ఇంటింటికీ నల్లా ద్వారా నీరందిస్తాం
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు
నార్నూర్ : కొమురం భీమ్ ప్రాజె క్టు పైపులైన్ల ద్వారా 20 రోజుల్లో తాగు నీటి సౌకర్యం కల్పిస్తామని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో నూతన ఎంపీడీవో కార్యాలయ భవన నిర్మాణంతో పాటు 30 పడకల ఆస్పత్రి నిర్మాణానికి ఎంపీ గెడం నగేశ్, ఎమ్మెల్సీ పురాణం సతీష్‌లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా రూ. 10 కోట్లు మంజూరు చేసినట్లు నాయకులు తెలిపారు. ప్రస్తుతం గ్రామాల్లో ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. రూ. కోటితో ఎంపీడీవో కార్యాలయ నూతన భవనం, రూ, 3.60 కోట్లతో 30 పడకల ఆస్పత్రి నిర్మించనున్నట్లు తెలిపారు. నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. మిషన్ కాకతీయలో రెండో విడత పనుల్లో భాగంగా గంగాపూర్, నార్నూర్ చెరువు మరమ్మతు పనులు ప్రారంభించారు.
అభివృద్ధికి అడ్డు పడితే ఊరుకోం - ఎమ్మెల్సీ పురాణం సతీష్
తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్, టీడీపీలకు లేదని ఎమ్మెల్సీ పురాణం సతీష్ అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో అభివృద్ధి అభివృద్ధి పనులు అడ్డుకోవాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రూపావంతిజ్ఞానోబా పుస్కర్, ఎంపీపీ రాథోడ్ గోవింద్‌నాయక్, సర్పంచ్ బానోత్ గజానంద్‌నాయక్, తోడసం నాగోరావ్‌లు, ఎంపీటీసీలు సురేశ్, పీఆర్ ఈఈ వెంకటరాం జాదవ్, డీఈ వశీహైమద్, ఏఈఈ ధర్మేందర్, ఎంపీడీవో శివలాల్, తహసీల్దార్ దేవానందం, టీఆర్ఎస్ నాయకులు హన్మంతరావ్, లోఖండే చంద్రశేఖర్, కొర్రళ్ల మహేందర్, రూప్‌దేవ్, మోతే రాజన్న, హైమద్ ఉన్నారు.
టీఆర్ఎస్ హయాంలో కాకతీయ కళావైభవం మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
సారంగాపూర్ : టీఆర్ఎస్ హయాంలో మిషన్ కాకతీయ ద్వారా తెలంగాణ కళావైభవం పునరావృతం కానుందని దేవాదాయ, న్యాయ, గృహనిర్మాణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మండలంలోని గోపాల్పేట్ గ్రామంలో మిషన్ కాకతీయ పథకంలో భాగంగా గ్రామంలో ఊరచెరువు అభివృద్ధికి సోమవారం భూమిపూజ నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గోపాల్పేట్ ఊరచెరువు అభివృద్ధికి గాను 29లక్షలు మంజూరైనట్లు పేర్కొన్నారు. మండల ఉపాధ్యక్షుడు నారాయణరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ పోడెల్లి గణేష్, నాయకులు నల్ల వెంకట్రామిరెడ్డి ఉన్నారు.