేసింది. దాన్ని అలహాబాద్ హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా సమర్థించాయి. అప్పట్లో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇతడిపై 16 కేసులు నమోదు కాగా నాలుగు కేసుల్లో మరణశిక్ష పడింది.
మిగతా కేసుల్లో విచారణ ఇంకా పూర్తి కాలేదు. అలాగే, మహారాష్ట్రకు చెందిన అక్కా చెల్లెళ్లు రేణుకాభాయ్, సీమ చిన్నారులను అపహరించి వారితో దొంగతనాలు చేయిస్తూ, ఊహ తెలిసే వయసు వచ్చిన తర్వాత వారిని హత్య చేస్తున్నట్లు తేలడంతో సుప్రీంకోర్టు 2011లో మరణశిక్ష విధించింది. 1990 నుంచి 1996 మధ్య వీరు 13 మంది చిన్నారులను అపహరించి వారిలో 9 మందిని హత్య చేసినట్లు అభియోగాలు నమోదు అయ్యాయి. అయితే, ఐదుగురిని హత్య చేసినట్లు మాత్రమే ప్రాసిక్యూషన్ నిరూపించగలిగింది. క్షమాభిక్ష తిరస్కరణకు గురైన మిగిలిన వారు కూడా వివిధ కేసుల్లో మరణశిక్ష ఎదుర్కొంటున్నవారే. మరణశిక్ష అమలు చేయడంలో కారణం లేకుండా మితిమీరిన జాప్యం జరిగితే వారు క్షమాభిక్షకు అర్హులంటూ... 15 మంది దోషులకు మరణశిక్ష నుంచి విముక్తి కల్పిస్తూ సుప్రీంకోర్టు ఈ ఏడాది జనవరిలో సంచనల తీర్పు చెప్పిన విషయం తెలిసిందే.