Kollywood sources
-
సమంత అవుట్ అమలాపాల్ ఇన్
ధనుష్, అమలాపాల్‌లది హిట్ జంట అని చెప్పవచ్చు. వీరిద్దరూ కలిసి నటించిన వేలై ఇల్లా పట్టాదారి చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అదే విధంగా ఇటీవల ధనుష్ నిర్మించిన అమ్మకణక్కు చిత్రంలో అమలాపాల్ ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా మరోసారి ధనుష్‌తో కలిసి నటించడానికి అమలాపాల్ రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. అయితే నటి సమంత నటించాల్సిన పాత్రలో అమలాపాల్‌ను ఎంపిక చేసినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. అసలు విషయం ఏమిటంటే ధనుష్ దర్శకుడు వెట్రిమారన్‌ల కాంబినేషన్లో వడచెన్నై చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. దీన్ని దర్శకుడు మూడు భాగాలుగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇందులో ధనుష్‌కు జంటగా సమంతను ఎంపిక చేశారు.అయితే తను టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్యతో ఏడడుగులు నడవడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో వడచెన్నై చిత్రం నుంచి వైదొలగినట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆమె పాత్రలో నటి అమలాపాల్‌ను ఎంపిక చేసినట్లు, ఈ విషయాన్ని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్,ధనుష్ వుండర్‌బార్ ఫిలింస్, దర్శకుడు వెట్రిమారన్ గ్రాస్ రూట్ ఫిలిం కంపెనీ సంయుక్తంగా నిర్మించనున్నాయని సమాచారం. -
తెరి దర్శకుడితో కార్తీ?
తెరి చిత్ర దర్శకుడితో కలిసి పనిచేయడానికి నటుడు కార్తీ రెడీ అవుతున్నారా? దీనికి కోలీవుడ్ వర్గాల నుంచి అలాంటి అవకాశం లేకపోలేదనే సమాధానం వస్తోంది. తొలి చిత్రం రాజారాణితోనే తమిళ చిత్ర పరిశ్రమ దృష్టిని తనవైపు తిప్పుకున్న దర్శకుడు అట్లీ. శంకర్ శిష్యుడైన ఈయన తన రెండో చిత్రంతోనే విజయ్ వంటి స్టార్ హీరోతో పనిచేసి ఆయనకు అద్భుత విజయాన్ని అందించి తనూ క్రేజీ దర్శకుడిగా ఎదిగారు. ఆ చిత్రమే తెరి. కాగా ఆ చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తున్న దర్శకుడు అట్లీ తాజా చిత్రానికి సిద్ధం అవుతున్నారు. తన తాజా చిత్ర వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని తెరి సక్సెస్ మీట్లో చెప్పారు. అందుకు సమయం ఆసన్నమైనట్లు సమాచారం. యువ నటుడు కార్తీని తన తాజా చిత్రానికి కథానాయకుడిగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ నిర్మించనున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్ర నిర్మాణం ప్రస్తుతం చర్చల్లోనే ఉన్నట్లు తెలిసింది. కార్తీ ప్రస్తుతం కాష్మోరా చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. గోకుల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార, శ్రీదివ్య కథానాయికలుగా నటిస్తున్నారు. తదుపరి మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ అతిథిరావు నాయకిగా నటించనున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఆ తరువాత అట్లీ దర్శకత్వంలో నటించే చిత్రం ఉండే అవకాశం ఉంది. -
అంజలీనా మజాకా!
హీరో అయినా, హీరోయిన్ అయినా ఒక స్థాయి వరకే దర్శక నిర్మాతలకు అణుకువగా నడుచుకుంటారన్న విషయం నటి అంజలి విషయంలో మరోసారి రుజువైంది. నయనతార నటించిన దెయ్యం ఇతివృత్తంతో కూడిన మాయ చిత్రం విజయం సాధించడంతో ఆ తరహా చిత్రాలు మరిన్ని ఆమె ఇంటి ముందు క్యూ కడుతున్నాయి. అయితే నయనతార డిమాండ్ చేస్తున్న పారితోషికం చూసి దర్శక నిర్మాతలకు నోటమాట రావడంలేదు. అలా ఆమెను దృష్టిలో పెట్టుకుని రాసిన కథను దర్శకుడు సర్వేశ్ ఇప్పుడు నటి అంజలితో తెరకెక్కిస్తున్నారు. ఒక పక్క ఇరైవి చిత్రంలో నటిస్తూనే అంజలి ఈ చిత్రం చేస్తున్నారు. దీనికి కాన్బదు పొయ్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ చిత్రం ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇటీవల రెండో షెడ్యూల్‌ను కున్నూర్‌లో జరుపుకుంటోంది. తొలిరోజునే అంజలి షూటింగ్ స్పాట్‌కు రాకుండా హోటల్ గదిలోనే కూర్చొని చిత్ర యూనిట్‌కు జర్క్ ఇచ్చారట. ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి అర్ధరాత్రి రెండు గంటల వరకూ అంజలిని కాల్షీట్స్ అడిగారట. అందుకు అంగీకరించిన ఆమె మధ్యాహ్నం రెండు గంటలకు రెడీ అయి షూటింగ్ స్పాట్ వెళ్లాలని ప్రయత్నించగా తనకు క్యారవన్ వ్యాన్‌ను కేటాయించకపోవడంతో హోటల్ గదిలోనే ఉండిపోయారు. దీంతో చిత్ర యూనిట్ సాయంత్రానికల్లా అంజలికి క్యారవన్ వ్యాన్ ఏర్పాటు చేయడంతో షూటింగ్లో పాల్గొన్నారు. అలా చిన్న చిన్న విషయాలకు కూడా సర్దుకుపోకపోవడంతో చిత్ర యూనిట్ అంజలి విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారట. దీంతో అంజలినా మజాకా అంటున్నారు కోలీవుడ్ వర్గాలు. -
గాయనీమణుల జాబితాలో అంజలి
ఇవాళ హీరోలే కదు హీరోయిన్లూ పాడేస్తున్నారు. చాలామంది తమ పాత్రలకు డబ్బింగ్ చెప్పుకోవడానికే వెనుకాడుతున్న ఈ రోజుల్లో సమంతలాంటి కొందరు ఆ ప్రయత్నం చేయడం హర్షణీయమే. మరి కొందరు కథానాయకిలు ఇంకో అడుగు ముందుకేసి పాటలు కూడా పాడేస్తున్నారు. మమతా మోహన్‌దాస్, రమ్యానంబీశన్, లక్ష్మీమీనన్, అనన్యలాంటి వారు ఇప్పటికే తమ గొంతులు సవరించుకుని శభాష్ అనిపించుకున్నారు. ఇప్పుడీ కోవలో నటి అంజలి చేరారు. సంచలన నటిగా గుర్తింపు పొందిన ఈ పదహారణాల ఆంధ్రాపోరి చిన్న గ్యాప్ తరువాత రీఎంట్రీ అయ్యి అటు తెలుగులోనూ, ఇటు తమిళంలోనూ బిజీ నాయకి అయిపోయారు. కాగా ఇప్పుడు కొత్తగా గాయని అవతారం ఎత్తారు. తమిళంలో నటిస్తున్న యార్ నీ చిత్రంలో ఒక పాట పాడారు అంజలి. ఆ చిత్ర తెలుగు వెర్షన్ చిత్రాంగద చిత్రంలో కూడా తనే పాడడం విశేషం. హారర్ ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ అధిక భాగం అమెరికాలో జరుపుకోవడం మరో విశేషం. ఈ ద్విభాషా చిత్రంలో సంగీత దర్శకుడు తమన్ సోదరి యామిని ఒక పాట పాడారని సమాచారం. అంజలికి ఇటీవల తెలుగులో గీతాంజలి, డిక్టేటర్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలు వచ్చినా తమిళంలో సరైన హిట్ రాలేదు. ఈ విషయంలో కూడా అంజలి ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. మరి తాజా చిత్రం యార్ నీ ఈ బ్యూటీకి ఏపాటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. ఇక విమల్ సరసన నటించిన మాప్పిళై సింగం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. -
అనుష్కపై కోలీవుడ్ గుర్రు
సెలబ్రిటీల జీవితం తెరచిన పుస్తకం లాంటిది. ప్రతి సాధారణ వ్యక్తీ చదవడానికి ఆసక్తి చూపిస్తాడు. అందుకే సెలబ్రిటీలు ఏ విషయంలోనైనా ఆచితూచి అడుగెయ్యాలి. ముఖ్యంగా వ్యాఖ్యలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకుంటే చిక్కులు తప్పవు. ఇక తారల విషయానికొస్తే మొన్న నచ్చిన హీరో అజిత్ అంటూ నటి త్రిషే నోరుపారేసుకుని నటుడు విజయ్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. అలాంటి పొరపాటే నటి అనుష్క చేసి సమస్యలు కొని తెచ్చుకున్నారని కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. అందాల భామ అనుష్క ఇటీవల ఓ భేటీలో తన అభిమాన నటులెవరన్న ప్రశ్నకు అభిషేక్ బచ్చన్, షారూఖ్‌ఖాన్, హృతిక్ రోషన్ అంటూ బాలీవుడ్ నటులను చెప్పడం తమిళం, తెలుగు చిత్ర పరిశ్రమల్లో కలకలం రేకెత్తించింది. నిజానికి ఈ బ్యూటీ తమిళంలో విజయ్, అజిత్, సూర్య, విక్రమ్ వంటి టాప్ హీరోలతో, తెలుగులో నాగార్జున, వెంకటేష్, మహేష్‌బాబు, ప్రభాష్ వంటి స్టార్ హీరోలతో నటించి ప్రముఖ హీరోయిన్ స్థాయికి చేరుకున్నారు. అలాంటి వీరిలో ఎవరినీ తన అభిమాన హీరోగా చెప్పకుండా బాలీవుడ్ హీరోల పేర్లను చెప్పడం దక్షిణాది అభిమానుల కోపోగ్రహానికి గురయ్యారు. ఇప్పుడు వారంతా అనుష్కాకు వ్యతిరేకం. ఫేస్బుక్ల్లోను, ట్విట్టర్లలోనూ తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. అభిమానుల ఆగ్రహానికి గురైన ఏ హీరోయిన్ మనలేదన్నది అనుష్క, త్రిష లాంటి వారు గ్రహించాలంటున్నారు సినీ పండితులు.