వనదేవతల ఆశీస్సులతో జగన్ సీఎం కావాలి
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మ ఆశీస్సులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీ సీఎం కావాలని పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి ఆకాంక్షించారు. శనివారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడారం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎత్తు(72 కిలోలు) బంగారాన్ని మొక్కుగా చెల్లించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఏపీ రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి చేపట్టిన సంకల్ప యాత్ర దిగ్విజయంగా పూర్తి కావాలని తల్లులను వేడుకున్నట్లు తెలిపారు.
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో జాతర అభివృద్ధికి కోట్లాది నిధులు మంజూరు చేసి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. వైఎస్ సీఎం హోదాలో జరిగిన రెండు జాతరలకు హాజరయ్యారన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ జాతరకు హాజరు కాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్మోహన్రెడ్డికి వనదేవతలపై ఎంతో నమ్మకం ఉందన్నారు. 2019లో ఏపీ సీఎం అయితే దర్శనం కోసం సమ్మక్క సన్నిధికి తీసుకుస్తామని తెలిపారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి నాడెం శాంతకుమార్, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు కె.అచ్చిరెడ్డి, రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి రజనీకాంత్ తదితరులున్నారు.