'వెండితెరపై పాలమూరు ప్రాశస్త్యం'
జడ్చర్ల: పాలమూరు జిల్లా చరిత్ర, ప్రాశస్త్యాన్ని వెండితెరకు పరిచయం చేస్తామని ప్రముఖ సినీనటుడు తనికెళ్ల భరణి అన్నారు. మంగళవారం ఆయన మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ రాజావారి కోటను సందర్శించేందుకు వెళ్తూ మార్గమధ్యంలో జడ్చర్లలో కొద్దిసేపు ఆగారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాను తీయబోయే భక్త కన్నప్ప సినిమాలో జిల్లాలోని ప్రముఖ చారిత్రక కట్టడాలు, దేవాలయాలకు సంబంధించిన పురాతన చరిత్ర, సంస్కృతిని తెలుగుతెరకు పరి చయం చేస్తానన్నారు. గతంలో అలంపూర్, గద్వాల, మన్యంకొండను దర్శించుకున్నానని, ఇప్పటివరకు సినిమాలో రాని వాటిని తమ సినిమాలో చూపించేందుకు కృషి చేస్తామని చెప్పారు. తాను కందూరు దేవాలయాన్ని సం దర్శించానని అక్కడి కోనేరులో కదంబ వృక్షా లు ఉన్నాయని తెలిపారు.
దక్షిణ భారతదేశం లో ఉన్న ఈ వృక్షాలు ఇక్కడ ఉండటం విశేషమన్నారు. గుంటూరు జిల్లా న రసరావుపేట త్రిపురాంతకం వద్ద ఏడు కదంబ వృక్షాలు ఉండగా కందూరు దేవాలయం వద్ద 26 వృక్షాలు ఉన్నాయని చెప్పారు. ఇవి హిమాలయాల్లో ఎక్కువగా ఉంటాయని, వీటి ప్రాముఖ్యతను మనం గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. కందూరు కోనేరును శుద్ధిచేసేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. అభిమానుల కోరిక మేరకు ఆయన ‘శభాష్ రా శంకరా!’ అనే భక్తి గేయాన్ని ఆలపించారు.