గుంతలమయంగా కొండమడుగు రోడ్డు
కొండమడుగు(బీబీనగర్)
మండలంలోని కొండమడుగు మెట్టు నుంచి కొండమడుగు గ్రామం మీదుగా ఉన్న ఆర్అండ్బీ రోడ్డుపై అడుగుకో గుంత ఏర్పడింది. నిత్యం ఈరహదారి మీదుగా వాహనాల రాకపోకల రద్దీ ఎక్కువగా ఉండడం, గ్రామ పరిసర ప్రాంతంలో పరిశ్రమలు, పశువుల సంత ఉండడం వలన ఒవర్లోడ్తో వెళ్తున్న లారీలు ఇతర వాహనాల కారణంగా రహదారి అధ్వానంగా తయారైంది. దీనికి తోడు సింగిల్ రోడ్డు కావడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినప్పటì కీ రోడ్డు మరమ్మతులకు నోచుకోవడం లేదు. గతంలో నాణ్యత లేకుండా మరమ్మతుల పనులు చేపట్టడంతో రోడ్డు యథాస్థితికి చేరింది.
ఆరు నెలలవుతున్నా..
కొండమడుగు మెట్టు నుంచి కొండమడుగు గ్రామం మీదుగా నాయినంపల్లి, బొమ్మలరామారం వరకు గల ఈరహదారిని డబుల్రోడ్డుగా మార్చేందుకు 6నెలల క్రితం ఆర్అండ్బీ శాఖ నుంచి 16కోట్ల రుపాయల నిధులను మంజూరు చేశారు. కాని ఇప్పటి వరకు రోడ్డు నిర్మాణంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కొన్ని ప్రాంతాలలో నిధులు లేక రోడ్లు మరమ్మతులకు నోచుకోకపోగా ఇక్కడ నిధులున్నా పనులు జరగని పరిస్థితి నెలకొంది.
కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే..
రహదారిని డబుల్ రోడ్డుగా మార్చేందుకు నిధులు మంజూరు కావడంతో టెండర్లు వేయగా ఓ కాంట్రాక్టర్ పనులు చేసేందుకు మందుకు వచ్చి టెండర్ దక్కించుకున్నాడు. ఈప్రక్రియ జరిగి 6నెలలవుతున్నా సంబంధిత కాంట్రాక్టర్ ఇప్పటి వరకు పనులు చేపట్టకుండా ఊదాసీనంగా వ్యవహరించడంతో వాహనదారుల పాలిట శాపంగా మారింది.
పట్టించుకోని ఉన్నతాధికారులు
టెండర్ ప్రక్రియ పూర్తయి 6 నెలలవుతున్నా కాంట్రాక్టర్ పనులు చేపట్టకపోవడం పట్ల ఆర్అండ్బీ శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ 6నెలలుగా పనులు ప్రారంభించకుండా నిర్లక్ష్యం చేస్తున్నా అధికారులు మాత్రం అతన్ని మార్చి మరొకరికి కాంట్రాక్ట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలి– కడెం చంద్రశేఖర్, ఎంపీటీసీ, కొండమడుగు
రోడ్డు గుంతలమయం కావడం, సింగిల్ రోడ్డు కావడంతో తరుచూ ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిని డబల్రోడ్డుగా నిర్మించేందుకు నిధులు మంజూరైనా కాంట్రాక్టర్ పనులు ప్రారంభించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకొని పనులు జరిగేలా చూడాలి.
ప్రమాదాలకు గురవుతున్నాం– పాండు, కొండమడుగు,
రోడ్డు ఎక్కడికక్కడ గుంతలుగా ఏర్పడడంతో రాత్రి వేళల్లో ప్రమాదాలకు గురవుతున్నా. రోడ్డు పొడువునా మాలమలుపులు ఉండడం, కంకర రాళ్లు తేలి ఉండడంతో వాహనాలను నడపలేకపోతున్నాం.
కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే..– రామరాజు, ఆర్అండ్బీ, ఏఈ, బీబీనగర్
రోడ్డు పనులను చేసేందుకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వహిస్తుండడంతోనే పనులు జరగడం లేదు. 16కోట్ల నిధులు మంజూరై 6నెలలు కావస్తున్నా కాంట్రాక్టర్ పనులు చేయకపోవడంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో కాంట్రాక్టర్ను మార్చి మరొకరికి కాంట్రాక్ట్ ఇచ్చి రోడ్డు పనులు జరిగేలా చూస్తాం.