బేషరతుగా వృద్ధాప్య ఫించను
తెలంగాణ రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్లు రద్దుకావడంతోనో, మం జూరు కాలేదనే బెంగతోనో వృద్ధులు పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారని వార్తలు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏమాత్రం జాగు చేయ కుండా, కనీసం 58 ఏళ్లు పైబడిన వృద్ధులందరకు బేషరతుగా వృద్ధాప్య పింఛన్లను మంజూరు చేయాలి. ఒక ఇంట్లో ఒకరికంటే ఎక్కువ పెన్షన్లు ఉండరాదనే షరతును తొలగించాలి. వృద్ధులు, వితంతువులు ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. వీరందరికీ బేషరతుగా పెన్షన్లు ఇవ్వాలి.
అలాగే అప్పుల భారంతో మరణించిన రైతుల విషయంలో ఆయా ప్రాంతాల్లో అఖిలపక్ష నాయకుల ద్వారా సమాచారం సేకరించి వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం కనీసం రూ.3 లక్షలకు తగ్గకుండా సహాయం చేయాలి. ప్రభుత్వ హామీల ను, వాగ్దానాలను నెరవేర్చడానికి ప్రభుత్వ స్థలాలను, భూములను అమ్మాలనే తలంపును విరమించుకోవాలి. తాత్కాలిక అవసరాల కోసం స్థిరాస్తులను అమ్మడం అసమంజసం. రాబోయే కాలాల్లో భూసేకరణ అసాధ్యం కావచ్చు. నిధుల సేకరణ కోసం ఇతర మార్గాలను అన్వేషించాలి. ప్రజలను భారీగా పొదుపు చేసే విధానాలను చేపట్టి వారిని ప్రోత్సహించి భాగస్వాములను చేయాలి. ఆస్తులను తెగనమ్మి అభివృద్ధి చేయడాన్ని ప్రజలు హర్షించరు.
- కొండవీటి దామోదర్ రెడ్డి, నల్లగొండ