కొల్లేరు సమస్యలను పార్లమెంటులో చర్చిస్తాం
మంత్రి కామినేని శ్రీనివాస్
కైకలూరు : కొల్లేరు సమస్యలను పార్లమెంటులో చర్చకు తెచ్చేలా ప్రయత్నిస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. సోమవారం స్థానిక మత్స్య శాఖ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సుప్రీం కోర్టు పరిధిలో కొల్లేరు అంశం ఉండడంతో అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. కొల్లేరు ఆపరేషన్ సమయంలో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 14 వేల ఎకరాల జిరాయితీ పట్టా భూముల్లో చేపల చెరువులను ధ్వంసం చేశారన్నారు. ఆ సమయంలో రైతులకు ఎటువంటి నష్టపరిహారం చెల్లించలేదని చెప్పారు. ముందుగా పట్టా భూములను తిరిగి పంపిణీ చే యాలని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్‌ను కోరామని తెలిపారు.
వీటితో పాటు రెండు జిల్లాల్లో 136 సొసైటీలకు చెందిన 30 ఎకరాలు, కృష్ణా జిల్లాలో కొల్లేరు ఆపరేషన్ సమయంలో అదనంగా ధ్వంసం చేసిన 7500 ఎకరాలను పంపిణీ చేయాలని ఆదివారం రాజమండ్రి సభకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లామన్నారు. కొల్లేరు అభయారణ్యానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా సుప్రీంకోర్టు నియమించిన సాధికారిత కమిటీ ఆమోదించాల్సి ఉందన్నారు. కైకలూరు మండలం పందిరిపల్లిగూడెం వద్ద పెద్దింట్లమ్మ వారధి నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి కామినేని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, జెడ్పీటీసీ సభ్యురాలు బొమ్మనబోయిన విజయలక్ష్మి, ఎంపీపీ బండి సత్యవతి పాల్గొన్నారు.