Kondapalli Appalanaidu
-
‘రిపోర్టులు బాగాలేవన్నారు.. టికెట్ ఇచ్చారు..!’
సాక్షి, విజయనగరం : టీడీపీలో టికెట్ల పంచాయతీ కొనసాగుతోంది. టికెట్లు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ నిరసన గళాలు వినిపిస్తుండగా.. అవినీతి ఆరోపణలున్న నేతలకు టికెట్ ఇస్తే సహించేది లేదని పార్టీ నేతలు తెగేసి చెప్తున్నారు. టీడీపీ తొలి జాబితాలో గజపతి నగరం టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడుకి కేటాయించడంపై అసమ్మతి వెల్లువెత్తుతోంది. అవినీతి ఆరోపణలు, అధికారులపై వేధింపులు వంటి అంశాల్లో అపప్రద మూటగట్టుకున్న అప్పలనాయుడుకి సీటిస్తే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని ఆయన సోదరుడు, పార్టీ సీనియర్ నాయకుడు కొండపల్లి కొండలరావు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కేఏ నాయుడుకు వ్యతిరేకంగా అనేక అంతర్గత సర్వేల రిపోర్టులు తమవద్ద ఉన్నాయని చెప్పిన టీడీపీ మరలా ఆయనకే అవకాశం ఇచ్చిందని మండిపడ్డారు. కేఏ నాయుడును బరిలోకి దించి పార్టీని నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ కొండలరావు ఆధ్వర్యంలో పార్టీ నేతలు, పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. రేపటి (ఆదివారం) ముఖ్యమంత్రి పర్యటనలో గజపతినగరం అభ్యర్థిని మార్చే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. -
అప్పలనాయుడా మజాకా!
-
వైజాగ్‌లో నీ అంతు చూస్తా
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘బిల్లులు క్లియర్ చేయరా.. నువ్ చెబితే నేను వినాలా.. వేషాలేస్తున్నావా.. ఏమనుకుంటున్నావ్ ప్రజాప్రతినిధులంటే.. బయటకురా నీ కథ తేలుస్తా.. వైజాగ్‌లో ఉంటావ్గా రా..అక్కడే నీ అంతు చూస్తా.’ అంటూ అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు రెచ్చిపోయారు. విజయనగరం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన తిట్ల పురాణం అందుకుని, బెదిరింపుల పర్వానికి తెరలేపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి అధ్యక్షతన ఆదివారం సర్వసభ్య సమావేశం జరిగింది. మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు, అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, కలెక్టరు వివేక్‌యాదవ్, జిల్లా అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఎలాంటి చర్చ లేకుండా బడ్జెట్‌ను ఆమోదించారు. పంచాయతీరాజ్ రోడ్ల పనులకు సంబంధించిన బిల్లులు సకాలంలో విడుదల చేయడం లేదని, తమ ప్రాంతంలో జరిగే అధికారిక సమావేశాలకు తమను పిలవడం లేదనే అంశాలపై టీడీపీ సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. వీటికి అధికారులు సమాధానం చెబుతుండగా గజపతినగరం ఎమ్మెల్యే అప్పలనాయుడు వారిపై రెచ్చిపోయారు. ఇంజనీరింగ్ అధికారులు సక్రమంగా పని చేయడం లేదని, కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారని విమర్శిస్తూ ఆగ్రహంతో ఊగిపోయారు. పంచాయతీరాజ్ ఎస్ఈ సుబ్రహ్మణ్యం, పార్వతీపురం ఈఈ వీఎస్ఎన్ మూర్తి, విజయనగరం ఈఈ వైవీ శాస్త్రి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడంతో ఎమ్మెల్యే మరింతగా రెచ్చిపోయారు. దీంతో అధికారులు మౌనంగా ఉండిపోయారు. అనంతరం వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఏడీ జీవన్‌బాబుపై టీడీపీ సభ్యులు విరుచుకుపడ్డారు. గరివిడిలో సమావేశం పెట్టి తనకు, ఇతర ప్రజాప్రతినిధులకు చెప్పలేదంటూ జెడ్పీ ఉపాధ్యక్షుడు బలగం కృష్ణమూర్తి ఆరోపించారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఎమ్మెల్యే అప్పలనాయుడు కలెక్టర్‌ను కోరగా, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. బెదిరింపులతో మౌనంగా నిల్చున్న అధికారులు తిరుగుబాటుకు సిద్ధమవుతున్న అధికారులు.. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తమపై చేసిన ఆరోపణలు, దూషణలపై జిల్లా అధికారులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఏజేసీ కె.నాగేశ్వరరావు అధ్యక్షతన జిల్లాలోని ప్రభుత్వ విభాగాల అధిపతులు దాదాపు 25 మంది సాయంత్రం కలెక్టరేట్లో సమావేశమయ్యారు. జెడ్పీ సమావేశంలో అధికారులను టీడీపీ నేతలు బూతులు తిట్టడం, బెదిరించడం వంటి పరిణామాలను తీవ్రంగా ఖండించారు. బూతులతో విరుచుకుపడటం అధికారపక్ష నేతలకు అలవాటుగా మారిందని, ఈ పరిస్థితుల్లో జిల్లాలో ఇక పనిచేయలేమని వారంతా అభిప్రాయపడ్డారు. అధికారులను దూషించిన వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలంటూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని తీర్మానించారు. కలెక్టర్ వివేక్ యాదవ్ అందుబాటులో లేకపోవడంతో సోమవారం తమ ఫిర్యాదును ఆయనకు అందజేయనున్నారు. -
నిలదీస్తే అరదండాలే..!
విజయనగరం కంటోన్మెంట్: సమస్యలున్నాయంటూ వచ్చే ప్రజలు గ్రామ సభలో నిలదీసి ప్రశ్నిస్తే అరెస్టు చేయిస్తామని గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు చేసిన వ్యాఖ్యలు వినతులు ఇచ్చేందుకు వచ్చిన వారిని ఆందోళనకు గురిచేశాయి. జిల్లా వ్యాప్తంగా గురువారం నిర్వహించిన జన్మభూమి గ్రామసభల్లో అధికారులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీశారు. పాత సభల్లోని వినతులను పరిష్కరించకుండా ఇప్పుడెందుకొచ్చారని ఎక్కడికక్కడ నిలదీశారు. గంట్యాడ మండలంలోని లక్కిడాంలో గురువారం జన్మభూమి గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు అక్కడికి వచ్చి తమను అన్యాయంగా తొలగించారనీ, ఎటువంటి కారణాలు చూపకుండా తొలగించడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై ఎంఎల్ఏ మాట్లాడుతూ ఆ వ్యవహారం కోర్టులో ఉంది కదా! కోర్టు తేలుస్తుంది. మాకు నచ్చినట్టు చేస్తాం. లేకపోతే లేదు. అంతే అంటూ గ్రామ సభ సాక్షిగా అనడంతో అక్కడి వారంతా అవాక్కయ్యారు.తమను ఎందుకు తొలగించారన్న ఫీల్డ్ అసిస్టెంట్ల ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. పార్వతీపురం మండలం పెదబొండపల్లి, సూడిగాం, పుట్టూరు గ్రామాల్లో సమస్యలు పరిష్కరించడం లేదని ప్రజలు అన్నప్పుడు అధికారులు సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా మిన్నకుండిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బలిజిపేట మండలం గలావిల్లిలో గ్రామసభకు వచ్చిన అధికారులు పింఛన్లు, రేషన్ కార్డులను అర్హులైన అందరికీ ఎందుకు ఇవ్వడం లేదని, పార్టీ ప్రకారంగా ఇస్తున్నారని వైఎస్సార్ సీపీకి చెందిన ఎం శ్రీకాంత్ ప్రశ్నించారు. ఇక్కడ టీలు, మంచినీరు అందించేందుకు విద్యార్థులను నియమించుకోవడంపై పలువురు నిర్ఘాంత పోయారు. ‘దారి’ చూపి సభ పెట్టండి సీతానగరం మండలం రంగంపేటలో కలెక్టర్ ఎంఎం నాయక్, ఎమ్మెల్యే చిరంజీవులు పాల్గొన్నారు. కొమరాడ మండలం దేవుకూనలో రహదారి నిర్మించాలని ఏళ్ల తరబడి అవస్థలు పడుతున్నా పట్టించుకోకపోవడం ఏంటని ముందు రహదారి సంగతి తేలాకే గ్రామసభ నిర్వహించాలని పట్టుపట్టారు. కురుపాం మండలం జి శివడలో ఎల్ఈడీ దీపాలకు రూ.50 చొప్పున వసూలు చేస్తున్నారని గ్రామస్తులు నిలదీశారు. అలాగే విద్యుత్ మీటర్లు వేయించేందుకు కూడా అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. విజయనగరంలోని 18,29 వార్డుల్లో జరిగిన జన్మభూమి గ్రామసభల్లో పింఛన్లు, రేషన్ కార్డులను టీడీపీ కార్యకర్తలకే ఇస్తున్నారని ఎమ్మెల్యే మీసాల గీత, మేయర్ ప్రసాదుల రామకృష్ణలను వైఎస్సార్ సీపీ నాయకులు ఆశపు వేణు తదితరులు నిలదీశారు. మెరకముడిదాం మండలం సోమలింగాపురంలో గడచిన రెండు విడతల జన్మభూమి గ్రామసభల్లో గుర్తించిన సమస్యలు, వచ్చిన దరఖాస్తులను ఎందుకు పరిష్కరించలేదని విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి బెల్లాన చంద్రశేఖర్, స్థానిక నాయకులు బూర్లి నరేష్, ఎస్‌నారాయణ మూర్తి, రాజు, నాని తదితరులు నిలదీశారు. పెన్షన్లు, రుణమాఫీ, రేషన్ కార్డుల సమస్యలను పరిష్కరించని ఈ గ్రామ సభలు ఎందుకని ప్రశ్నించారు. బొబ్బిలిలోని 5,6 వార్డుల్లో నిర్వహించిన గ్రామసభల్లో జూట్ మిల్లు తెరిపించాలని సీఐటీ యూ నాయకులు రెడ్డి వేణు, పొట్నూ రు శంకరరావు, రమణమ్మలు అధికారులను కోరారు. తెర్లాం మండలం నంది గాం, సతివాడ, కుసుమూరు గ్రామాల్లో అర్హులకు పింఛన్లు ఇవ్వలేదని నిలదీశా రు. ఎస్ కోట మండలంలోని ధర్మవరం గ్రామంలో ఇళ్లు, పింఛన్లు, మరుగుదొడ్ల బిల్లులు ఇవ్వలేదని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఎదుటే ప్రజలు అధికారులను నిలదీశారు.