తంతు ముగిసింది!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అభిప్రాయ సేకరణకు తెరపడింది. అభ్యర్థుల ఖరారుపై మూడు రోజులుగా కాంగ్రెస్ హైకమాండ్ దూత నిర్వహించిన కసరత్తు మంగళవారం ముగిసింది. ఆశావహుల బలప్రదర్శన.. అనుచరుల హంగామా నడుమ ఏఐసీసీ పరిశీలకుడు కోలివాడ్ అభిప్రాయ సేకరణను పూర్తి చేశారు. చివరి రోజు చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గం సహా పరిగి అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న నేతలు.. దూత ముందు బారులు తీరారు.
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గాంధీభవన్‌లో ప్రత్యేకంగా పరిశీలకుడితో భేటీ కాగా, మరో మాజీ మంత్రి కమతం రాంరెడ్డి పరిగి స్థానానికి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరారు. పార్లమెంటు సీటును సిట్టింగ్ ఎంపీ జైపాల్‌రెడ్డికే ఇవ్వాలని సూచించారు. టికెట్ తనకు ఇవ్వని పక్షంలో కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి పేరును పరిగణనలోకి తీసుకోవాలని విన్నవించారు.
2009లో చివరి నిమిషంలో టికెట్ లభించకపోవడంతో రెబల్‌గా బరిలో దిగి స్వల్ప ఓట్లతో ఓడిపోయిన టి.రామ్మోహన్‌రెడ్డి కూడా పరిశీలకుడిని కలిసి తన అంతరంగాన్ని వెలిబుచ్చారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనకు మహేశ్వరం లేదా రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నట్లు పరిశీలకుడి దృష్టికి తె చ్చారు. తనయుడు కార్తీక్‌కు చేవెళ్ల పార్లమెంటరీ సీటును కేటాయించాలని నివేదించారు.
కొసమెరుపు..
ఆశావహులు కొందరు తమ సీటుకు సీనియర్లు ఎసరు పెట్టకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎంపీ సీటు విషయానికి వచ్చే సరికి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి పేరును సిఫార్సు చేస్తూ పరిశీలకుడికి దరఖాస్తులు సమర్పించారు.
జాతీయ విపత్తు నిర్వహణ వైస్ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి కుమారుడు, పీసీసీ కార్యద ర్శి ఆదిత్య పరిశీలకుడితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఒకరిద్దరు సీనియర్ నేతలతో హోటల్లో పరిశీలకుడిని కలుసుకున్న ఆయన.. చేవెళ్ల లోక్‌సభ సీటుకు తన ను ఖరారు చేయాలని విన్నవించారు.
పరిగి అసెంబ్లీ సెగ్మెంట్‌కు టికెట్ ఆశిస్తున్న రామ్మోహన్‌రెడ్డి అనుచరులు మాజీ మంత్రి కమతం రాంరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిశీలకుడిని కలిసేందుకు డీసీసీ కార్యాలయానికి వెళ్తున్న రాంరెడ్డిని చూసిన వైరివర్గం.. కమతం డౌన్ డౌన్ అంటూ నినదించింది.
ఈ నియోజకవర్గం నుంచి తమ పేర్లను పరిశీలించాలని పీసీసీ కార్యదర్శి సుభాష్‌రెడ్డి, సీనియర్ నాయకులు కంకల్ వెంకటేశ్, మాజీ ఎంపీపీ భగవన్‌దాస్ ఏఐసీసీ వేగుకు విజ్ఞాపనలు సమర్పించారు.
సబిత తనయుడు కార్తీక్‌రెడ్డి భారీగా మద్దతుదారులతో తరలివచ్చారు. చేవెళ్ల పార్లమెంటు స్థానానికి తన పేరును పరిశీలించాలని కోరారు. ఇటీవల తాను చేపట్టిన పాదయాత్ర వివరాలను పరిశీలకుడి దృష్టికి తెచ్చారు.