వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
- వాగులో మునిగి వృద్ధుని మృతి
గిద్దలూరు రూరల్ : వినాయక నిమజ్జనం సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. ఓ వృద్ధుడు వాగులో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మండలంలోని కొమ్మునూరు పంచాయతీ పరిధి ఎగ్గన్నపల్లిలో బుధవారం జరిగింది. అందిన వివరాల ప్రకారం.. గ్రామంలో వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు యువకులు సగిలేరు, ఎనుమలేరులు కలిసే చోట వాగు వద్దకు ఊరేగింపుగా వెళ్లారు. ఆ సమయంలో అటువైపుగా పొలాల్లో ఉన్న బత్తుల రామయ్య (62) యువకులతో కలిసి నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నాడు. రామయ్య ప్రమాదవశాత్తూ వాగులో మునిగి ఊపిరాడక మృతి చెందాడు. అనంతరం యువకులంతా రామయ్య మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. సమాచారం అందుకున్న ఎస్సై రాంబాబు సంఘటన స్థలానికి వివరాలు సేకరించారు. వీఆర్ఓ రమణ ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.