మాజీ నక్సలైట్ దారుణ హత్య
పినపాక, న్యూస్‌లైన్: మండల పరిధిలోని జానంపేటలో శనివారం తెల్లవారుజామున దారుణ హత్య జరిగింది. కరీంనగర్ జిల్లా మహముత్తారం మండలం బోర్లగూడెం గ్రామానికి చెందిన గండ్ర శ్రీనివాసరావు(35)ను గుర్తుతెలియని వ్యక్తులు గొంతుకోసి హత్య చేశారు. ఏడూళ్ల బయ్యారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహముత్తారం గ్రామానికి చెందిన గండ్ర రంగారావు, సరోజ పెద్ద కుమారుడు శ్రీనివాసరావు. జానంపేటకు చెందిన దుగ్యాల నర్సింహరావు కూతురు సంధ్యతో తొమ్మిదేళ్ల క్రితం ఇతడితో వివాహం జరిగింది. కొంత కాలం కరీంగనర్‌లో నివాసం ఉన్న వీరు గత ఏడాది వరంగల్ జిల్లా హన్మకొండలోని సుబేదారి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.
వీరికి ఏడేళ్ల వయస్సు ఉన్న కుమారుడు ఉన్నాడు. కుటుంబ సమేతంగా గురువారం అత్తగారిల్లు జానంపేటకు వచ్చిన శ్రీనివాసరావు రెండురోజులుగా బంధువుల ఇళ్లకు తిరిగాడు. జానంపేట నుంచి ముకుందాపురం వెళ్లే మార్గంలో భార్య అమ్మమ్మ ఇంటి వద్ద శుక్రవారం రాత్రి భార్య, కుమారుడితో కలిసి బస చేశాడు. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు వీరు నిద్రిస్తు గదిలోకి ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తులు చొరబడ్డారు. భార్యను పక్కకు తోసేసి శ్రీనివాసరావు గొంతు కోశారు. దీంతో శ్రీనివాసరావు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. కుటుంబ సభ్యులు బయటకు వెళ్లేందుకు యత్నించగా దుండగులు వారిని అడ్డుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని ఇంటి నుంచి రోడ్డుపైకి లాక్కొచ్చి పడేశారు. అనంతరం కేరింతలు కొడుతూ కారు ఎక్కి పరారయ్యారు.
హత్యకు కారణమేమిటి..?
శ్రీనివాసరావు హత్యపై పను అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2000 నుంచి 2008 వరకు శ్రీనివాసరావు కరీంనగర్ జిల్లాలో ప్రతిఘటన గ్రూపు ఏరియా ఆర్గనైజర్‌గా పనిచేసినట్లు సమాచారం. ప్రసాదన్న రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా ఉన్న ప్రతిఘటన గ్రూపులో బక్కన్న దళంలో పని చేసినట్లు తెలిసింది. 2008లో కరీంగనర్ పోలీసులకు శ్రీనివాసరావు లొంగిపోయాడు. అనంతరం కరీంనగర్ జిల్లాలో రియల్ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. భూ సెటిల్మెంట్లు కూడా చేసేవాడని తెలిసింది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఘర్షణలు చోటుచేసుకోవడంతో వరంగల్‌కు మకాం మార్చాడు. అక్కడా రియల్ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. వరంగల్‌లో లిక్కర్ వ్యాపారం కూడా చేసే వాడని సమాచారం. శ్రీనివాసరావుపై కరీంనగర్, వరంగల్ జిల్లాలో పలు కేసులు ఉన్నాయి. వ్యాపార లావాదేవీలు, భూసెటిల్మెంట్ వివాదాలే హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది.
పోలీసుల విచారణ
శ్రీనివాసరావు హత్యపై ఏడూళ్ల బయ్యారం పోలీసులు పలు కోణాల్లో విచారణ నిర్వహిస్తున్నారు. మణుగూరు, అశ్వాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్లు నర్సయ్య, డి.వేణుచందర్, ఏడూళ్ల బయ్యారం ఎస్సై కొండ్ర శ్రీనివాస్ సంఘనా స్థలానికి చేరుకుని వివరాలు, ఆధారాలు సేకరించారు. డాగ్‌స్క్వాడ్‌ను రప్పిం చి విచారణ చేపట్టారు.