శాంతి భద్రతలా... ఎక్కడ?
సాక్షి, చెన్నై: డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ మంగళవారం తన నియోజకవర్గం కొళత్తూరులో పర్యటించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, శాంతి భద్రతల పరిరక్షణ ఎక్కడ.. ఏమేరకు ఉన్నదో ప్రజలందరూ గుర్తించాల్సిన విషయంగా వ్యాఖ్యానించారు. కొళత్తూరు నుంచి రెండో సారిగా అసెంబ్లీలోడీఎంకే దళపతి, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ అడుగు పెట్టిన విషయం తెలిసిందే. తన నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం, ప్రజల్ని కలిసి వారి మొర ఆలకించేందుకు మంగళవారం స్టాలిన్ రంగంలోకి దిగారు. నియోజకవర్గంలో వీధి వీధిన తిరిగారు.
అక్కడక్కడ ఎదురైన సమస్యల్ని గుర్తించి, వాటి పరిష్కారానికి తగ్గ చర్యలు అక్కడక్కడే తీసుకునే విధంగా అధికారుల్ని ఆదేశించారు. తిరువళ్లువర్ నగర్, కన్నగినగర్, తదితర ప్రాంతాల్లో ప్రజలు తమ సమస్యల్ని, తమకు ఎదురు అవుతున్న కష్టాల్ని స్టాలిన్ దృష్టికి తీసుకొచ్చారు. పారిశుధ్య లోపం, కాలువల మరమ్మతులు తదితర అంశాలను పరిశీలించి తగిన చర్యలకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తన నియోజకవర్గంలో చేపట్టనున్న పనులను వివరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో హత్యల పర్వం కొనసాగుతుంటే నోరు మెదపని సీఎం జె జయలలిత, అన్నాడీఎంకేకు చెందిన కౌన్సిలర్ హత్యతో సంతాపం తెలియజేయడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. తన దాకా సమస్య వస్తే గానీ స్పందించరా? అని ప్రశ్నించారు. శాంతి భద్రతల పరిరక్షణ ఎక్కడ ఉందో, ఏమేరకు ఉన్నదో ప్రజలు గుర్తించాలని వ్యాఖ్యానించారు. నియోజకవర్గ నిధుల కేటాయింపుల విషయంలో సంబంధిత శాఖ మంత్రి తగిన సమాధానం ఇంత వరకు ఇవ్వలేదని, ఈ విషయంలో కోర్టుకు వెళ్లడానికి తాను సిద్ధం అని స్పష్టం చేశారు.