kolchram
-
కుంభకోణం నిజమే
కొల్చారం, న్యూస్‌లైన్: రంగంపేట ఎస్బీహెచ్లో కుంభకోణం జరిగిన మాట వాస్తవమేనని తేలింది. ఈ విషయాన్ని ఎస్బీహెచ్ సంస్థ ఇన్విస్టిగేషన్ ఏజీఎం రంగరాజన్ ధ్రువీకరించారు. మంగళవారం సాక్షి దినపత్రికలో వచ్చిన ‘రంగంపేట ఎస్బీహెచ్లో కుంభకోణం’ అనే కథనానికి ఆ సంస్థ యంత్రాంగం స్పందించింది. ఈ మేరకు ఏజీఎం రంగరాజన్ బృందం రంగంపేట బ్యాంకుకు చేరుకుని రికార్డులు పరిశీలించారు. అవినీతికి పాల్పడిన బ్యాంకు మేనేజర్ ఏఎక్స్ ఎడ్విన్ గత మంగళవారం నుంచి బ్యాంకుకు రాకపోవడంతోపాటు అతనికి సంబంధించిన సెల్‌ఫోన్ సైతం స్విచ్చాఫ్‌లో ఉంది. దీంతో అనుమానించిన అధికారులు అయన నివాసానికి వెళ్లి పరిశీలించగా అందుబాటులో లేరు. కాగా ఆడిట్ అధికారులు ఖాతాలు పరిశీలించగా బినామీ అకౌంట్లతో డబ్బులు స్వాహా అయినట్లు గుర్తించారు. 31 ఖాతాల్లో సుమారు రూ. 96.13 లక్షల మేర స్వాహా అయినట్టు ధ్రువీకరించారు. మేనేజర్ ఎడ్విన్ బినామీ అకౌంట్లు సృష్టించి మరో ప్రైవేట్ బ్యాంకులో ఉన్న అతని అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా రైతుల కిసాన్ క్రెడిట్ కార్డులతో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సంస్థయే పూర్తిగా బాధ్యత వహిస్తుందన్నారు. గతంలో బ్రాంచి మేనేజర్‌గా పనిచేసిన నికోలస్ హైదరాబాద్‌కు బదిలీ కావడంతో తర్వాత వచ్చిన ఎడ్విన్ ఈ కుంభకోణానికి సూత్రధారి అని అధికారులు తేల్చారు. బ్యాంకులో అవినీతి జరగడం, మేనేజర్ ఎడ్విన్ కనిపించకుండా పోవడంపై సంస్థకు చెందిన అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రమేష్‌బాబు మంగళవారం కొల్చారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెద్ద ఎత్తున కుంభకోణం జరగడంతో దానికి మేనేజర్‌కు సంబంధం ఉండటంతోనే ఆయన కనిపించకుండా పోయారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొల్చారం ఎస్ఐ ప్రభాకర్‌ను వివరణ కోరగా రంగంపేట ఎస్బీహెచ్ బ్యాంకులో కుంభకోణం జరిగిన విషయమై తమకు ఫిర్యాదు వచ్చినట్లు తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు. ఉలిక్కిపడ్డ రైతాంగం రంగంపేట ఎస్బీహెచ్ బ్యాంకులో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగినట్లు దినపత్రికలో చూసిన పలు గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పెద్ద ఎత్తున ఖాతాదారులు బ్యాంకుకు చేరుకుని తమ తమ ఖాతాలను పరిశీలించుకున్నారు. -
కట్నం వేధింపులతోవివాహిత ఆత్మహత్య
కొల్చారం, న్యూస్‌లైన్ : కులాల గోడలను కూలగొట్టి.. ప్రేమ బంధంతో పెద్దలను ఒప్పించి ఏకమైన ఓ జంట. అయితే పెళ్లి అయి ఏడాది కాకనే సదరు యువతిని వరకట్నం కాటేసింది. కట్నం కోసం భర్త, అత్తమామల వేధింపులు భరించలేని ఆమె చెరువులో పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండలం అప్పాజిపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. అప్పాజిపల్లి గ్రామానికి చెందిన సాలె తిరుపతి - నాగమణిలకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. పెద్ద కుమార్తె అలివేణి ఇదే గ్రామానికి చెందిన చింతకింది కృష్ణను ప్రేమించి 2012 డిసెంబర్లో పెద్దల సమక్షంలో కులాంతర వివాహం చేసుకుంది. కొన్ని రోజులు వీరి సంసారం సాఫీగా సాగింది. అయితే కొంత కాలంగా అలివేణిని వరకట్నం తేవాలంటూ అత్తమామలు చిందకింది శాఖయ్య, మంగమ్మ, భర్త కృష్ణ వేధింపులకు గురిచేసేవారు. అక్టోబర్‌లో కూడా ఇదే విషయమై గ్రామ పెద్దల వద్ద పంచాయితీ కూడా నిర్వహించారు. కాగా శుక్రవారం సైతం వేధింపులకు గురి చేయగా అలివేణి (20) అత్తవారి ఇంటి నుంచి సాయంత్రం ఎటో వెళ్లిపోయింది. కాగా అలివేణి కోసం ఆరా తీయగా గ్రామ శివారులోని కిన్నెర్ల కుంట వైపు వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో చెరువులో రాత్రి వరకు గాలించడంతో అలివేణి మృతదేహం బయటపడింది. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ ప్రభాకర్ అక్కడికి చేరుకుని పంచనామా నిర్వహించారు. ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రభాకర్ వివరించారు.