కొల్లాపూర్ మామిడికి ‘ధరా’ఘాతం
► సగానికి పడిపోయిన ధరలు
► మంత్రి చొరవ చూపినా ఎగుమతికి లభించని అనుమతి
► చేతులెత్తేసిన ఏపీఈడీఏ.. లబోదిబోమంటున్న రైతులు
సాక్షి, నాగర్‌కర్నూల్: కొల్లాపూర్ మామిడికి సరైన గిట్టుబాటు ధర లభించపోవడంతో రైతులు విలవిల్లాడుతున్నారు. ఈ ఏడాది మామిడి రైతును గాలివాన బీభత్సం తీవ్రంగా నష్టపరిచింది. మిగిలిన కొద్దిపాటి పంటకు ధర లేకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ సంస్థానాల నాటి నుంచి మామిడి తోటలకు ప్రసిద్ధిగాంచింది. జిల్లాలో సుమారు 70 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. మూడు లక్షలకు పైగా మామిడి చెట్లనే ఆధారం చేసుకుని రైతులు వేలాది రూపాయల పెట్టుబడి పెట్టారు.
గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని కొన్నేళ్లుగా రైతులు పట్టుబడుతున్నారు. దీంతో గత ప్రభుత్వం ఏపీఈడీఏ ద్వారా ఇక్కడి మామిడి పండ్లను కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. రైతుల నుంచి నాణ్యమైన పండ్లను కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తామని ఈ సంస్థ నమ్మబలికి కిలో రూ.50 చొప్పున కొనుగోలు చేసేందుకు అంగీకరించింది. మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు మామిడి వ్యాపారులతో పలు సందర్భాల్లో చర్చలు జరిపారు.
అయినప్పటికీ బడా వ్యాపారులు ఎవరి మాటలూ పట్టించుకోవడంలేదు. మామిడి కొనుగోళ్ల సమయంలో ముఖం చాటేశారు. దీంతో ఇక్కడి రైతాంగం నేరుగా హైదరాబాద్‌లోని కొత్తపేట పండ్ల మార్కెట్‌కు పెద్ద మొత్తంలో మామిడిని అమ్మకానికి తరలిస్తున్నారు. అక్కడి వ్యాపారులు వీరికి కిలో రూ.12 నుంచి రూ.25 వరకు మాత్రమే ధర చెల్లిస్తున్నారు. ఇలా సగానికి పడిపోవడంతో మామిడి రైతు లబోదిబోమంటున్నారు.
మంత్రి ఆదేశించినా..
ఇటీవల జిల్లాకు చెందిన మామిడి రైతులు తమను ఆదుకోవాలంటూ హైదరాబాద్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావుకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయన పండ్ల మార్కెట్‌కు వెళ్లి వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. కనీసం రూ.30 ప్రకారం అయినా మామిడిని కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఆయన ఒత్తిడికి తట్టుకోలేక వ్యాపారులు ఒకరోజు మొత్తం మార్కెట్‌నే బంద్ పెట్టడంతో గత్యంతరం లేక రైతులంతా వెనుదిరగాల్సి వచ్చింది.