హ్యాట్రిక్ వీరులు!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు పది మంది ఎమ్మెల్యేలుగా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసుకున్నారు. వారిలో నలుగురు డబుల్ హ్యాట్రిక్ సాధించా రు. పీవీజీ రాజు, గంట్లాన సూర్యనారాయణ, కె.వి.ఆర్.ఎస్. పద్మనాభరాజు తొలిసారి హ్యాట్రిక్ సాధించిన నాయకులుగా చరిత్రలో నిలిచిపోయారు.పీవీజీ రాజు విషయానికొస్తే 1952లో ఆయన సోషలిస్టు పార్టీ తరఫున విజయనగరంలో ఎన్నికయ్యా రు. ఆ తర్వాత 1953లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఏకగీవ్రంగా విజయం సాధించారు. 1955లో ప్రజా సోషలిస్టు పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు.
ఆయనకు సమకాలీకులుగా గంట్లాన సూర్యనారాయణ 1952లో విజయనగరం నుంచి, 1953లో పీఎస్పీ తరఫున ఉప ఎన్నికల్లో, 1955లో గజపతినగరం నుంచి పీఎస్పీ తరఫున ఎన్నికయ్యారు. అదేవిధంగా కె. వి.ఆర్.ఎస్. పద్మనాభరాజు 1952లో సోషలిస్టు పార్టీ తరఫున అలమండ నుంచి, 1953లో జరిగిన ఉప ఎన్నికల్లో అదే నియోజకవర్గంలో ఏకగ్రీవంగా, 1955లో రేవిడి నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఇక, వారి తరువాత హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసుకున్న వారిలో వైరిచర్ల చూడామణి దేవ్, పెనుమత్స సాంబ శివరాజు, కోళ్ల అప్పలనాయుడు, పతివాడ నారాయణస్వామినాయుడు, పూసపాటి అశోక్ గజపతిరాజు, శత్రుచర్ల విజయరామరాజు, లగుడు బారికి దుక్కు, తెంటు జయప్రకాశ్ ఉన్నారు.
పెనుమత్స సాంబశిరాజు వరుసగా 1967, 1972 (గజపతి నగరం), 1978, 1983, 1985, 1989 (సతివాడ)లలో విజయం సాధించారు. కోళ్ల అప్పలనాయుడు వరుసగా 1983,1985, 1989, 1994 ,1999లో ఉత్తరాపల్లి నుంచి గెలుపొందారు. పూసపాటి అశోక్ గజపతిరాజు వరుసగా 1978,1983, 1985, 1989,1994,1999లలో విజయనగరం నుంచి విజయం సాధిం చారు. పతివాడ నారాయణస్వామినాయుడు వరుసగా 1983, 1985,1989, 1994, 1999, 2004లలో భోగాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అలాగే, గంట్లాన సూర్యనారాయణ 1952, 1953లో విజయనగరం నుంచి, 1955లో గజపతినగ రం, 1962లో రామతీర్థం, 1967,1972లో పాయకరావుపేట నుంచి వరుసగా ఎన్నికయ్యూరు.
డబుల్ హ్యాట్రిక్ వీరులు..
డబుల్ హ్యాట్రిక్ సాధించిన వారిలో సాంబశివరాజు, అశోక్ గజపతిరాజు, పతివాడ నారాయణస్వామినాయుడు, గంట్లాన సూర్యనారాయణ రికార్డుకెక్కారు. శత్రుచర్ల విజయరామరాజు 1978, 1983,1985లలో వరుసగా నాగూరు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఎస్. కోట నుంచి లగుడుబారికి దుక్కు వరుస గా 1983,1985,1989,1994లో విజయం సాధించారు. తెంటు జయప్రకాశ్ తెర్లాం నుంచి 1983,1985,1989,1994లో గెలుపొందారు. వైరిచర్ల చూడామణి దేవ్ వరుసగా 1953, 1955, 1962లలో పార్వతీపురం నుంచి గెలుపొందారు.