చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారు..
వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల
విజయనగరం టౌన్: అక్రమాలతో గెలవాలనుకుంటున్న ‘చంద్రబాబు అండ్ కో’కు నంద్యాల ప్రజలు బుద్ధి చెబుతారని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. శనివారం తన స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో వారం రోజుల పాటు అన్ని సామాజికవర్గాలతో కలిసి శిల్పా మోహన్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించామన్నారు. సోమవారం నుంచి తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు. శిల్పా మోహన్‌రెడ్డి నిబద్దత, చిత్తశుద్ధి గల నాయకుడన్నారు.
ఆయన గెలుపు సామాజిక అవసరం అన్న సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తామని చెప్పారు. అదేవిధంగా జిల్లాలో అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేస్తే నాయకులు, అధికారులను రోడ్డుపైనే నిలదీస్తామన్నారు. ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెస్తే అధికారులు బహిరంగంగా తెలియజేయాలని, అనవసర నిందలు పడవద్దని సూచించారు. బాడంగి మండలం పినపెంకికి చెందిన 16 మంది అర్హులకు గృహ నిర్మాణ బిల్లులు నిలపివేశారని, ఇదే విషయమై తాము జిల్లా పరిషత్ సమావేశంలో ప్రస్తావించామని చెప్పారు.
అర్హులకు నిధులు మంజూరు చేయకపోతే జిల్లా గృహ నిర్మాణశాఖ కార్యాలయం వద్ద త్వరలో ధర్నా నిర్వహిస్తామన్నారు. ఉద్యోగుల పనితీరు బట్టి 50 ఏళ్లకే ఇంటికి పంపించే ప్రభుత్వ ఆలోచన విచారకరమని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులు నేటికీ ఇబ్బందులు పడుతున్నా, కనీసం సౌకర్యాలు కల్పించకపోగా ఉద్యోగుల కుదింపునకు ఆలోచన చేయడం తగదన్నారు.